Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు అడ్డుకట్ట వేసేందుకు...సెబీ ఆంక్షలు...

కరోనా మహమ్మారి వల్ల కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు మార్కెట్లో హెచ్చుతగ్గులను అరికట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు ఆంక్షలు విధించింది. 
 

Sebi tightens rules on short selling, raises margins on non-F&O stocks to curb volatility
Author
Hyderabad, First Published Mar 21, 2020, 12:34 PM IST

న్యూఢిల్లీ/ముంబై: మార్కెట్లు కరోనా మహమ్మారి తాకిడికి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే 32శాతం వరకు సూచీలు పతనమయ్యాయి. దీంతో సెబీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. హెచ్చుతగ్గులను అరికట్టేందుకు శుక్రవారం పలు నిర్ణయాలను ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ఒక నెల పాటు ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. 

ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలోని షేర్లకు మార్కెట్‌ వైడ్‌ పొజిషన్‌ లిమిట్ ‌(ఎండబ్ల్యూపీఎల్‌)ను అంటే మార్కెట్లో ట్రేడయ్యే షేర్ల పరిమాణం పరిమితిని ప్రస్తుత స్థాయిల నుంచి 50 శాతం మేర తగ్గించింది.ప్రస్తుతం ఇది 90 శాతంగా ఉంది.

సగటు రోజువారీ ధరల హెచ్చుతగ్గుల వ్యత్యాసం 15 శాతం, అంత కంటే ఎక్కువగా/ సగటు ఎమ్‌డబ్ల్యూపీఎల్‌ వినియోగ శాతం (ఓపెన్‌ ఇంట్రెస్ట్‌) 40 శాతం అంతకంటే ఎక్కువగా ఉంటే పై విధానాన్ని అమలు చేస్తారు. 

also read కస్టమర్ల ఆరోగ్యం కోసం డొమినోస్ పిజ్జా కొత్త సర్వీస్...

గత 5 ట్రేడింగ్‌ రోజుల గణాంకాల ఆధారంగా లెక్కగడతారు. సవరించిన ఎమ్‌డబ్ల్యూపీఎల్‌ ఈ నిషేధిత గడువులోని తాజా పొజిషన్లకే వర్తిస్తుంది. డెరివేటివ్‌ స్టాక్స్‌కున్న అర్హత ప్రమాణాలను నిర్ణయించడంలో దీనిని వినియోగించరు.

ఏదైనా ఒక సెక్యూరిటీలో ఎమ్‌డబ్ల్యూపీఎల్‌ వినియోగం (ఓపెన్‌ ఇంట్రెస్ట్‌) 95 శాతాన్ని అధిగమిస్తే.. అపుడు ఆ డెరివేటివ్‌ కాంట్రాక్టును నిషేధిత గడువులోకి మారుస్తారు. అంటే డెరివేటివ్‌ కాంట్రాక్టులో తమ పొజిషన్లను తగ్గించుకోవడానికి మాత్రమే ట్రేడింగ్‌ సభ్యులు ట్రేడింగ్‌ చేయాల్సి ఉంటుంది.

ఓపెన్‌ పొజిషన్లను పెంచుకుంటే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు/క్లియరింగ్‌ కార్పొరేషన్లు అందుకు తగ్గ చట్టబద్ధ/క్రమశిక్షణా చర్యలను తీసుకుంటాయి.

ప్రస్తుత అపరాధ రుసుములను పెంచుకోవడానికి సెబీ వీలు కల్పించింది. కనీస రుసుముకు 10 రెట్లు; గరిష్ఠ అపరాధ రుసుము 5 రెట్ల చొప్పున పెంచుకోవడానికి అనుమతినిచ్చింది.

మార్జిన్లను పెంచుకోవాలంటే ఆ షేర్లకు నిర్దిష్ట అర్హత ఉండాలి. దశలవారీగా కనీసం 40% వరకు మార్జిన్‌రేటును క్యాష్‌ మార్కెట్లో పెంచుకోవచ్చు. అది ఈ నెల 23 నుంచి కనీసం 20% వరకు; మార్చి 26 నుంచి కనీసం 30%; మార్చి 30 నుంచి కనీసం 40% మేర ఉండొచ్చు.

also read నాలుగు రోజుల్లో రిలయన్స్ రూ.1.20 లక్షల కోట్లు గోవిందా

ఎఫ్‌ అండ్‌ ఓ యేతర స్టాక్స్‌కు కూడా క్యాష్‌ మార్కెట్లో మార్జిన్ల పెంపునకు వీలుంటుంది. షరతులకు లోబడి మ్యూచువల్‌ ఫండ్‌లు, ఎఫ్‌పీఐలు, ట్రేడింగ్‌ సభ్యులు, క్లయింట్లకు ఈక్విటీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌లో ఎక్స్‌పోజర్‌ ఉండొచ్చు. ఈ విధానాలన్నీ సంస్థలు, ట్రేడింగ్‌ సభ్యుల(ప్రొప్రైటరీ)కు మార్చి 23 నుంచి మొదలయ్యే నెల రోజుల వ్యవధికి వర్తిస్తాయి. ఇతరులకు మార్చి 27 నుంచి వర్తిస్తాయి.

‘తాజా సెబీ ఆదేశాల వల్ల ఎఫ్‌ఐఐలు, డీఐఐలకు ప్రస్తుతం షార్ట్‌సెల్లింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మార్కెట్‌ నిలకడగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రా డే ట్రేడర్ల చేతులు కట్టేసినట్లే. ఎందుకంటే కేవలం హెడ్జింగ్‌కు మాత్రమే వీలు కల్పించినట్లయింది. దీని వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుంది. 

సెబీ ఆశించినట్లుగా హెచ్చుతగ్గులైతే పరిమితంగానే ఉంటాయి. ఎఫ్‌ అండ్‌ ఓలో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌పై పరిమితులు విధించడం ఒడిదొడుకులను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయ’ని ఆర్‌ఎల్‌పీ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జి మురళీధర్‌ విశ్లేషించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios