‘దివాళా’ సమస్య నుంచి విద్యుత్‌ కంపెనీలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. గతేడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆర్బీఐ వెలువరించిన దివాలా సర్క్యులర్‌ను పక్కన బెడుతూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జీఎంఆర్‌, జీవీకే, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌తో పాటు పలు కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయి. 

మరో పక్క, బ్యాంకుల క్రెడిట్‌ రేటింగ్‌కు తాజా పరిణామం ప్రతికూలతలను తీసుకురావొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ సుతిమెత్తగా మందలించింది. గడువు తర్వాత ఒక రోజు కూడా బకాయి చెల్లించకపోతే ఆ కంపెనీని దివాలా సంస్థగా ప్రకటించేందుకు వీలు కల్పిస్తూ గతేడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్‌ను తోసిపుచ్చుతున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

‘ఆ సర్క్యులర్‌ను ఆర్‌బీఐ తన అధికారానికి వెలుపల జారీ చేసినట్లు మేం ప్రకటిస్తున్నాం’అని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రూ.2,000 కోట్లు అంత కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో బకాయిలు గల ఖాతాలకు బ్యాంకులు ఆరు నెలల్లో పరిష్కార ప్రణాళికను ప్రకటించాలంటూ గతేడాది ఫిబ్రవరి 12న ఆర్బీఐ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. 

గడువులోగా పరిష్కారం లభించకపోతే ఆ మొండి బాకీల ఖాతాలను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) లేదా దివాలా కోర్టులకు సిఫారసు చేయాలని సూచించింది. అయితే దివాలా ప్రక్రియలను చేపట్టవద్దని యథాపూర్వ స్థితిని కొనసాగించాలని గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన బ్యాంకులను సుప్రీం కోర్టు కోరింది.

సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు విద్యుత్‌ కంపెనీలకు, బ్యాంకులకు ఊరట కలిగిస్తుందని ఆర్థిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రుణాలను పునర్నిర్మించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని.. అయితే దివాలా ప్రక్రియ మందగమనం అవుతుందని వారు అంటున్నారు. 

మరో పక్క, తాజా పరిణామం తమ రుణాలను పునర్మించుకోవడానికి ఊరట ఇస్తుందని విద్యుత్‌ ఉత్పత్తిదార్ల సంఘం (ఏపీపీ) పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో రాటన్‌ ఇండియా, జీఎంఆర్‌, జీవీకే, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, కోస్టల్‌ ఎనర్జెన్‌ వంటి సంస్థలకు ఊరట లభిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కంపెనీలపై ఇప్పటికే ఈ సర్క్యులర్‌ ఆధారంగా ఎన్‌సీఎల్‌టీకి సిఫారసులు చేసినట్లు ఏపీపీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ ఖురానా గుర్తు చేశారు. కాగా, ఫిబ్రవరి సర్క్యులర్‌ వల్ల మొత్తం ప్రభావం పడ్డ రుణం మొత్తం రూ.3.8 లక్షల కోట్లని, అందులో రూ.2 లక్షల కోట్లు విద్యుత్‌రంగావేనని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.

ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పునర్నిర్మాణానికి సవరించిన మార్గదర్శకాలు/సర్క్యులర్‌ను ఆర్‌బీఐ జారీ చేసే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘అదే సమయంలో ప్రస్తుతం పూర్తయిన, పూర్తి కాబోతున్న దివాలా ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది’అని అంటున్నారు. 

కాగా, తాజా పరిణామం బ్యాంకుల రుణాలకు ప్రతికూలంగా మారనుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. ‘పెద్ద బకాయిదార్ల రుణాల గుర్తింపు, పరిష్కారాన్ని ఈ సర్క్యులర్‌ బలోపేతం చేసింది. కానీ దాన్ని పక్కనపెట్టడంతో ఇపుడు ఆ ప్రభావం తగ్గుతుంది’అని పేర్కొంది.

ఇక రుణ పరిష్కారాలు తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉన్నందున మరింత ఆలస్యం అవుతుందని అభిప్రాయపడింది. కాగా, సుప్రీం ఆ సర్క్యులర్‌ను కొట్టివేసినా.. బ్యాంకులు కావాలనుకుంటే రుణస్వీకర్తపై దివాలా ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది’అని ఇక్రా పేర్కొంది.

ఫిబ్రవరి 12 నాటి సర్క్యులర్‌తో విద్యుత్‌ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడ్డ సంగతి తెలిసిందే. అదే విధంగా ఉక్కు, జౌళి, చక్కెర, నౌకా రంగాల సంస్థలూ ఆ ప్రభావానికి గురయ్యాయి. కొన్ని సంస్థలు ఇతర సంస్థల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. 

దీంతో జీఎంఆర్‌ ఎనర్జీ, రాటన్‌ఇండియా పవర్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్ ‌(ఏపీపీ), ఇండిపెండెంట్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, తమిళనాడులోని షుగర్‌ మాన్యుఫాక్చరింగ్‌ అసోసియేషన్‌, గుజరాత్ నౌకా నిర్మాణ సంఘం ఆ సర్క్యులర్‌పై వివిధ కోర్టుల్లో పిటిషన్‌లు వేశాయి. 

ఇంధన కొరత, బొగ్గు బ్లాకుల రద్దు వల్ల పరిస్థితుల తమ చేతుల్లో లేకుండా పోవడంతో విద్యుత్‌ రంగంలో గతేడాది మార్చి నాటికి రూ.5.65 లక్షల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.

ఆర్బీఐ ఆదేశాలతో 24కి పైగా విద్యుత్ ప్రాజెక్టులు దివాళా ప్రక్రియకు గురయ్యాయి. దివాళా ప్రక్రియలో ఆయా ప్రాజెక్టులను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సదరు సంస్థలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.