Asianet News TeluguAsianet News Telugu

అదరగొట్టిన ఎస్‌బి‌ఐ లాభాలు.. క్రెడిట్ కార్డు వాటా విక్రయంతో భారీగా నిధులు..

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎస్‌బి‌ఐ అదరగొట్టింది. లాభం నాలుగింతలై రూ.3,581 కోట్లుగా నమోదు చేసుకుంది. సత్ఫలితాలను సాధించడానికి ఎస్‌బి‌ఐకి దన్నుగా క్రెడిట్‌ కార్డు వాటా విక్రయం నిలిచింది. సంస్థ ఆదాయం రూ.76 వేల కోట్లు దాటింది.
 

SBI Q4 results: Profit jumps four-fold to Rs 3,581 crore, exceeds Street estimates
Author
Hyderabad, First Published Jun 6, 2020, 10:48 AM IST

న్యూఢిల్లీ/ ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆర్థిక ఫలితాల్లో అదరహో అనిపించింది. బ్యాంక్‌ అనుబంధ సంస్థయైన క్రెడిట్‌ కార్డులో వాటా విక్రయించడంతో ఒకేసారి భారీగా నిధులు సమకూరడం, మరోవైపు మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.3,581 కోట్ల ఏకీకృత లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది.

2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.838.44 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగింతలు ఎగబాకినట్లు అయింది. కానీ, మూడో త్రైమాసికంలో నమోదైన రూ.5,583.36 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 35 శాతానికి పైగా పతనమైంది. బ్యాంక్‌ ఆదాయం గత త్రైమాసికం నాటికి రూ.76,027.51 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

ఎస్బీఐ మరో రికార్డును సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్‌ చరిత్రలో ఒకేడాది ఇంతటి లాభం ఆర్జించడం ఇదే తొలిసారి.

ఎస్బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌ సర్వీసులు, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా ఒకేసారి భారీగా నిధులు సమకూరడంతో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడానికి దోహదపడింది. రూ.2,78,082.99 కోట్ల నుంచి రూ.2,96,329.43 కోట్లకు బ్యాంక్ ఆదాయం పెరిగింది. 

శుక్రవారం స్టాక్ మార్కెట్లలో ఎస్బీఐ షేర్ ధర భారీగా లాభపడింది. ఒక దశలో 9 శాతం వరకు ఎగబాకిన షేరు చివరకు  7.90 శాతం పెరిగి రూ.187.80 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.12,272.20 కోట్లు అధికమై రూ.1,67,604.20 కోట్లకు చేరుకున్నది. 

ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయించడం ద్వారా ఎస్బీఐ బ్యాంకుకు రూ.3,484.30 కోట్ల నిధులు సమకూరాయి. ఎస్బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసుల్లో వాటాను తగ్గించుకోవడంతో రూ.2,731.34 కోట్లు లభించాయి. 

also read ఆగిన అట్లాస్ సైకిల్: మూతపడ్డ కంపెనీ చిట్టచివరి యూనిట్!

బ్యాంక్‌ స్థూల మొండి బాకీల విలువ 6.15 శాతానికి పరిమితమైంది.  ఏడాది క్రితం ఇది 7.53 శాతంగా ఉన్నది. వీటి విలువ రూ.1.72 లక్షల కోట్ల నుంచి రూ.1.49 లక్షల కోట్లకు తగ్గాయి. నికర మొండి బాకీలు 2.23 శాతానికి దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది ఇది 3.01 శాతంగా ఉన్నది. 

మొండి బాకీలు విలువ ఆధారంగా చూస్తే రూ.58,249 కోట్ల నుంచి రూ.51,871.30 కోట్లకు పరిమితం అయ్యాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి ఎస్బీఐ రూ.13,495.08 కోట్ల నిధులు వెచ్చించింది. ఏడాది క్రితం కేటాయించిన రూ.16,501.89 కోట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి.

తాజాగా రూ.8,105 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. రూ.2,528 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేయగలిగింది. యెస్‌బ్యాంక్‌లో 48.21 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ రూ.6,050 కోట్ల నిధులను పెట్టుబడిగా పెట్టింది. కాగా, 21 శాతం మంది బ్యాంక్‌ రిటైల్‌ ఖాతాదారులు మూడు నెలల మారటోరియాన్ని ఎంచుకున్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 7-8 శాతం మధ్యలో ఉండనున్నదని ఎస్బీఐ అంచనావేస్తున్నది. కార్పొరేట్ల  మొండి బకాయిలు రూ.1,561 కోట్లు కాగా, వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాల్లో రూ.5,238 కోట్లు మొండి బాకీలుగా మారాయి. బ్యాంక్‌ అడ్వాన్స్‌లు రూ.23.01 లక్షల కోట్ల నుంచి రూ.24.22 లక్షల కోట్లకు పెరిగాయి.

ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌తో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడం మంచి పరిణామం. నిలకడగా బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత ప్రమాణాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. 

‘ఖాతాదారులు రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 21 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మార్చి నుంచి మే మధ్యకాలంలో 82 శాతం మంది రెండు లేదా మరిన్ని వాయిదాలు చెల్లించారు. 92 శాతం మంది ఒకటి లేదా మరిన్ని ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించారు. లాక్‌డౌన్‌తో నెలకొన్న పరిస్థితులు రెండో త్రైమాసికం నాటికి చక్కబడే అవకాశాలు ఉన్నాయి’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios