ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తన ఖాతాదారులకు మరోసారి తీపికబురు అందించింది. అన్ని రకాల హోంలోన్స్‌పై వడ్డీరేట్లను తగ్గిస్తూ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. 5బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 

దీంతో రుణాలపై వార్షిక ఎంసీఎల్ఆర్ 8.5శాతం నుంచి 8.45శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం ఒక నెల కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.15 శాతం నుంచి 8.10శాతానికి తగ్గింది.

మూడు నెలలు, ఆరు నెలల రుణ వడ్డీ రేటు వరుసగా 8.15, 5.30శాతానికి తగ్గాయి. రెండు మూడు సంవత్సరాల రేట్లు 8.55శాతం, 8.65శాతంగా ఉంటాయి. కాగా, నెల రోజుల్లోనే ఎస్బీఐ రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించడం గమనార్హం. 

మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం ఏప్రిల్ మాసంలో ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, క్యూ 4లో ఎస్బీఐ విశ్లేషకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం 838.4కోట్లుగా నమోదైంది.