ఉక్రెయిన్ పై దాడి అనంతరం అంతర్జాతీయంగా రష్యాను ఏకాకిని చేసేందుకు అటు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ లు రంగంలోకి దిగాయి. రష్యన్ సంస్థలతో వ్యాపార లావాదేవీలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం SBI కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా నిషేధిత రష్యన్ సంస్థలతో భారత్ కు చెందిన అగ్రశ్రేణి ప్రభుత్వరంగ బ్యాంకులు తమ లావాదేవీలను ఉపసంహరించుకుంటున్నాయి. రాయిటర్స్ అందించిన సమాచారం ఇలా ఉంది. నిర్దిష్ట కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పంపిన లేఖలో, "US, యూరోపియన్ యూనియన్ లేదా ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో చేర్చబడిన రష్యన్ సంస్థలు, బ్యాంకులు, ఓడరేవులు లేదా నౌకలకు" సంబంధించిన ఏదైనా లావాదేవీలను అంగీకరించడం లేదని లిఖితపూర్వకంగా తెలిపింది.
ఒక సీనియర్ SBI అధికారి మాట్లాడుతూ, "SBI అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా అనేక స్థాయిల్లో వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం రష్యాపై విధిస్తున్న ఆంక్షల మేరకు మేము US మరియు EU నిబంధనలకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. కాబట్టి సదరు సంస్థలతో తమ లావాదేవీలను ఆర్థిక ఆంక్షలను తొలగించే వరకూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు."
ఉక్రెయిన్ దాడిని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లోని ఒక దేశంపై జరిగిన అతిపెద్ద దాడిగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి విస్తృతమైన ఖండనలతో పాటు వరుస ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పటికీ, రష్యాతో లోతైన వాణిజ్య, రక్షణ సంబంధాలను కలిగి ఉన్న భారత్, తన చిరకాల మిత్రదేశమైన రష్యాను ఇంతవరకు బహిరంగంగా ఖండించలేదు. అయితే హింసను అంతం చేయడానికి, యుద్ధాన్ని పరిష్కరించడానికి భారతదేశం దౌత్య, సంభాషణలు జరపాలని పిలుపునిచ్చింది.
కాగా SBI వినియోగదారులకు ఒక లేఖలో, నియంత్రిత దేశాలకు సంబంధించిన ఏదైనా లావాదేవీల సమయంలో "అదనపు జాగ్రత్త" తీసుకోవాలని తమ కస్టమర్లను వారిని కోరింది. అనేక ప్రముఖ భారతీయ కార్పొరేట్ సంస్థలు SBI విదేశీ శాఖల నెట్‌వర్క్ తో కలిసి పనిచేస్తున్నాయి. తమ విదేశీ లావాదేవీలను జరిపేందుకు ప్రభుత్వ-ఆధారిత SBIతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు.
అంతేకాదు మన దేశానికి చెందిన రెండు అతిపెద్ద చమురు ఇంధన పరిశ్రమలకు రష్యాలో సంస్థల్లోని ఆస్తులలో వాటాలను కలిగి ఉన్నాయి. ఈ సంస్థలకు రష్యా నుండి ఆదాయం లభిస్తోంది. అయితే వారి లావాదేవీలను రూట్ చేయడంలో SBI సహకరిస్తోంది. దీంతో రష్యాలోని తమ లావాదేవీలను బహిర్గతం చేయాలని భారతీయ చమురు కంపెనీల నుండి SBI సమాచారాన్ని కోరింది.
భారతదేశపు అగ్రశ్రేణి రిఫైనర్‌లలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, Russian crude and Kazakh CPC Blend కార్గోలను ఇకపై అంగీకరించబోమని సోమవారం తెలిపింది. మరోవైపు చమురు కంపెనీలే కాకుండా, భారతీయ ఎరువుల కంపెనీలు కూడా పంటల పోషకాల దిగుమతి కోసం రష్యాతో విస్తృతంగా వ్యాపారం చేస్తాయి.
