ఆసియా దేశాలను చమురు భయాలు పట్టుకున్నాయి. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిలో రెండు చమురు నౌకలపై జరిగిన దాడులు ఇప్పుడు ఆసియాలోని చమురు దిగుమతి ఆధారిత దేశాలకు వణుకు పుట్టిస్తోంది. 

అసలే ఇప్పటికే ఠారెత్తిస్తున్న ఇంధన ధరలు ఈ ఘటనతో పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ భారత్ తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందేనన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

నార్వేకు చెందిన ఫ్రంట్ ఆల్‌టైర్, జపాన్‌కు చెందిన కొకుకా కరేజస్ ఆయిల్ ట్యాంకర్లపై గురువారం దాడులు జరిగాయి. ఫ్రంట్ ఆల్‌టైర్ నౌక ఇథనాల్ సరుకుతో ఖతార్ నుంచి తైవాన్‌కు, కొకుకా కరేజస్ నౌక మిథనాల్ సరుకుతో సౌదీ అరేబియా నుంచి సింగపూర్‌కు వెళ్తుండగా దాడులు జరిగాయి.

ఈ దాడులు ఒక్కసారిగా అటు మధ్య ప్రాచ్యంలో, ఇటు ఆసియా దేశాల్లో కలవరం సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిలో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. అలాంటి ఈ జలసంధిపై దాడులు ఇప్పుడు చమురు సరఫరాపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 

ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర అగ్రశ్రేణి చమురు ఉత్పాదక దేశాల నుంచి చైనా, జపాన్, భారత్ వంటి ఆసియా ప్రధాన దేశాలు ఎక్కువగా హార్మూజ్ ద్వారానే చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ దారిలో వస్తున్న నౌకలపై దాడులు జరుగడం ఇప్పుడు ఈ దేశాలను చమురు సరఫరా భద్రతపై భయాలు వెంటాడుతున్నాయి.

ఇప్పటి వరకు సురక్షితంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్లకు ఇప్పుడు రక్షణ లేకుండా పోవడంతో చమురు అవసరాలు ఏంటి? అన్న ప్రశ్న.. భారత్‌సహా పలు దేశాలను వేధిస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు రెక్కలు తొడిగాయి.

దాడి జరిగిన వెంటనే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.19 డాలర్లు లేదా 3.65 శాతం, బ్యారెల్ ముడి చమురు ధర 62.16 డాలర్లు ఎగబాకింది. నౌకలపై దాడులు ఇరాన్ సైన్యం పనేనని అమెరికా అంటున్నది.

తమపై అమెరికా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఈ జలసంధిని మూసేస్తామని ఇరాన్ గతంలో హెచ్చరించింది. దీంతో ఈ దాడులు ఆ దేశం పనేనని ఇప్పుడు అమెరికా ఆరోపిస్తున్నది. బ్రిటన్ కూడా ఇందుకు గొంతు కలుపుతున్నది. 

కాగా, అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు జపాన్ ప్రధాని షింజో అబే.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆ దేశ అధికారులతో సమావేశం జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరుగడం గమనార్హం. దీంతో ఈ గొడవ ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన కలుగుతున్నాయి.

దేశీయ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతులతోనే తీరుతున్నాయి. ఇవన్నీ హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. ఇప్పుడు ఆ దారి సురక్షితంగా లేకపోతే భారత్‌పై పెను భారమే పడుతుంది.

ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హార్మూజ్ ద్వారా కాక ఇతర మార్గాల్లో చమురు దిగుమతులు జరిగితే ఖర్చులు పెరుగడం ఖాయం. 

ఇది అంతిమంగా వినియోగదారులనే ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. అదే జరిగితే ధరలు మరింత పెరుగడం, ద్రవ్యోల్బణం కోరలు చాచడం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, నిత్యవసర ధరలూ పెరిగిపోవడం, రూపాయి క్షీణత, వృద్ధిరేటు పతనం చకచకా జరిగిపోతాయి. మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. 

భారత్‌తోపాటు జపాన్ కూడా ఈ జలసంధి గుండానే 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నది. అమెరికా, చైనా, భారత్ తర్వాత చమురు వినియోగంలో జపానే టాప్. ఇక చైనా కూడా పెద్ద ఎత్తునే పొందుతున్నది. దీంతో ఇప్పుడు ఈ దాడులపై భారత్‌సహా అన్ని చమురు దిగుమతి దేశాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరముందని ఆర్థికవేత్తలు అంటున్నారు.