అకారణంగా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం కాకుండా అడ్డుకుంటామని గతవారం కేంద్ర ఆర్థిక శాఖ గంభీర ప్రకటనలు చేసింది. వరుసగా రెండు రోజులు ప్రధాని నరేంద్రమోదీ రూపాయి పతనం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినా నిష్ర్పయోజనమైంది.

మళ్లీ సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి మారకం విలువ 81 పైసలు నష్టపోయి 72.65 వరకు చేరిపోయింది. దీనికి తోడు చైనా దిగుమతులపై మరో రౌండ్ దిగుమతి సుంకాలను విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నారన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయని చెబుతున్నారు. 

అంతర్జాతీయంగానూ వివిధ దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ మరింత బలోపేతమైంది. మరో దఫా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 200 బిలియన్ల డాలర్ల సుంకం విధిస్తూ అమెరికా అద్యక్షుడు ట్రంప్ జారీ చేసే ఆదేశాల కోసం ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఫారెక్స్ డీలర్లు చెప్పారు.

కేంద్ర ఆర్థిక శాఖ జోక్యంతో శుక్రవారం రూపాయి విలువ 34 పైసలు బలపడి 71.84 వద్ద స్థిరపడింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ బలోపేతానికి ప్రభుత్వం తీసుకునే చర్యలపై అంతా ఆశలు పెట్టుకున్నారు. 

కానీ రూపాయి బలోపేతానికి ప్రభుత్వ చర్యలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నివేదిక
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణతకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమంత ప్రభావవంతంగా లేవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నివేదిక పెదవి విరిచింది. ఉత్పాదక రంగ సంస్థల విదేశీ వాణిజ్య రుణాలకు, విదేశీ మదుపరుల పెట్టుబడులకు, మసాలా బాండ్ల జారీకి ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుకున్నది. 

రూపాయి బలోపేతానికి మోదీ సర్కార్ తీసుకున్న నిర్నయాల ప్రభావం పరిమితమేనని, దీనివల్ల చెప్పుకోదగ్గ లాభాలు ఉండబోవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంటున్నది. విదేశీ పెట్టుబడుల రాకకు పెద్దగా ఈ చర్యలు దోహదపడవని, దీర్ఘకాలికంగా చూసినా ప్రయోజనకరంగా లేవని పేర్కొన్నది.

ప్రభుత్వ నిర్ణయాల్లో చాలావరకు స్వల్పకాలిక విదేశీ రుణాలను పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇది ఆయా కంపెనీల ఆర్థిక పరిపుష్ఠికి ఇబ్బందులను తేవచ్చు. రుణ భారాన్ని పెంచవచ్చు అని నివేదికలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనా వేసింది.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఫారెక్స్ నిల్వల్లో 8-10 బిలియన్ డాలర్ల మేర ఆదా కాగలదని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వర్ధమాన దేశాల కార్పొరేట్లు నిధులను సమీకరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం తీసుకున్న చర్యలు పనిచేస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషించింది. రూపాయి మారకం విలువ స్థిరంగా ఉన్నప్పుడు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మసాలా బాండ్లకు ఆదరణ ఉంటుంది.

రూపాయి విలువ క్షీణిస్తున్న సమయంలో రూపాయి మారకంలో ఉండే అసెట్ కొనుగోలుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించరని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రూపాయి విలువతో పాటు మార్కెట్ మీద పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుందే తప్ప రూపాయిని పూర్తి స్థాయిలో కోలుకునేందుకు దోహదపడదని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ చర్యలు ఏమాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేవని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం తొలుత రూపాయి మారకం విలువను తనంతగా తాను పతనం కానిచ్చి ఆ తర్వాత పాజిటివ్ వ్యాఖ్యానాలు, ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ల అమ్మకం ద్వారా పతనాన్ని అడ్డుకోగలిగిందని నోమురా పేర్కొంది. రెండో విడతగా విదేశీ పెట్టుబడులను పెంచడానికి చర్యలను ప్రకటించడంతో పాటు దిగుమతులను తగ్గించుకుని ఎగుమతులను ప్రొత్సహించే విధంగా చర్యలను ప్రకటించిందని తెలిపింది. ప్రభుత్వం మరి కొన్ని చర్యలను ప్రకటించనుందని నోమురా అంచనా వేసింది.