Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర కొత్త ఆర్థిక శాఖ మంత్రిగా కే.వీ.కామత్‌..?

కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రధాని నరేంద్రమోదీ కాయకల్ప చికిత్స చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలే బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న కేవీ కామత్.. త్వరలో కేంద్ర విత్త మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

rumour mills abuzz:kv kamath to replace nirmala sitaraman as india's finance minister
Author
Hyderabad, First Published Jun 4, 2020, 10:13 AM IST

న్యూఢిల్లీ: నిర్మలా సీతారామన్‌ స్థానంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సీనియర్‌ బ్యాంకర్‌ కేవీ కామత్‌ రానున్నారా? ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాల న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్డీబీ) చీఫ్‌గా ఐదేళ్లు పూర్తిచేసుకున్న కేవీ కామత్‌.. వచ్చే నెలలో ఆ బాధ్యతల్ని మరొకరికి అప్పగిస్తారు. దీంతో కామత్‌ కేంద్ర ఆర్థిక మంత్రి పదవిని చేపట్టనున్నారన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నది.

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అసలే మందగమనంలో ఉన్న ఎకానమీని ఇప్పుడు ఈ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమయ్యారన్న విమర్శలను ప్రతిపక్షాల నుంచి మోదీ సర్కార్ ఎదుర్కొంటున్నది. 

ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ పగ్గాలను మరింత సమర్థుల చేతికి అప్పగించాలన్న నిర్ణయానికి ప్రధాని మోదీ వచ్చినట్లు తెలుస్తున్నది. ఇక అంబానీలతో ఉన్న సత్సంబంధాలూ కామత్‌ను ఆర్థిక మంత్రి రేసులో ముందుంచుతున్నాయి. ముకేశ్‌, అనిల్‌ అంబానీల ఆస్తుల పంపకాల్లో కామత్‌ పెద్ద దిక్కుగా వ్యవహరించిన సంగతి విదితమే.  
 
భారత తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ చరిత్ర సృష్టించారు. బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న నిర్మలమ్మకు కేంద్ర ప్రభుత్వంలో మంచి పేరే ఉన్నది. అయితే వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ సర్కార్‌కు ఈసారి ఆర్థిక పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు.

తొలి ఐదేళ్లు దూసుకుపోయిన జీడీపీ.. మలి దఫా ఆరంభంలోనే పడకెక్కేసింది. పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సెగలతో బక్కచిక్కిపోయిన వృద్ధిరేటును కరోనా చంపేస్తున్నది. ఈ క్రమంలో జీడీపీ బలోపేతానికే కేంద్రం తొలి ప్రాధాన్యతను ఇస్తున్నది. అందుకే ఆర్థిక మంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇప్పుడున్న కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను నిర్మలకే కేటాయించే అవకాశాలున్నాయి.

also read ఇన్ఫోసిస్‌లో కరోడ్‌పతిలుగా మారిన ఉద్యోగులు...జీతాలు ఎంతంటే.. ?

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌గా బ్యాంకింగ్‌ రంగంలో విశేష అనుభవం ఉన్న కామత్‌పై అవినీతి ఆరోపణలు ఉండటం ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి అవకాశాలకు ప్రతిబంధకంగా మారింది. ఎన్డీటీవీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌ మోసం చేసి తీసుకున్న రుణాలు, బ్యాంక్‌ వివాదాస్పద సీఈవో చందా కొచ్చర్‌ ముడుపులు తీసుకుని ఇచ్చారంటున్న రుణాల కేసుల్లో కామత్‌ అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కామత్‌ కోసం అటు సీబీఐ, ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదురుచూస్తున్నాయి.

అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన క్యాబినెట్ లోకి కేవీ కామత్‌తోపాటు కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు తదితరులకు చోటు కల్పించనున్నారని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమర్పించడానికి ముందే వార్తలొచ్చాయి.  

దేశీయంగా నెలకొన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో కార్పొరేట్‌ వర్గాలకు మేలు చేకూర్చే మరిన్ని నిర్ణయాలు చేయాలన్న ఉద్దేశంతో కామత్‌ను కీలక స్థానంలో నియమిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జనవరిలో ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. 

దేశ విదేశాలకు చెందిన బడా కార్పొరేట్‌ ప్రముఖులు, వారి ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా మాట్లాడారు. వారి అభిలాష మేరకు విధానపరమైన నిర్ణయాల కోసం కామత్‌లాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని నిర్ణయించుకున్నారని తెలిసింది. గతంలో కేవీ కామత్ ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు చైర్మన్‌గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌, ఎండీ, సీఈఒగా కూడా ఆయన వ్యవహరించారు. 

మరోవైపు గతంలో రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన సురేశ్‌ ప్రభు తిరిగి మోడీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలున్నాయి. వాజపేయి ప్రభుత్వంలో తొలుత క్యాబినెట్ మంత్రిగా పని చేసిన సురేశ్ ప్రభు గతంలో శివసేనకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తొలి విడుత క్యాబినెట్ విస్తరణ సందర్భంగా శివసేనను సంప్రదించకుండానే సురేశ్ ప్రభును మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. 

తొలుత రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేశ్ ప్రభు వరుస ప్రమాదాలతో ఆ శాఖ నుంచి తప్పుకున్నారు. మధ్యలో జరిగిన క్యాబినెట్ విస్తరణలో పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేశ్ ప్రభు.. స్థానే రైల్వేశాఖ మంత్రిగా పీయూష్ గోయల్ నియమితులయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios