ఇక దేశవ్యాప్తంగా రిలయన్స్- బీపీ బంకులు.. త్వరలో జియోబీపీగా రీ-బ్రాండింగ్..
కరోనా కష్టకాలంలో కంపెనీలన్నీ విలవిల్లాడుతుంటే ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మాత్రం జాయింట్ వెంచర్లు, పెట్టుబడుల స్వీకరణలో బిజీబిజీగా దూసుకెళ్తోంది. తాజాగా బ్రిటిష్ పెట్రోలియం (బీపీ)తో జాయింట్ వెంచర్ ప్రారంభించింది. ఈ జాయింట్ వెంచర్ కింద దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నది. దీనికి జియో-బీపీగా రీబ్రాండ్ చేయాలని తలపోస్తోంది.
ముంబై: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఇంధన రిటైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ బ్రిటిష్ పెట్రోియం (బీపీ) భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) పేరుతో దీన్ని ప్రారంభించినట్లు గురువారం ప్రకటించింది.
గత ఆగస్టులోనే జాయింట్ వెంచర్ కంపెనీ రూపొందించే ప్రణాళికను రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కంపెనీలో 51శాతం రిలయన్స్ సొంతం కాగా, మిగిలిన 49 శాతం వాటా బీపీ యాజమాన్యంలో ఉంటుంది. ఇందుకు రూ.7000 కోట్లు బీపీ చెల్లించనుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
రవాణా ఇంధనాల మార్కెటింగ్‌కు అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలు, అనుమతులను ఆర్‌బీఎంఎల్ సాధించినట్లు రిలయన్స్ వెల్లడించింది. ప్రస్తుత రిటైల్ ఔట్ లెట్లలో సేవలు తక్షణమే అమలు చేయడం ప్రారంభిస్తుందని తెలిపింది. త్వరలోనే దీన్ని ‘జియో-బీపీ’ గా మార్చి రీబ్రాండ్ చేయనున్నామని పేర్కొంది.
ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశంలోని ఇంధనం, మొబిలిటీ మార్కెట్లలో అగ్రభాగాన నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బీపీ తెలిపింది. 21 రాష్ట్రాల్లో లక్షల మంది వినియోగదారుల ద్వారా రిలయన్స్ ఉనికిని మరింత పెంచుతుందన్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని నిర్మించడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశమని బీపీ సీఈవో బెర్నార్డ్ లూనీ వ్యాఖ్యానించారు.
also read విజయ్‌మాల్యాను వదలని ఇండియన్ బ్యాంకులు..ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే.. ...
తాజా భాగస్వామ్యంతో ఆయిల్ మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్ల ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత దూసుకెళ్తుందని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా రిటైల్, ఏవియేషన్ ఇంధనాలలో బీపీతో బలమైన, విలువైన భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు.
సర్వీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య నాలుగు రెట్లు పెరగనుందని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 20 వేల నుంచి 80 వేల వరకు ఈ సంఖ్య పెరుగుతుందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 30 నుండి 45 విమానాశ్రయాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉండగా, ఇపుడు మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలని ఈ రెండు సంస్థల లక్ష్యం. వీటి ద్వారా ఇండియన్ కస్టమర్లకు అధిక-నాణ్యత, తక్కువ కార్బన ఉద్గారాల విభిన్న ఇంధనాలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, ఇతర సేవలను అందించనున్నట్లు రిలయన్స్ పేర్కొంది.
ప్రస్తుతం రిలయన్స్ పెట్రోల్ విమానయాన ఇంధన నెట్‌వర్క్‌లో బీపీ భాగస్వామ్యం కానున్నది. తాజా ఒప్పందంతో జియో- బీపీ బ్రాండ్ జాయింట్ వెంచర్ భారత్‌లో చమురు, మొబిలిటీ మార్కెట్‌లో లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. రాబోయే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్ అవుతుందని, దేశంలో కార్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా.