Asianet News TeluguAsianet News Telugu

విజయ్‌మాల్యాను వదలని ఇండియన్ బ్యాంకులు..ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే..

మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని బ్యాంకర్లు ఇంగ్లండ్ హైకోర్టులో వాదించారు. అంతకుముందు మాల్యా దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు జడ్జి బ్రిగ్స్ తీర్పు రిజర్వు చేశారు. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ మేరకు తాజాగా సవరణ పిటిషన్ వేసింది.

Indian banks pursue Vijay Mallya bankruptcy order in UK court
Author
Hyderabad, First Published Jul 9, 2020, 1:38 PM IST

లండన్‌: తమను కోట్ల రూపాయల మేర మోసగించి బ్రిటన్‌కు పారిపోయిన  లిక్కర్‌ వ్యాపారి విజయ్‌మాల్యాను భారత్‌ బ్యాంకులు వదలడం లేదు. ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని మరోసారి ఇంగ్లాండ్‌లోని హైకోర్టు ముందు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియం స్పష్టం చేసింది. 

ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్‌ బ్రిగ్స్‌ తీర్పును రిజర్వ్‌ చేసుకున్నారు. విజయ్ మాల్యాను దివాలాకోరుగా ప్రకటిస్తే... రుణాలు రాబట్టుకునే విషయంలో భారత్‌ బ్యాంకింగ్‌ రంగం తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది.  

భారత్‌ నుంచి బ్రిటన్‌ పారిపోయిన విజయ్ మాల్యా నుంచి రూ.10 వేల కోట్ల పైన (114.5 కోట్ల పౌండ్లు) రుణాలు వసూలు చేసుకునే క్రమంలో బ్యాంకింగ్‌ కన్సార్షియం 2018లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మాల్యా  వాదిస్తూ... భారత్‌లోని పలు కోర్టుల్లో తనపై కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆ కేసుల్లో తాను విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయని మాల్యా పేర్కొన్నారు. 

తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాంకులకు పూర్తి గ్యారంటీ (సెక్యూర్డ్‌ క్రెడిటార్స్‌) ఉందని విజయ్ మాల్య వెల్లడించారు. రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్‌ పట్టించుకోవడంలేదని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న లండన్‌ కోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బ్రిగ్స్‌  మాల్యాపై పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ 10న కొట్టివేశారు.  

also read  ఆఫీస్‌ స్థలాలకు భారీగా తగ్గిన గిరాకీ.. హైదరాబాద్ లోనూ అదే సీన్.. ...

అయితే ఈ తీర్పుపై భారత్‌ బ్యాంకింగ్‌ కన్సార్షియం ఇటీవలే తాజాగా సవరణ పిటిషన్‌ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజానిజాలు లేవని అందులో వివరించింది. 

మాల్యా ప్రతిపాదించిన సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (యూబీహెచ్‌ఎల్‌) ఆస్తులను బ్యాంకులు హైకోర్టులో ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్‌ కింద ఉన్నాయి. మాల్యాకుగానీ లేదా ఒకప్పటి  యూబీహెచ్‌ఎల్‌ యాజమాన్యానికి ఇవి అందుబాటులో లేవు’ అని బ్యాంకుల కన్సార్టియం వాదించింది.

‘ఈ పరిస్థితుల్లో సెటిల్‌మెంట్‌ ఆఫర్‌కు మాల్యా ఆయా ఆస్తులపై ఆధార పడలేరు. ఆయన సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ అమలు అసాధ్యం. మాల్యా పేర్కొన్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్‌ క్రెడిటార్స్‌ కాదు’’ అని మంగళవారంనాటి తన వాదనల్లో బ్యాంకింగ్‌ కన్సార్షియం తరఫు బారిష్టర్‌ షేక్‌డీమియన్‌ పేర్కొన్నారు. 

భారత్‌కు తనను అప్పగించరాదంటూ మాల్యా చేసిన వాదనలూ బ్రిటన్‌ న్యాయస్థానాల్లో వీగిపోయిన విషయాలను బ్యాంకింగ్‌ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. బారిష్టర్‌ ఫిలిప్‌ మార్షల్‌ నేతృత్వంలోని మాల్యా తరఫు లీగల్‌ టీమ్‌ మాత్రం బ్యాంకులు ‘సెక్యూర్ట్‌ క్రెడిటార్స్‌’ అనీ, బ్యాంకింగ్‌ తాజా పిటిషన్‌నూ కొట్టేయాలని తన వాదనల్లో వినిపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios