కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ ఎత్తివేసినా రిటైల్ వ్యాపారం దెబ్బతిన్నదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూన్ చివరి రెండు వారాల్లో 67 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, దీనికి కరోనా కేసులు పెరుగడమే కారణం అన్నది.
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఎత్తివేసినా రిటైల్ వ్యాపారం వెలవెలబోతున్నది. కరోనా దెబ్బతో వినియోగదారులు ఇంకా తమకు ఇష్టమైన కొనుగోళ్లకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. నిత్యావసర వస్తువులు మినహా ఇతర వస్తువుల జోలికి పోవడం లేదు.
వాటిని కూడా ఏదో పెద్ద రిటైల్ మాల్‌కు వెళ్లి కొనే బదులు ఇంటికి దగ్గరలో ఉన్న చిల్లర దుకాణాల్లో కొనేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేసినా రిటైల్ మాల్స్‌తో పాటు ఓ మోస్తరు రిటైల్ దుకాణాలు బోసిపోతున్నాయి.
గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ 15-30 మధ్య దేశంలోని రిటైల్ వ్యాపారం 67 శాతం మేర పడిపోయిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) వెల్లడించింది. దేశంలోని 100 చిన్న పెద్దా రిటైల్ కంపెనీల్లోని వ్యాపారాలను పరిశీలించి ఆర్‌ఏఐ ఒక నివేదికను విడుదల చేసింది.
గత నెల 15-30 తేదీల్లో మాల్స్‌లో వ్యాపారం ఏకంగా 77 శాతం పడిపోగా హై స్ట్రీట్ రిటైల్ వ్యాపారం 62 శాతం మేర క్షీణించిందని ఆర్‌ఏఐ వెల్లడించింది.
దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో రిటైల్ వ్యాపారంలో నష్టం మరింత ఎక్కువగా ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) పేర్కొంది. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని రిటైల్ మాల్స్‌లో జూన్ నెలలో వ్యాపారం 62 శాతం పడిపోయిందన్నది.
also read ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్ ...
ఇదే సమయంలో పశ్చిమ ప్రాంతంలో 74 శాతం, ఉత్తర ప్రాంతంలో 71 శాతం వ్యాపారం దెబ్బతింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కా లంలో రిటైల్ మాల్స్ వ్యాపారం 74 శాతం తగ్గిందని ఆర్‌ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థ కష్టాలకూ అద్దం పడుతోందన్నారు.
ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫాస్ట్ ఫుడ్, అప్పారెల్, పాదరక్షలు, బంగారు ఆభరణాల కొనుగోలుకు రిటైలర్లు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆర్ఏఐ పేర్కొన్నది. దేశవ్యాప్త లాక్ డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే గత నెలలో రిటైల్ వ్యాపారులు కాస్త కోలుకున్నారు. ఫుడ్ అండ్ గ్రాసరీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఫర్నీచర్ కొనుగోళ్లతో కాసింత ఊరట లభించినట్లేనని చెబుతున్నారు.
65-70 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టినా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 19 శాతం మాత్రమే తగ్గిపోవడం ఆశ్చర్యకరంగా ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీన్ని బట్టి హోం అప్లయెన్స్ కోసం డిమాండ్ ఉందని తెలిపింది.
గతేడాదితో పోలిస్తే షాపింగ్ మాళ్లను సందర్శించే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), డెహ్రాడూన్ ప్రాంతాల్లో సేల్స్ 20-30 శాతం మాత్రమే జరిగాయని పసిఫిక్ మాల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ బన్సాల్ తెలిపారు.
