Asianet News Telugu

ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్‌ స్పష్టం చేశారు.
 

Veteran Banker KV Kamath Lauds Aatmanirbhar Bharat, Says Self-Reliance Won't Lead to Isolation
Author
Hyderabad, First Published Jul 8, 2020, 11:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా వృద్ధిరేటు చెందుతుందని సీనియర్‌ బ్యాంకర్‌, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్డీబీ)మాజీ చైర్మన్ కేవీ కామత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ ఆర్థికవేత్తలు, గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థలు చెప్తున్నట్లు దేశ జీడీపీ దారుణంగా మైనస్‌లోకి వెళ్లే అవకాశాల్లేవని ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీ కామత్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), ఎస్‌ అండ్‌ పీ వంటి సంస్థల గణాంకాలు అతిగా ఉన్నాయని సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ వ్యాఖ్యానించారు. నిజానికి మున్ముందు ఏం జరుగబోతున్నదో అంచనా వేయడం చాలా కష్టమన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) భారత వృద్ధిరేటు మైనస్‌ 4.5 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్‌, మైనస్‌ 5 శాతానికి దిగజారవచ్చని ఎస్‌ అండ్‌పీ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే భారత ఆర్థిక వ్యవస్థ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వేగంగా పుంజుకోగలదని కేవీ కామత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నామమాత్ర పరిశీలనలతో దేశ జీడీపీని తక్కువ చేస్తూ ఉత్తుత్తి అంచనాలు వేస్తున్నారని కేవీ కామత్ విమర్శించారు. నిజానికి పారిశ్రామిక కార్యకలాపాలు తిరిగి మునుపటి స్థితికి చేరుకుంటున్నాయని, 80-90 శాతం సామర్థ్యానికి ఉత్పత్తి చేరుకుంటున్నదన్న ఆనందం పరిశ్రమలోనూ కనిపిస్తున్నదని చెప్పారు. 

ఇక పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతున్నదన్న సంకేతాలనిస్తున్నదని కేవీ కామత్ పేర్కొన్నారు. అయితే నిర్మాణ, మౌలిక, ఆర్థిక సేవల రంగాలు కరోనా వైరస్‌ ధాటికి తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని, వీటికి ప్రభుత్వ చేయూత అవసరమని అభిప్రాయపడ్డారు.

also read ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి వేతనం పెంపు.. ...

వడ్డీరేట్లు తక్కువగా ఉంటే బ్యాంకుల మనుగడకే ముప్పు అని సీనియర్‌ బ్యాంకర్‌ కేవీ కామత్‌ అన్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మొండి బకాయిలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

‘బ్యాంకింగ్‌ రంగం సమస్యల్లో ఉన్నట్లు అనిపిస్తున్నది. అయితే ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమిస్తాయని భావిస్తున్నాను’ అని కేవీ కామత్ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటం బ్యాంకులకు అంత మంచి పరిణామం కాదన్నారు.  దీనివల్ల బ్యాంకుల నిర్వహణే కష్టతరం కావచ్చునని కేవీ కామత్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ఆగస్టుదాకా మారటోరియంను ఆర్బీఐ పొడిగించడాన్ని స్వాగతించారు.

ఇదిలా ఉంటే వృద్ధి ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఫిక్కి ఫ్రేమ్స్‌ 2020లో మాట్లాడుతూ ‘భారత ఆర్థిక వ్యవస్థలో మందగించిన వృద్ధిరేటు త్వరలోనే తిరిగి ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఆ నమ్మకం నాకున్నది’ అన్నారు. 

ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలు తిరిగి వృద్ధిపథంలోకి వచ్చిన సంకేతాలు ఉన్నాయని కేవీ కామత్ తెలిపారు. నిజానికి ఈ మహమ్మారి భారత్‌కు మాత్రమే సవాల్‌ విసరడం లేదని, యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. కాగా, భవిష్యత్‌లో స్థిరమైన వృద్ధిరేటు కోసం 12-13 రంగాలను గుర్తించి, వాటి సమగ్రాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios