Asianet News TeluguAsianet News Telugu

ఉల్లి ‘ఘాటు’తో కంటనీరు...ధరల ప్రభావంతో తొలిసారి....

దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే సంకేతాలేమీ కనిపించడం లేదు. ‘ఉల్లి’ ధరల ఘాటు ప్రభావంతో 2014 జూలై తర్వాత తిరిగి తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరుకున్నది. గతేడాది ఫిబ్రవరి నుంచి వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ ఇక ఆ దిశగా ధైర్యం చేయకపోవచ్చు. అదే జరిగితే తిరిగి ఇంటి, వాహన రుణాల వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
 

Retail inflation surges to 7.35% in December, crosses RBI's comfort level
Author
Hyderabad, First Published Jan 14, 2020, 11:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధరల ఘాటుతో రిటైల్ ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. 2019 డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠాన్ని తాకింది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కు ఆమోదయోగ్య స్థాయిని అధిగమించి ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో 7.39 శాతంగా ఉన్నది. కేంద్రంలో మోదీ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, మళ్లీ ఐదున్నరేళ్ల తర్వాత ఇప్పుడే ఏడు శాతానికిపైగా చిల్లర ధరల సూచీ నమోదైంది. 

కూరగాయలు ముఖ్యంగా ఉల్లిగడ్డ ధరలు వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి రెక్కలు తొడిగాయి. అకాల వర్షాలతో పంట దెబ్బ తినడంతో మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.100 తాకిన సంగతి తెలిసిందే. దీంతో విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కిలో రూ.60 నుంచి 70 పలుకుతున్న సంగతీ విదితమే. 

also read సేల్స్ ఎఫెక్ట్ : వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించండి...

కిలో కూరగాయల ధరలూ కనిష్ఠంగా రూ.20 నుంచి 80గా ఉన్నాయి. ఇవి చిల్లర ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లడానికి కారణమయ్యాయి. సోమవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వివరాల ప్రకారం కూరగాయల ధరలు 2018 డిసెంబర్‌తో పోల్చితే నిరుడు డిసెంబర్‌లో 60.5 శాతం పుంజుకున్నాయి.

ఈ క్రమంలోనే 2018 డిసెంబర్‌ నెలలో 2.11 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం.. 2019 డిసెంబర్‌లో 7.35 శాతానికి పెరిగింది. గతేడాది నవంబర్‌లో ఇది 5.54 శాతంగా ఉన్నది. ఇక ఈసారి స్థూల ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతంగా ఉంటే, పోయినసారి మైనస్ 2.65 శాతంగా ఉండటం గమనార్హం. నిరుడు నవంబర్‌లో 10.01 శాతంగా ఉన్నది. పప్పుధాన్యాలు తదితర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 15.44 శాతంగా ఉండగా, మాంసం, చేపల ధరల సూచీ సుమారు 10 శాతంగా ఉన్నది.

చిల్లర ద్రవ్యోల్బణం రేటు అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల కోతలకు ఇక బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నది. వచ్చే నెల ఆరంభంలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఆర్బీఐ చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగనున్నది. 

Retail inflation surges to 7.35% in December, crosses RBI's comfort level

ఈ క్రమంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరడంతో ఈసారి కూడా రెపో, రివర్స్ రెపో రేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ముగిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణ భయాలతోనే వరుస వడ్డీరేట్ల కోతలకు ఆర్బీఐ విరామం ఇచ్చింది. 

వృద్ధిరేటు పురోగతి కోసం నిరుడు ఫిబ్రవరి నుంచి వరుస ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన సంగతి విదితమే. నిజానికి ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆర్బీఐ తప్పకుండా వడ్డీరేట్లను పెంచుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం దృష్ట్యా ఆ చర్యకు సెంట్రల్ బ్యాంక్ దిగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి ద్రవ్యసమీక్షలోనూ రెపో, రివర్స్ రెపోల తగ్గింపు ఉండదని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వడ్డింపులకూ ఆస్కారం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.దేశ జీడీపీని 2024కల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఈ లక్ష్య సాధనకు అడుగడుగునా అవరోధాలే ఏర్పడుతున్నాయి. కేంద్రం పలు సంస్కరణలు చేపట్టి, ఉద్దీపనలు ప్రకటించినా ఫలితం లేకుండా పోతున్నది. 

also read కేవలం 3 నిమిషాలలోనే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌....

మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువనే ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ స్థాయిలోనే ఉండటంతో గతంలో వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఈ పరిమితి దాటి ఇప్పుడు 8 శాతం దరిదాపుల్లోకి రావడంతో వడ్డీరేట్ల పెంపు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వినిపిస్తున్నాయి. 

ఇదే జరిగితే గృహ, వాహన రుణాలు మళ్లీ ప్రియం కావడం ఖాయం. దీనివల్ల వృద్ధిరేటు లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక సంఘం పీహెచ్‌డీ చాంబర్ కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios