ఆంధ్రప్రదేశ్‌లో 10 గిగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న రిలయన్స్: విశాఖలో ముఖేష్ అంబానీ ప్రకటన
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Renewable energy ఉత్పాదనలో భాగంగా 10 GW సౌరశక్తిప్రాజెక్టు నిర్మాణంలో పెట్టుబడి పెడతామని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
విశాఖ పట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో నేటి సన్నాహక సదస్సులో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులపై కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో రెండవ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉందని, అలాగే తీర ప్రాంతాల్లోని ఖనిజాలు ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ముఖేష్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రిలయన్స్ ఇప్పటికే తన KG D-6 ఆస్తులపై దాదాపు రూ.1.50 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టింది. ముఖ్యంగా గ్యాస్ పైప్‌లైన్‌లను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
APలో 10 గిగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న రిలయన్స్
Renewable energy రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను పెంచాలని రిలయన్స్ ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 10 గిగా వాట్ల సౌరశక్తి ప్రాజెక్టు నిర్మాణంలో పెట్టుబడి పెట్టనున్నట్లు చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ రోజు ప్రకటించారు.. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
“రిలయన్స్ తరపున ఏపీలో మేము మా పెట్టుబడులను కొనసాగిస్తున్నాము, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Renewable energy ఉత్పాదనలో భాగంగా 10 GW సౌరశక్తిప్రాజెక్టు నిర్మాణంలో పెట్టుబడి పెడతామని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను" అని ముఖేష్ అంబానీ అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామర్థ్యాన్ని విశ్వసించిన మొదటి కార్పొరేట్ సంస్థలలో రిలయన్స్ ఒకటని, ఇక్కడే మా చమురు, గ్యాస్ అన్వేషణ బృందం 2002లో గ్యాస్‌ను కనుగొంది. మేము మా KG-D6 ఆస్తులలో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని అంబానీ గుర్తుచేశారు. ఏపీ తీరానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అవినాభావ సంబంధం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదుగుదలలో కేజీ బేసిన్ సహజవాయువు కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. నేడు KG D-6 బేసిన్‌లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువు దేశంలో స్వచ్ఛమైన ఇంధనం దిశగా అడుగులు వేసేందుకు దోహదపడిందని, దేశంలోని గ్యాస్ ఉత్పత్తిలో దాదాపు 30 శాతం కేజీ బేసిన్ నుంచే వస్తోందని అంబానీ తెలిపారు.
‘తీరప్రాంతం వల్ల రాబోయే దశాబ్దాల్లో బ్లూ ఎకానమీ వృద్ధి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో రెండవ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది, సముద్రగర్భంలో ఉన్న ఖనిజాలు, మొదలైన వనరులు ఏపీ వృద్ధికి కీలకం అవుతాయ' ని అంబానీ అన్నారు.
రిలయన్స్ రిటైల్ "ఆంధ్రప్రదేశ్‌లోని 6,000 గ్రామాలలో 1.2 లక్షల కంటే ఎక్కువ కిరాణా వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉంది, తద్వారా, రిలయన్స్ రిటైల్ 20,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని, పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలు కూడా లభించాయని అంబానీ అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశమంతటా జియో ట్రూ 5G సేవలు 2023 చివరిలోపు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.