ఈ- కామర్స్ దిశగా రిలయన్స్ స్పీడప్: హైదరాబాదీ స్టార్టప్ కైవసం ?
ఈ-కామర్స్ రంగంలో సేవలందించే దిశగా రిలయన్స్ తన కార్యాచరణను స్పీడప్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న నౌ ఫ్లోట్స్ సంస్థలో 51 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ముంబై: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ-కామర్స్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటైన ఒక స్టార్టప్ సంస్థను కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది.
ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెరికాకు చెందిన వాల్‌మార్ట్, అమెజాన్‌లకు చెక్ పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ర్టానికి చెందిన సాస్ స్టార్టప్ నౌఫ్లోట్స్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు గత రెండు నెలలుగా ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక వివరాలు మాత్రం తెలియరాలేదు.
also read దేశీయ ఎగుమతుల్లో వరుసగా మూడో నెల కూడా క్షీణత
రిలయన్స్ సంస్థతో షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఇరు సంస్థల ప్రతినిధులు అంగీకరించినట్లు పేరు చెప్పని ఒక ఉన్నతాధికారి తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో పలు చిన్న స్థాయి సంస్థలపై రిలయన్స్ దృష్టి సారించింది.
గతేడాది చివర్లో ఎడ్యుకేషన్-టెక్ స్టార్టప్ ఎంబిబ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నౌఫ్లోట్స్‌ను కొనుగోలు చేయనుండటంతో చిన్న స్థాయి రిటైల్ విభాగంలో మంచి పట్టు సాధించినట్లు కానున్నది.
also read నకిలీ బ్రాండ్లకు అమెజాన్ షాకింగ్ న్యూస్
ప్రస్తుతం వ్యాపారులకు, డాక్టర్లకు, తయారీదారులకు ఆన్‌లైన్ ద్వారా నౌఫ్లోట్స్ సేవలు అందిస్తున్నది. డిక్టేట్, వైల్డ్‌ఫైర్, యువర్‌యాప్‌లను కలిగి ఉన్నది నౌఫ్లోట్స్. ఈ-కామర్స్ రంగంలో సుస్థిరమైన స్థానం సాధించడానికి ఆర్‌ఐఎల్.. రిటైల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలకు సంబంధించిన సంస్థలతో చర్చలు జరుపుతున్నది.
బ్లూమ్ వెంచర్, ఒమిడైర్ నెట్‌వర్క్, ఐరన్ పిల్లర్, ఐఐఎఫ్‌ఎల్, వెన్లీ గ్లోబల్ గ్రూపు వెనుకుండి నడిపిస్తున్న సంస్థ గడిచిన ఏడు నెలల్లో రూ.25.39 కోట్ల నిధులను పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. నో ఫ్లోట్స్ స్టార్టప్ సంస్థలో వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి.