ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ మరో సారి సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థల్లో రిలయన్స్‌ రిటైల్‌ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. 2013-18 ఆర్థిక సంవత్సరాల మధ్య డెలాయిట్‌ గ్లోబల్‌ పవర్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2020 ఇండెక్స్‌ పేరుతో విడుదల చేసిన జాబితాలో రిలయన్స్‌ రిటైల్‌ తొలిసారిగా టాప్‌-50లోకి చేరుకున్నది.

2017-18 ఆర్థిక సంవత్సరానికి 250 సంస్థల వార్షిక నివేదిక ఆధారంగా డెలాయిట్‌ గ్లోబల్‌ పవర్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2020 ఇండెక్స్‌ ఈ జాబితాను రూపొందించింది. దేశీయ రిటైల్‌ దిగ్గజమైన రిలయన్స్‌ రిటైల్‌ గతేడాదికి 56వ స్థానంలో నిలిచింది. అంతక్రితం ఏడాది 94వ స్థానంలో ఉంది. 

2016-17లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్‌ రిటైల్‌..ఆ తర్వాతి ఏడాదిలో తొలిస్థానానికి ఎగబాకింది. 55.8 శాతం సగటు వృద్ధితో ఈ స్థానం దక్కించుకున్నదని డెలాయిట్‌ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న దేశీయ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ కావడం విశేషం. 

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సంస్థల్లో సగాని కంటే పైగా జపాన్‌ సంస్థలు కాగా, మూడోవంతు చైనా, హాంకాంగ్‌లకు చెందినవి. 2017-18 ఏడాదికి రిలయన్స్‌ రిటైల్‌ 18.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం సంపాదించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 88.4 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 

అటు వ్యాపార విస్తరణలో రిలయన్స్ రిటైల్‌ దూసుకుపోతున్నది. దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా స్టోర్లను ఏర్పాటు చేసిన తొలి సంస్థ కూడా రిలయన్స్ రిటైల్‌ కావడం విశేషం. రిటైల్‌తోపాటు ఈ-కామర్స్‌ వ్యాపారంపై కూడా దృష్టి సారించడానికి Ajio.com వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం సంస్థకు కలిసొచ్చింది. 

ఈ వెబ్‌సైట్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం మరింత బలోపేతం కావడం, బ్రిటన్‌కు చెందిన బొమ్మల రిటైలర్‌ హ్యామ్‌లేస్‌ను కొనుగోలు చేయడం కూడా మెరుగైన వృద్ధికి దోహదం చేసిందని నివేదిక వెల్లడించింది. కాగా, ఈ జాబితాలో వాల్‌-మార్ట్‌ స్టోర్స్‌ తొలిస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో క్యాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్ప్‌, అమెజాన్ నిలిచాయి. 

పలు విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న క్రోగర్‌ (అమెరికా) మాత్రమే టాప్‌-10లోకి వచ్చింది. డెలాయిట్‌ ఇండియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దీర్ఘకాలికంగా మందకొడి పరిస్థితులు నెలకొన్నా రిటైల్‌ రంగం మాత్రం పుంజుకున్నదని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫోన్లు అమ్మకం, ఎజియో.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈ కామర్స్‌ వృద్ధిపై దృష్టి పెట్టడం సహా పలు నిర్ణయాలు రిలయన్స్‌ మెరుగవడానికి కారణాలుగా సర్వే నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అంచనాలకుమించి దూసుకుపోతున్నదని, వచ్చే ఏడాదికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం కూడా కలిసి రానున్నదని డెలాయిట్ ప్రతినిధి అన్నారు.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సడలింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధిస్తున్న సర్చార్జిని ఎత్తివేత, పలు పారిశ్రామిక రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం వంటి కీలక నిర్ణయాలు కేంద్రం తీసుకున్నది.