ముంబై: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దాదాపు దేశమంతటా లాక్ డౌన్ అమలులోకి వస్తుండటంతో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. కార్పొరేట్‌ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. బ్లూ చిప్ కంపెనీల్లో ఒక్కటైన రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులో రూ.86 వేల కోట్లకు పైగా హరించుకుపోయింది. 

వరుసగా సోమవారం కూడా వెయ్యికి పైగా కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. వీటిలో టాటా మోటర్స్‌, ఐఆర్‌సీటీసీ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మ్యాక్స్‌ ఫైనాన్సియల్‌, బంధన్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌ఐఐటీ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో షేర్లు భారీగా పతనమైన వాటిలో ఉన్నాయి. 

also read:కరోనాపై పోరుకు రిలయన్స్‌ సైతం.. ముంబైలో ఆసుపత్రి సిద్దం

మరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ 15 శాతం పతనం కాగా, ఆటో ఇండెక్స్‌ 12 శాతం కిందకు పడిపోయాయి. బీఎస్‌ఈలో లిైస్టెన షేర్లలో 1,886 షేర్లు పతనమవగా, 191 షేర్లు లాభపడ్డాయి. కానీ 106 షేర్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. 
యాక్సిస్‌ బ్యాంక్‌ 28 శాతం క్షీణించి టాప్‌ లూజర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులు 23 శాతానికి పైగా కోల్పోయాయి. 
వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, రిలయన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టైటాన్‌, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీలు పది శాతానికి పైగా మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. 

ఇన్ఫోసిస్‌, మహీంద్రా, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, నెస్లె ఇండియా, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌ల షేర్లు కూడా పతనం చెందాయి. 

మరోవైపు మార్కెట్ లీడర్ రిలయన్స్‌ మార్కెట్‌ విలువ మరింత కరిగిపోయింది. షేర్ ధర ఏకంగా 13 శాతం పతనం కావడంతో కంపెనీ విలువ రూ.86,435.91 కోట్లు కోల్పోయింది. ఇంట్రాడేలో 14 శాతానికి పైగా పతనం చెందిన షేర్ ధర చివరకు 13.37 శాతం పతనంతో రూ.883.85 వద్ద పరిమితమైంది.

దీంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86,435.91 కోట్లు తగ్గి రూ.5,60,296.16 కోట్లకు జారుకున్నది. గత శుక్రవారం 12 శాతం పెరిగిన కంపెనీ షేర్ ధర ఆ మరుసటి రోజే అంతే స్థాయిలో పతనం చెందడం విశేషం.  

అంతర్జాతీయంగా పెరుగుతున్న కరోనా మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను భీకర నష్టాల్లోకి నెట్టాయి. వైరస్‌ మృతులు 15వేలను దాటడం, బాధితులు 3లక్షలకుపైగానే ఉండటంతో మదుపరులు అమ్మకాలపైనే దృష్టి పెట్టారు. 

ముఖ్యంగా ఆసియా మార్కెట్లను ఈ ప్రాణాంతక మహమ్మారి విజృంభించడం కుదిపేస్తున్నది. ఈ క్రమంలోనే హాంకాంగ్‌ సూచీ 4.9 శాతం, చైనా 3.1 శాతం, తైవాన్‌ 3.7 శాతం, సింగపూర్‌ 7.5 శాతం, ఇండోనేషియా 3.8 శాతం, దక్షిణ కొరియా 5.5 శాతం చొప్పున నష్టాలపాలయ్యాయి. 

ఫారెక్స్‌ ట్రేడ్‌ దన్నుతో జపాన్‌ మాత్రం 2 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన బ్రిటన్‌ 4.8 శాతం, జర్మనీ 4.6 శాతం, ఫ్రాన్స్‌ 4.4 శాతం చొప్పున క్షీణించాయి. అలాగే న్యూజీలాండ్‌ 7.6 శాతం, ఆస్ట్రేలియా 5.6 శాతం మేర పడిపోయాయి.