న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులకు అనుకూలమైన సర్కారుగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోదీ పాలనలో  పారిశ్రామికవేత్తలు వేల కోట్ల మేర లాభాలను గడించారు. కేంద్రంలో అంతకు ముందు అధికారంలో ఉన్న యూపీఏ-2 హయాంతో పోలిస్తే.. మోడీ సర్కారు హయాంలో కార్పొరేట్‌ దిగ్గజాలైన ముఖేశ్‌ అంబానీ, గౌతం అదానీ సహా పలువురు సంపన్నుల కంపెనీల మార్కెట్‌ విలువ ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది.

ఫలితంగా ఆయా సంస్థల యజమానుల సంపద కూడా ఘనంగా ఎగిసింది. మార్కెట్లో ఈ బడాబాబుల సంస్థల షేర్ల కదలికలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూపు మార్కెట్‌ విలువ గడిచిన ఐదేండ్ల కాలంలో దాదాపు రూ.4.48 లక్షల కోట్ల మేర పెరిగింది. 

అంతకు ముందు యూపీఏ-2 హయాంలో ముఖేశ్‌ అంబానీ సంస్థ మార్కెట్‌ విలువ కేవలం రూ.11,684 కోట్ల మేర మాత్రమే పెరిగింది. అయితే ఈ సంస్థ మార్కెట్‌ విలువ రికార్డు స్థాయిలో పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

రిలయన్స్‌ సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యూపీఏ కాలం నుంచి పెట్టిన భారీ పెట్టుబడులు, చేపట్టిన విస్తరణ పనులు మోదీ హయాంలో ఒక కొలిక్కి రావడంతో ఆదాయం పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. 

రిలయన్స్‌ సంస్థ టెలికాం, రిటైల్‌, సామర్థ్యం పెంపు తదితర అంశాల వైపు కూడా దృష్టి సారించడం కూడా మార్కెట్లో ఆ సంస్థ విలువ పెరగడానికి కారణమన్న అభిప్రాయం ఉన్నది. పెట్టుబడులు ఎన్ని పెట్టినా.. వాటి నుంచి లాభాలను పొందే వాతావరణం కేంద్రం నుంచి నిరంతరాయంగా లభించడం వల్లే రిలయన్స్‌ సంస్థ మార్కెట్లో లాభపడిందని విమర్శకులు చెబుతున్నారు. 

రిలయన్స్‌ సంస్థ భారీస్థాయిలో రూ.4.48 లక్షల కోట్ల మేర లాభాలను ఆర్జించడానికి సర్కార్ సహకారం అవసరం అన్న అభిప్రాయం ఉంది. జియో విషయంలో మోదీ సర్కారు రిలయన్స్‌కు ఇచ్చిన సహకారం  దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. 

మరోవైపు మోదీకి అత్యంత ప్రియమైన పారిశ్రామికవేత్తగా పేరున్న అదానీ గ్రూపు సంస్థలు కూడా ఎన్‌డీఏ పాలనలో విశేషంగా లాభపడాయి. ఆ గ్రూపు ఆరు కంపెనీల మార్కెట్‌ విలువ గడిచిన ఐదేళ్లలో రూ.1.53 లక్షల కోట్లకు చేరింది. 

అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ సంస్థల మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. అంతకు ముందు యూపీఏ-2 పాలన ముగిసే నాటికి ఈ గ్రూపు సంస్థల మార్కెట్‌ విలువ కేవలం రూ.43,651 కోట్లు నిలిచింది. 

మోదీ హయాంలో అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ. 99,898 కోట్ల మేర పెరిగింది. ఇదే సమయంలో బజాజ్‌ గ్రూపునకు చెందిన 10 గ్రూపు సంస్థల మార్కెట్‌ విలువ రూ.3.62 కోట్ల మేర పెరిగింది. అంతకు ముందు ఐదేళ్లలో ఈ గ్రూపు సంస్థల మార్కెట్‌ విలువ ఎదుగుదల రూ.76,322 కోట్లు. 

మరోవైపు బిర్లా గ్రూపు సంస్థల మార్కెట్‌ విలువ రూ.1.05 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతకు ముందు యూపీఏ-2 హయాంలో బిర్లాల సంస్థల మార్కెట్‌ విలువ రూ.1.02 కోట్లుగా నిలిచింది. మరోవైపు టాటా గ్రూపు స్టాక్స్‌ మార్కెట్‌ విలువ రూ.4.22 కోట్ల మేర పెరిగాయి. 

మోడీ సర్కారు గద్దెనెక్కక ముందు యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల కాలంలో అంతర్జాతీయంగా వ్యాపార, వాణిజ్యాలకు పూర్తి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పట్లో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఈ పరిస్థితితో అంతర్జాతీయంగా పెరిగిన మార్కెట్‌ అవ కాశాలను చాలా భారత కంపెనీలు పూర్తిస్థాయిలో అంది పుచ్చుకొని అభివృద్ధి చెందాయి. 

ఈ సమయంలో మోదీ అనుకూల పారిశ్రామికవేత్తల వర్గం వారి సంస్థలు సాధించిన లాభాలు, పెంచుకున్న మార్కెట్‌ విలువ అంతంతగానే ఉంది. అయితే మోదీ అధికారం లోకి వచ్చాక అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొని అంతర్జాతీయ మార్కెట్‌ విస్తృతి కుదించుకుపోయింది. 

దేశీయంగా కూడా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలతో వ్యాపార అనుకూల వాతావర ణం పూర్తిగా దెబ్బతింది. అయినా కొన్ని కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్లలో తమ మార్కెట్‌ విలువను పెంచు కోవడం విశేషం. కార్పొరేట్ సంస్థలకు కేంద్రం అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో సదరు సంస్థలు వ్యాపార విస్తరణలకు పాల్పడుతూ మార్కెట్‌ విలువను లక్షల కోట్ల మేర పెంచుకున్నాయన్న అభిప్రాయం ఉన్నది.