Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌ జియో మరో సెన్సేషన్: 20 శాతం వాటాల విక్రయం...

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్‌లో నాలుగు వారాల్లో నాలుగు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయ్యాయి. దీంతో రిలయన్స్ జియోకు రూ.67,195 కోట్ల నిధులు వచ్చాయి.
 

reliance jio sensation: General Atlantic to invest 6598 cr in Jio Platforms
Author
Hyderabad, First Published May 18, 2020, 11:38 AM IST

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.34 శాతం వాటా కోసం అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ, జనరల్‌ అట్లాంటిక్‌ రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. నాలుగు వారాల్లో ఇది నాలుగో డీల్, 

ఈ నాలుగు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.67,195 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఒప్పదం పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్‌లో  జనరల్‌ అట్లాంటిక్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగా, ఎంటర్‌ప్రైజ్‌  విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటిదాకా 14.8% వాటా విక్రయించింది. వ్యూహాత్మక, ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్లకు 20% వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదని సమాచారం. అందుకని భవిష్యత్‌లో మరిన్ని ఒప్పందాలు ఉండొచ్చని అంచనా. 

వచ్చే ఏడాది మార్చికల్లా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను  రుణ రహిత కంపెనీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గత ఏడాది ఆగస్టులో పేర్కొన్నారు. తాజా ఒప్పందాలతోపాటు  రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ లక్ష్యం ఈ ఏడాది డిసెంబర్‌ నెలకే సాకారం కానున్నది. మార్చి నాటికి రిలయన్స్‌ నికర రుణ భారం రూ.1,75,259 కోట్లు ఉంటుంది.

also read చికెన్‌ ముక్క యమ కాస్ట్ లీ.. కిలో ఎంతంటే..?

రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 9.99 శాతం పెట్టుబడి పెట్టింది. దీని విలువ రూ.43,574 కోట్లు ఉంటుంది. తదుపరి ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ద్వారా రిలయన్స్ ‘జియోమార్ట్’ పేరిట ఈ-కామర్స్ బిజినెస్‌లో అడుగు పెట్టనున్నది. 

సిల్వర్ లేక్ సంస్థ 1.15 శాతం ఈక్విటీతో రూ.5,666 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఇక విస్టా ఈక్విటీ పార్టనర్స్ సంస్థ.. జియోలో 2.32 శాతం ఈక్విటీ కొనుగోలు కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్దమైంది. తాజాగా జనరల్ అట్లాంటిక్ సంస్థ 1.34 శాతం ఈక్విటీ కొనుగోలు చేసి రూ.6,598 కోట్ల పెట్టుబడి అంగీకారానికి వచ్చింది.

సౌదీ అరేబియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కూడా పెట్టుబడి పెట్టడానికి రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios