గత రెండు నెలలుగా భారీగా పడిపోయిన చికెన్‌ ధరలు పతాకస్థాయికి చేరాయి. ఎన్నడూ లేనంతగా కోడి మాంసం ధరలు అమాంతం పెరిగాయి. గతవారంలో రూ.200లకు కిలో లభించిన చికెన్ కోసం ఇప్పుడు రూ.310 ఖర్చు చేయాల్సి వస్తంది. 

లాక్‌డౌన్ వల్ల దాణా సరఫరా లేక కోళ్లు పెరుగక పంపిణీ తగ్గిపోవడం.. అంతా ఇళ్ల వద్దే ఉండటంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. రంజాన్ మాసం కావడంతో చికెన్ డిమాండ్ పెరిగింది.

దీనికి పౌల్ట్రీ కొరతతో అదనంగా కలిసి వచ్చిందని కర్ణాటక చికెన్ విక్రయదారుల సంఘం అధ్యక్షుడు నాగరాజ్ పట్టాన్ చెప్పారు. తాను వంద కోళ్లకు ఆర్డర్ ఇస్తే ఫౌల్ట్రీ రైతులు కేవలం 50 కోళ్లు మాత్రమే పంపారని, రంజాన్ మాసంలో డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని నాగరాజ్ పేర్కొన్నారు. 

గత నెలలో కిలో రూ.80 ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా రూ.300లకు చేరిందని వినియోగ దారులు చెప్పారు. చికెన్ ధరల పెరుగుదలతో తాను కిలోకు బదులు అరకిలో మాత్రమే కొంటున్నామంటున్నారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కొన్నిచోట్ల కిలో చికెన్ రూ.310 కూడా పలికింది. తెలంగాణలో ఇదే గరిష్ట రికార్డు. ఫౌల్ట్రీ యజమానులు సరిఫడా కోళ్లు సరఫరా చేయలేకపోవడమే దీనికి కారణం. 

also read కరోనా కష్టాలకు ‘కరెన్సీ ముద్రణ’తోనే చెక్.. కానీ ద్రవ్యలోటు సంగతేంటి?

గతంలో వేసవిలో ఎన్నడూ రూ. 250 దాటని చికెన్‌ స్కిన్‌లెస్‌ ధర ప్రస్తుతం కిలో రూ. 276కు చేరడం ఆల్‌టైమ్‌ రికార్డ్‌గా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రంజాన్‌ మాసం కావడంతో కిలో రూ. 300 దాటిందని వ్యాపారులు పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. దీంతో రాష్ట్రంలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోయింది. దీనికి తోడు ఎండ తీవ్రత పెరిగి కోళ్లు తక్కువ బరువు వస్తున్నాయి. ప్రస్తుతం డిమాండ్‌ పెరిగి సప్లయ్ తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 

సాధారణంగా తెలంగాణలో రోజుకు సగటున 7.5 లక్షల నుంచి 8లక్షల కిలోల చికెన్ విక్రయిస్తారు. ఆదివారం అది 24 లక్షల కిలోల వరకు ఉంటుంది.

లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణల నెలకు దాదాపు 4.20 కోట్ల కోడి పిల్లలు ఉత్పత్తవుతాయి. ఇప్పుడు అది 2.8 కోట్లకు పడిపోయింది. కరోనా నేపథ్యంలో చికెన్ తినాలని వైద్యులు, ప్రభుత్వం చెప్పడంతో దానికి డిమాండ్ పెరిగిపోయి ధరలకు రెక్కలొచ్చాయి.

లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు డిమాండ్ లేక ఫౌల్ట్రీ యజమానులు ఉచితంగా కోళ్లు పంచేశారు. కొందరు తక్కువ ధరకు అమ్మేశారు. కోళ్ల ఫారాలు దాదాపు ఖాళీ అయ్యాయి. దాంతో మార్కెట్లో కోళ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. 

వాస్తవంగా హోటళ్లు, వేడుకల వంటివేవీ లేక సాధారణ డిమాండ్ కన్నా కోడి మాంసం విక్రయాలు తగ్గిపోయాయి. అవికూడా ఉండి ఉంటే డిమాండ్ అమాంతం పెరిగిపోయి ధర మరింత పెరిగేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చేనెల 15 తర్వాతే చికెన్ ధర కొంత తగ్గే అవకాశం ఉన్నదని వెంకటేశ్వర హేచరీస్ జనరల్ మేనేజర్ ఎస్ బాలసుబ్రమణ్యం తెలిపారు.