Asianet News TeluguAsianet News Telugu

మారటోరియం వల్ల ‘నో’ యూజ్.. ఈఎంఐ చెల్లింపులే బెస్ట్

రుణాల నెలసరి వాయిదా చెల్లింపులపై ఆర్బీఐ విధించిన గడువు ముగిసిన తర్వాత వడ్డీతోపాటు వసూలు చేస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. కనుక ఖాతాదారులకు మారటోరియం భారమేనని బ్యాంకులు పేర్కొన్నాయి. అదనపు ఈఎంఐల ద్వారా వసూలు చేస్తామని ఎస్బీఐ తెలిపింది. కనుక చెల్లింపులకు అవకాశం గల వారు ఈఎంఐ చెల్లింపులే శ్రేయస్కరమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పష్టం చేసింది.  

RBI's loan EMI moratorium proposal for borrowers: Here's all you need to know
Author
Hyderabad, First Published Apr 2, 2020, 11:25 AM IST

న్యూఢిల్లీ: ఆర్బీఐ మారటోరియంతో ఒరిగిదేమీ ఉండదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు నెలలు నెలసరి వాయిదా (ఈఎంఐ) లు చెల్లించకపోతే ఆ తర్వాత వడ్డీతోసహా కట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు.

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సం.. దాని కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణాల నెలసరి చెల్లింపులను వాయిదా వేసుకునే అవకాశాన్ని కస్టమర్లకు, అనుమతిని బ్యాంకర్లకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

గత నెల 27న ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం అన్ని టర్మ్‌ లోన్లపై మారటోరియం తీసుకునే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. మార్చి ఒకటో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉన్న కాలంలోని అన్ని ఈఎంఐలను వాయిదా వేసుకోవచ్చు. 

అంటే ఏప్రిల్‌, మే, జూన్‌ ఈఎంఐ చెల్లింపులకు దూరంగా ఉండొచ్చు. అయితే ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మారటోరియం గడువు ముగిశాక ఈ 3 నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వడ్డిస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. 

మారటోరియం తీసుకున్న కస్టమర్ల నుంచి ఈ వడ్డీని అదనపు ఈఎంఐల ద్వారా వసూలు చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. ఉదాహరణకు 8.3 శాతం వడ్డీరేటుతో రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తి 15 ఏళ్లు, దాని ఈఎంఐలు చెల్లించాల్సి ఉందనుకుంటే వీరు ఈ మూడు నెలల మారటోరియం తీసుకుంటే మొత్తం రుణ కాలపరిమితిలో అదనంగా నికర వడ్డీ దాదాపు 2.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇది వీరిప్పుడు చెల్లిస్తున్న 8 నెలల ఈఎంఐలకు సమానమని ఎస్బీఐ తెలిపింది. అలాగే రూ.6 లక్షల వాహన రుణం 54 నెలల గడువుతో తీసుకున్నవారు మారటోరియం తీసుకుంటే రూ.19వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఇది వీరు సాధారణంగా చెల్లించే ఈఎంఐలకు ఒకటిన్నర రెట్లు అధికం. కాబట్టి నగదు కొరత లేనివారు మారటోరియానికి దూరంగా ఉండటమే ఉత్తమమని బ్యాంకులు చెప్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇదే సూచిస్తున్నది. అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలపరిమితి పొడిగింపు నుంచి తప్పించుకోవాలని హితవు పలికింది. 

కాగా, కరోనా వల్ల తమ ఆదాయం దెబ్బతిన్నవారే మారటోరియం తీసుకోవాలని భారతీయ బ్యాంకింగ్‌ సంఘం రుణ గ్రహీతలకు సూచించింది. దాదాపు వేతన జీవుల కంటే వ్యాపారులకు మారటోరియం ఇప్పుడు లాభదాయకమని అభిప్రాయపడింది.

మార్చి నెలకు ఇప్పటికే రుణాల ఈఎంఐ ఖాతాల నుంచి చెల్లించినట్లయితే తిరిగి ఆ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) బుధవారం తమ కస్టమర్లకు తెలిపింది. ఈ అవకాశం గృహ, ఆటో రుణ గ్రహీతలకు మాత్రమేనన్నది. 

ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం కింద ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వల్ల ఆదాయం దెబ్బతిన్నవారికి తమ ఈ నిర్ణయం ఊరట ఇవ్వగలదని బీవోబీ ఆశాభావం వ్యక్తం చేసింది. కోరుకున్న వారికే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది.

మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు తమతమ బ్రాంచీలకు సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌజ్‌ (ఎన్‌ఏసీహెచ్‌) ద్వారా ఈఎంఐలను చెల్లిస్తున్నవారు ఎన్‌ఏసీహెచ్‌ నిలిపివేతకు, పొడిగింపు కోసం ఈ-మెయిల్‌ ద్వారా సూచించిన బ్యాంక్‌ ఈ-మెయిల్‌ ఐడీకి సందేశం ఇవ్వాలని ఎస్బీఐ తమ కస్టమర్లను కోరింది.

ఎస్బీఐ వెబ్‌సైట్‌లో అన్ని సర్కిళ్లకు సంబంధించిన ఈ-మెయిల్‌ ఐడీలు ఉంటాయని తెలిపింది. అలాగే మారటోరియం వద్దనుకుని యథాతథంగా ఈఎంఐలు చెల్లించాలనుకునేవారికి దీంతో పనిలేని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా తమ వెబ్‌సైట్‌ హోం పేజీల్లో కస్టమర్ల కోసం మారటోరియం ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి. 

ఈఎంఐల వాయిదా కోరుకునేవారు తమతమ లోన్‌ అకౌంట్‌ నెంబర్లను, ఇతరత్రా సులభతర వివరాలను పొందుపరుచాలని సూచించాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సైతం మారటోరియం కావాలనుకుంటే ఈ-మెయిల్‌ సందేశాలను కస్టమర్ల నుంచి కోరింది. యాక్సిస్‌ బ్యాంక్‌ మాత్రం ఆర్బీఐ మార్గదర్శకాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఓ నిర్ణయాన్ని కస్టమర్లకు అందిస్తామని తెలిపింది.

సాధారణంగా ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డెబిట్ అయిపోతుంటాయి. ఈఎంఐని దృష్టిలో పెట్టుకొని అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటారు కస్టమర్లు.

అయితే అందరిలో ఆర్బీఐ మారటోరియం సూచించినట్టుగా రుణాల ఈఎంఐలు చెల్లించాలా? వద్దా? చెల్లిస్తే ఎంతవరకు చెల్లించాలి? మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందా? మొత్తం అమౌంట్ చెల్లించాలా? తెలియక కస్టమర్లు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో పలు బ్యాంకులు వివిధ రకాల ఆప్షన్లు అందిస్తున్నాయి.

కెనరా బ్యాంకు డిఫాల్ట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. డిమాండ్ చేసిన వినియోగదారులకు మాత్రమే రిలీఫ్ ఉంటుంది. ఈఎంఐ చెల్లింపులు నిలిపివేయాలంటే  ఎస్సెమ్మెస్ ద్వారా ‘నో’ అని పంపాల్సి ఉంటుంది. 

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా వినియోగదారుల డిమాండ్ మీదే రిలీఫ్ ఇస్తాయి. అయితే ఈ బ్యాంకుల ఖాతాదారులు ఈ-మెయిల్ ద్వారా మారటోరియం కోరొచ్చు. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో ఆటోమాటిక్‌గా రిలీఫ్ లభిస్తుంది. ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులదీ అదే దారి. 

కొన్ని రకాల లోన్లపై వినియోగదారుల డిమాండ్ మేరకు మాత్రమే ఐసీఐసీఐ బ్యాంకు రిలీఫ్ ఈ మారటోరియం అమలు చేయనున్నది. ఈ విధానం ఎంపికల నిర్ణయంపై బ్యాంకులు పనిచేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios