ముంబై: కరోనా కాటుతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్యులకు ఊరట కల్పించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను వరుసగా మూడోసారి తగ్గించింది. రెపో రేటును మార్చిలో 75 బేసిస్‌ పాయింట్లు, ఏప్రిల్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ.. శుక్రవారం తాజాగా ఈ రేటును మరో 40 పాయింట్లు కుదించింది.

టర్మ్‌ లోన్లపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించిన ఆర్బీఐ.. వర్కింగ్‌ క్యాపిటల్‌ వడ్డీ చెల్లింపులపై విధించిన మారటోరియంను కూడా మరో మూడు నెలలు పొడిగించింది. కార్పొరేట్లకు మరిన్ని రుణాలను అందించేందుకు వీలుకల్పించే బ్యాంక్‌ ఎక్స్‌పోజర్‌ను ఆ కంపెనీల నికర విలువలో 30 శాతానికి పెంచింది. 

ఈ మేరకు ఆర్బీఐ రెపోరేట్ తగ్గించడం వల్ల బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్ (ఎంసీఎల్‌ఆర్‌‌)ను తగ్గించి సదరు ప్రయోజనాన్ని నేరుగా గృహ, వాహన రుణగ్రహీతలకు అందజేస్తే నెలవారీ కిస్తీ (ఈఎంఐ) రూపంలో వారు చెల్లించే సొమ్ములో కొంత ఆదా అవుతుంది. 

ఉదాహరణకు ఓ ఉద్యోగి 20 ఏళ్ల గడువుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే ఇప్పటివరకు అతను 7.65 శాతం వడ్డీతో కలిపి నెలకు రూ.40,739 చొప్పున కిస్తీలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఆర్బీఐ రెపో రేటు కుదింపునకనుగుణంగా ఎస్బీఐ తన వడ్డీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు (7.25 శాతానికి) తగ్గిస్తే ఇకపై ఆ ఉద్యోగి చెల్లించే నెలవారీ కిస్తీ రూ.39,519కి తగ్గుతుంది.

also read అమెరికా కన్నెర్ర: బ్లాక్ లిస్ట్‌లో ఆ చైనా కంపెనీలు... ...

తద్వారా అతనికి నెలకు రూ.1,220 చొప్పున ఏడాదిలో రూ.14,640 ఆదా అవుతాయి. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందిన కస్టమర్లకు ఈ విధంగా మరింత లబ్ధి చేకూరుతుంది.

మరో వ్యక్తి పాతికేళ్లలో చెల్లించేలా 7.65 శాతం వడ్డీ రేటుతో రూ.45 లక్షల గృహ రుణం తీసుకున్నాడనుకుందాం. బ్యాంకు వడ్డీ రేటును 7.25 శాతానికి తగ్గిస్తే, అతడి ఈఎంఐ భారం రూ.32,526 నుంచి రూ.31,301కి తగ్గుతుంది. ఇదే సమయంలో కొద్దిగా ఆర్థిక స్థోమత ఉండి, గతంలో చెల్లించిన ఈఎంఐ చెల్లింపులే కొనసాగిస్తే, ఆ వ్యక్తి రుణ చెల్లింపు గడువు 25 నెలలు తగ్గి రూ.8.33 లక్షలు ఆదా అవుతాయి. 

ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడేళ్లలో చెల్లించేలా 7.95 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల రుణం తీసుకుంటే, ఈ వడ్డీ రేటు ప్రకారం ప్రస్తుతం అతడు నెలనెలా రూ.7,781 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేటు 0.40 శాతం తగ్గి 7.55 శాతానికి చేరితే.. ఈఎంఐ భారం నెలకు  రూ.7,781 నుంచి రూ.7,681కు తగ్గుతుంది. అంటే ఏడేళ్లలో రూ.8,400 ఆదా అవుతాయి. అదే రూ.10 లక్షల వాహన రుణం తీసుకుని ఉంటే రూ.16,632 ఆదా అవుతాయి.

ఇక రివర్స్‌ రెపో రేటును కూడా 40 బేసిస్‌ పాయింట్లు కుదించడంతో అది 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలతోపాటు సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.