న్యూఢిల్లీ: ఇంతకాలం సామాజిక, ఆధాత్మిక అంశాలకే పరిమితమైంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్). కానీ క్రమంగా రాజకీయాలు, ఆర్థికాంశాల్లో జోక్యం చేసుకునేందుకు వెనుకాడటం లేదు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఆర్థిక సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, అలా సాధ్యం కాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఎస్‌జేఎం కో కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వ్యాఖ్యానించారు. 

‘ప్రభుత్వంతో ఉన్న విభేదాల గురించి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లతోపాటు ఇతర సిబ్బంది బహిరంగంగా ప్రస్తావించకుండా చూసుకోవాలి. ఒకవేళ అది కుదరకపోతే మీరు రాజీనామా చేయడం సమంజసం. ప్రభుత్వంతో విభేదాలు ఉంటే బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కరించుకోవాలి. అంతేకానీ బహిర్గతం చేయకూడదు’ అని ఎస్జేఎం కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ వ్యాఖ్యానించారు. ఆర్బీఐ చట్టంలోని ఏ సెక్షన్‌నైనా అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో ఉర్జిత్‌పటేల్‌ తన పదవి నుంచి తప్పుకుంటారనే వార్తలొచ్చాయి. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఈ పొరపొచ్చాలను తొలగించుకునేందుకు మొదటిసారిగా ప్రభుత్వం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7(ఎ)ను ప్రయోగించినట్లు వార్తలొస్తున్నాయి. గతంలోనూ 2012 - 13లో అప్పటి విత్త మంత్రి పీ చిదంబరం కూడా వడ్డీరేట్లు తగ్గించాలని ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావును కోరారు. కానీ ఆయన ద్రవ్య నియంత్రణ చర్యలకే కట్టుబడి ఉండటంతో తామేం చేయలేం.. కొన్ని జాగ్రత్తలు మాత్రమే తీసుకోగలమని అన్నారే గానీ ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించేందుకు ముందుకు రాలేదు. 

ఆర్బీఐ చట్టంలోని ఏడో సెక్షన్‌ను అమలు చేస్తే ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాలరాసినట్లే అవుతుందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల సలహాదారు సుబ్రమణ్యం, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా తదితరులు మధ్యలోనే వెళ్లిపోయారు. తాజాగా పారిశ్రామిక సంస్థల డిమాండ్లకు అనుగుణంగా తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపని ఆర్బీఐ గవర్నర్, డైరెక్టర్ల మండలిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అదే జరిగితే ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కానిగా వ్యవహరించిన ఆర్బీఐ పాత్ర నామమాత్రంగా మారిపోతుందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.

తాజాగా స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) కన్వీనర్ అశ్వినీ మహాజన్ మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులు ఆర్బీఐకి తెలియవని చెప్పేందుకు వెనుకాడలేదు. కానీ 1991 నుంచి పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలను పదేపదే విమర్శిస్తూ ప్రజలకు దగ్గరైన ఎస్జేఎం ఈనాడు మోదీ సంస్కరణల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్న కార్పొరేట్ సంస్థలు దివాళా ప్రకటిస్తున్నాయే గానీ అప్పు తీర్చేందుకు ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల పేరిట వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కార్పొరేట్లకు రుణాలు కల్పించి.. ఆ పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నదని విశ్లేషకులు అబిప్రాయ పడుతున్నారు.