Asianet News TeluguAsianet News Telugu

వడ్డీరేట్లపై స్టేటస్‌కో: నేటి నుంచి ఆర్బీఐ సమీక్ష

ద్రవ్యోల్బణం రిస్క్ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే మూడో ద్రవ్య పరపతి సమీక్షలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోకపోవచ్చునని బ్యాంకింగ్, రేటింగ్ సంస్థలు భావిస్తున్నాయి. 

RBI may maintain status quo on policy rate: experts

ముంబై: బుధవారం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మూడు రోజులు జరిపే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ఖరీప్‌ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు వడ్డీ రేట్లు పెరిగేందుకు దోహదం చేసే అవకాశం ఉన్నా.. ప్రస్తుతానికి వాటి జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆర్‌బీఐ మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సోమవారం (జూలై30) నుంచి బుధవారం (ఆగస్టు 1) మధ్య జరగబోతోంది. 1న సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రకటిస్తుంది. గతంలో రెండు రోజులే నిర్వహిస్తూ వచ్చిన సమీక్ష జూన్‌లో నిర్వహించిన రెండో ద్వైమాసిక సమీక్ష నుంచి మూడు రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించనున్న మూడో ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనేది చూడాలి. వడ్డీ రేట్లపై పలు ఆర్థిక, రేటింగ్ సంస్థల అంచనాలివి:  

క్షీణించిన రూపాయి: రేట్ల పెంపు అనుమానమే- ఎస్బీఐ


తాజా పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపకపోవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని తమ పరిశోధన నివేదికలో తెలిపింది. జూన్‌ నుంచి డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 శాతం క్షీణించింది. మార్కెట్‌ అంచనాల ప్రకారం రూపాయి క్షీణతకు కారణమైన వడ్డీ రేట్లను పెంచాలని ఆర్‌బీఐ భావిస్తే తప్ప రేట్లలో మార్పు ఉండకపోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఇదేకాకుండా ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 73 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశం ఉన్నా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు సేకరిస్తాయనేది కీలకమని ఎస్‌బీఐ నివేదికలో వెల్లడించింది. ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ సంస్థ కూడా ఎంపీసీ వడ్డీ రేట్లను తటస్థంగా ఉంచేందుకు అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఇప్పటికిప్పుడు ఆర్‌బీఐ చర్యలు తీసుకోవల్సిన అవసరం కనిపించడం లేదని అభిప్రాయ పడింది. 

హెచ్డీఎఫ్సీదీ అదే బాట 


తాజా సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు జోలికి వెళ్లకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొన్నది. కనీస మద్దతు ధర పెంపు వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందా? లేదా? అనే దానిపై ఇప్పుడే ఆర్బీఐ ఒక నిర్ణయానికి  రాకపోవచ్చని, వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పలు దఫాలుగా పెంచే అవకాశం ఉంది. ఆగస్టు సమీక్షలో బహుశా పెంచవచ్చ’ని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్‌ తమ నివేదికలో పేర్కొంది. ‘ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉండటంతోపాటు మార్కెట్లలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కఠిన నిర్ణయాలే సమీక్షలో తీసుకోవచ్చ’ని డీబీఎస్‌ అభిప్రాయపడింది.

ఎల్‌ఐసీ దగ్గరే రూ.10వేలకోట్లు!


వివిధ బీమా సంస్థల వద్ద రూ.15,167కోట్లు క్లెయిం కాని సొమ్ము ఉందని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఐఏ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాలసీదారులను గుర్తించి, వెంటనే వారి కుటుంబీకులు, లేదా ఆ పాలసీదారుడు పేర్కొన్న నామినీకి ఆ సొమ్మును వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారుడి ప్రయోజనాలను కాపాడేందుకు బోర్డు స్థాయి కమిటీ నిరంతరం బీమా సంస్థలను పర్యవేక్షిస్తుంది. క్లెయింల సొమ్ము వారి అందేలా చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో క్లెయిం కానీ సొమ్మును సైతం పాలసీదారుడు పేర్కొన్న నామినీకి అందేలా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2018 నాటికి జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)తో సహా 22 ప్రైవేటు రంగ బీమా సంస్థల వద్ద రూ.15,166కోట్లు క్లెయిం కాని సొమ్ము ఉండిపోయిందని గుర్తించింది. ఒక్క ఎల్‌ఐసీ దగ్గరే రూ.10,509కోట్లు ఉండగా, ప్రైవేటు సంస్థల వద్ద రూ.4,657కోట్లు ఉన్నాయి.

ప్రైవేట్ సంస్థల్లో ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ టాప్


జీవిత బీమాను అందించే ప్రైవేట్ కంపెనీల్లో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వద్ద రూ.807.4కోట్లు ఉండగా, ఆ తర్వాతి జాబితాలో రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(రూ.696.12కోట్లు), ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కో (రూ.678.59కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(రూ.659.3కోట్లు) ఉన్నాయి. పాలసీదారుడు, నామినీలు లేదా పాలసీదారుడిపై ఆధారపడి జీవిస్తున్న వారు సదరు పాలసీ క్లెయిం స్టేటస్‌ చూసుకునేలా జీవిత బీమా సంస్థలు తమ వెబ్‌సైట్లలో సెర్చ్‌ ఆప్షన్‌ ఇస్తున్నారా? అని ఐఆర్‌డీఐఏ ప్రశ్నించింది. ఒకవేళ అలాంటి ఆప్షన్స్‌ లేకపోతే వెంటనే జతచేయాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios