ఎప్పుడూ నోరు విప్పని ఒక వ్యక్తి హఠాత్తుగా గొంతు విప్పితే, ఎంతటి ఉపద్రవంలోనూ స్పందించని వ్యక్తి అకస్మాత్తుగా  ధ్వజమెత్తితే మరి చెలరేగేది పెను దుమారమే. దీనికి ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరే ప్రధాన కారణం. ఇటువంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమేనా? అన్నదే మిలియన్ డాలర్ల సందేహం. ఉభయ వర్గాల మధ్య మొదలైన ఈ రచ్చ మున్ముందు ఏ రూపాన్ని సంతరించుకుంటుందో.. చివరకు ఏ తీరానికి  చేరుతుందో.. చూడాల్సిందే మరి.

ప్రస్తుత ఆర్బీఐ గవరనర్ ఉర్జిత్‌ పటేల్‌ గత గవర్నర్లకు కొంత భిన్నం. రఘురామ్‌ రాజన్‌ అనర్గళంగా మాట్లాడతారు. ఆర్థిక, సాంఘిక, బ్యాంకింగ్‌ వ్యవహారాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేస్తారు. కానీ ఉర్జిత్‌ పటేల్‌ తీరే డిఫరెంట్. ఎక్కువగా బయట కనిపించరు. మాట్లాడటం కూడా అరుదే. కానీ పని విషయంలో తన వైఖరికి అనుగుణంగా జరగాల్సిందేనన్నది ఉర్జిత్ మన:స్తత్వం. తన నిర్ణయం ప్రభుత్వానికి నచ్చుతుందా... లేదా? అనేది చూడరు. 

ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఒకరిగా మన్ననలు పొంది, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్ ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈయన గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా.. రెండో దఫా కూడా రాజనే గవర్నర్‌గా కొనసాగొచ్చనుకుని ఉంటారు.. రాజనే కాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ పనగరియా కూడా తమ పదవీ కాలానికి ముందే వెళ్లిపోయారు. 

పొమ్మనలేక.. పొగ పెట్టడానికి.. ప్రభుత్వం ఏం చేస్తోందో... తెలియని వ్యక్తులు కాదు. రాజన్ నుంచి సుబ్రమణ్యం వరకు.. ఆ పై పనగరియా వరకు ఉండలేను మొర్రో... అన్న పరిస్థితి మాత్రం కల్పించింది ప్రభుత్వం.  సర్కార్‌తో మమేకం అయినవారిగా పేరున్న ఈ ఆర్థిక వేత్తలు ఎక్కువకాలం తమతమ హోదాల్లో పనిచేయలేక తక్కువ సమయంలోనే తప్పుకొని వెళ్లిపోయారు. 

అంతెందుకు?! మూడేళ్లపాటు ఆర్బీఐ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగాల్సిన నచికేత్‌మోర్ ఉన్నట్టుండి పదవి పోగొట్టుకున్నారు. తాజాగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ విషయంలోనూ ఇదే జరగబోతోందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. వచ్చే ఏడాదితో ఆయన పదవీ కాలం పూర్తయి. మళ్లీ పరిస్థితులు సానుకూలంగా ఉంటే మరోసారి కొనసాగింపు లభిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 

కానీ, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. రెండో విడత మాట దేవుడెరుగు... ఉన్న పదవీ కాలమైనా ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పూర్తి చేస్తారా..?? అన్న సందేహం కలుగుతోంది. గమ్మత్తేమిటంటే ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ను ప్రభుత్వమే ఏరికోరి తెచ్చుకుంది.. రాజన్‌ను పక్కన పెట్టాలనుకోగానే చకచకా పావులు కదిలాయి.. రాజన్‌ ఆక్స్‌ఫర్డ్‌ కెళ్లిపోయారు. ఉర్జిత్‌ పటేల్‌ కొత్త సారథి అయ్యారు. 

ప్రారంభంలో రఘురాం రాజన్‌ మాదిరి దూకుడు లేదంటూ విమర్శలు సైతం ఎదుర్కొన్నారు ఉర్జిత్ పటేల్. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాల్లో పెదవి విప్పని మౌన మునిలా వ్యవహరించిన ఈయన శైలి చాలా విమర్శలకు గురైంది కూడా. ఎవరెన్ని విమర్శల బాణాలు ఎక్కుపెట్టినా.. కిమ్మనకుండా... తన పని తాను చేసుకుంటూ పోయారు. ఒక దశలో ‘ఈయన ప్రభుత్వం తరఫు మనిషి’ అన్న ముద్ర పడిపోయింది కూడా. 

అలాంటి వ్యక్తిగా ఉర్జిత్ పటేల్ ప్రభుత్వంతో వైరానికి దిగుతారని ఎవరైనా ఊహిస్తారా?! ప్రభుత్వం మీద విరుచుకుపడతారని అనుకుంటారా.. కానీ.. ఆయన పెదవి విప్పాడు. ప్రభుత్వం పక్కలో బల్లెం దిగింది.  ఆర్‌బీఐకి ప్రభుత్వ బ్యాంకులపై పూర్తి అధికారం లేదన్న ఆయన మాటలు చురకత్తుల్లా దూసుకెళ్లాయి. మరోపక్క ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే కేంద్ర బ్యాంకుకు పూర్తి స్వతంత్ర ఉండాలంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విఠల్  ఆచార్య చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. 

తాము చెప్పినట్లుగానే రిజర్వు బ్యాంకు విధానాలు సాగాలనేది ప్రభుత్వ వైఖరి అయితే.. అది సరైనది కాకపోతే ఒప్పుకొనేది లేదన్నది ఆర్‌బీఐ పట్టుదల. వెరసి ఉభయ వర్గాల మధ్య చెడింది.. ఘర్షణ మొదలైంది. విమర్శలు ఎక్కువయ్యాయి. దూరం పెరిగింది. తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ సైతం రంగంలోకి దిగింది. ఉర్జిత్‌ పదవీకాలం ఇంకో ఏడాది ఉంది.

ఈలోపు ఎటూ కేంద్రంలో ఎన్నికలు జరుగుతాయి. మళ్లీ మోదీ సర్కారే కొలువు తీరినా ఉర్జిత్‌కు మరో విడత ఆర్‌బీఐ గవర్నర్‌ పొడిగింపు లభించడం చాలా కష్టమంటూ ఢిల్లీ, ముంబైలోని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కొత్త ప్రభుత్వం కొలువు తీరినా.. అప్పటి పరిస్థితులు ప్రాధాన్యం సంతరించుకుంటాయన్నది తోసిపుచ్చలేని వాస్తవం. ఈలోగా ఏం జరుగుతుందన్నదే ప్రధాన ప్రశ్న.

ఆర్బీఐ, కేంద్రం మధ్య విభేదాలకు కారణాలను ఒకసారి పరిశీలిద్దాం:
నీరవ్‌ మోదీ కుంభకోణం తర్వాత తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తనపైకి వచ్చిన ఒత్తిడిని తట్టుకోవటానికి ఆర్‌బీఐపై విరుచుకుపడింది. బ్యాంకులపై ఆర్‌బీఐ పర్యవేక్షణ సక్రమంగా లేదని విమర్శించడంతో ఇరుపక్షాల మధ్య విబేధాలు పెరిగాయి. ‘మాకు అధికారాలు ఎక్కడున్నాయి’ అని ఆర్బీఐ గవర్నర్‌ నిలదీసే పరిస్థితి వచ్చింది. 

తాజాగా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం చుట్టుముట్టినప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు సులువుగా అప్పులు ఇచ్చే వీలు కల్పించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు ఆర్బీఐ ఒప్పుకోలేదు. ఇక వేగవంతమైన వృద్ధి సాధించటానికి వడ్డీరేట్లు తగ్గించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టాలనే లక్ష్యంతో అందుకు ఆర్బీఐ సిద్ధపడలేదు. 

మరోవైపు ఆర్బీఐ బోర్డు డైరెక్టర్‌ నచికేత్‌ మోర్‌ను ఆకస్మికంగా తొలగించటం ఆర్‌బీఐ అధికార వర్గాలకు రుచించలేదు. ఆర్‌బీఐ అధికారాలకు కత్తెర వేసే విధంగా ప్రత్యేకంగా ‘పేమెంట్స్‌ రెగ్యులేటర్‌’ను నియమించాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆర్‌బీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. తన అసంతృప్తిని బహిర్గతం చేస్తూ ఆర్‌బీఐ వెబ్‌సైట్లో ‘పోస్టు’ కూడా పెట్టేంతగా స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు.     

ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్ పదవి చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణ నియంత్రణే లక్ష్యంగా ముందడుగు వేశారు. ప్రభుత్వ బ్యాంకుల మొండి బాకీల విషయంలో రాజీలేని వైఖరిని ప్రదర్శించారు. వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చెక్కుచెదరలేదు. బ్యాంకులకు భారీగా బకాయి ఉన్న 12 పెద్ద సంస్థలపై ‘దివాలా ప్రక్రియ’ను ప్రారంభించాలని సంబంధిత బ్యాంకులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 

సంక్షోభంలో చిక్కుకున్న ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి, పెద్దనోట్ల రద్దు వల్ల కుంగిపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సులువుగా రుణాలు లభించే విధానాలు అమలు చేయాలంటూ వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గలేదు. పీసీఏ (ప్రామ్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌) నిబంధనలు సడలించటానికి ఉర్జిత్ పటేల్ నిరాకరించారు. 

ఆర్బీఐ స్వతంత్రత, ప్రభుత్వ బ్యాంకులపై దానికి పూర్తి పెత్తనం లేకపోవటంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ విఠల్‌ ఆచార్య చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేకపోతోంది.

మేనేజ్‌మెంట్‌ను మార్చాలన్నా, బోర్డును తొలగించాలన్నా, లైసెన్సు రద్దు  చేయాలన్నా, బ్యాంకుల విలీనమైనా లేదా వేరే బ్యాంకుకు అప్పగించే ప్రయత్నమైనా.. ఇలా ఏ అంశమైనా సరే.. ప్రైవేట్ బ్యాంకుల విషయంలో స్పందించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో స్పందించడం ఆర్‌బీఐకి సాధ్యం కావడంలేదు’ అని విఠల్‌ ఆచార్య గతవారం ముంబైలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాదు ‘ప్రభుత్వం వ్యవహారం టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ మాదిరిగా ఉంటోంది. అంటే స్వల్పకాలిక దృష్టి అన్నమాట. అప్పటికప్పుడు పని జరిగిపోతే చాలు అనే ధోరణికిది నిదర్శనం. రిజర్వు బ్యాంకేమో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంది. టెస్ట్‌ మ్యాచ్‌లో ప్రతి సెషనూ ముఖ్యమే. మర్నాడు ఆట కొనసాగించాలంటే, ఈ రోజు నిలబడటం ముఖ్యం. ఆర్‌బీఐ చేసేది ఇదే. లేదంటే అర్జెంటీనా మాదిరిగా మునిగిపోవలసి వస్తుంది’ అని విఠల్ ఆచార్య హెచ్చరించారు.

ఆర్‌బీఐ బోర్డు డైరెక్టర్‌ నచికేత్‌ మోర్‌ను ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఉన్నఫళంగా తొలగించింది. వాస్తవానికి ఆయనను గత ఏడాది ఆగస్టులోనే కేంద్రమే డైరెక్టర్‌గా నాలుగేళ్ల కాలానికి నియమించింది. తీరాచూస్తే ఏడాది తిరిగేసరికల్లా సాగనంపేసింది. ఆర్బీఐకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సచికేత్ మోర్ ఉద్వాసన జరుగడం, చివరకు ఆర్‌బీఐ గవర్నర్‌కు కూడా తెలియకపోవడం ఉభయ వర్గాల మధ్య పెరిగిన అగాథానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. 

ఇంతకీ నచికేత్‌ను తప్పించడానికి కారణమేమిటంటే రిజర్వు బ్యాంకు నుంచి అధిక డివిడెండు కావాలని కేంద్రం ఒత్తిడి చేసింది. ఇలా ఒత్తిడి చేయడం సబబు కాదని బహిరంగంగానే ఆయన విమర్శించడం కేంద్రానికి నచ్చలేదు. వెంట‌నే ఆయన పై వేటు వేసేసింది. విచిత్రమేమిటంటే నచికేత్‌ తొలగింపును ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ స్వాగతించింది.

మరో ఆసక్తికరమైన సంగతేమిటంటే  అంతకు ముందు నెలలోనే స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కన్వీనర్‌ ఎస్‌.గురుమూర్తిని ఆర్‌బీఐ బోర్డులో డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించటం. ఈ పరిణాలన్నిటినీ గమనిస్తే.. ఆర్‌బీఐకి ఏస్థాయి స్వాతంత్య్రం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
    
కేంద్ర బ్యాంకు కాబట్టి అన్ని బ్యాంకులను ఆర్బీఐ నియంత్రించగలదని అనుకుంటాం. కానీ వాస్తవ పరిస్థితి భిన్నం. ప్రభుత్వ బ్యాంకులపై ఆర్బీఐకి పూర్తి అజమాయిషీ లేదు. ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం-1949 ప్రకారం బ్యాంకింగ్‌  కంపెనీలుగా ఏర్పాటై ఉన్నాయి.

కానీ ప్రభుత్వ బ్యాంకులు భిన్నం. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా‌, దాని అనుబంధ బ్యాంకులు (అన్ని అనుబంధ బ్యాంకులు కొద్దికాలం క్రితం స్టేట్‌ బ్యాంకులో కలిసిపోయాయి) మాత్రం ఎస్‌బీఐ చట్టం- 1955 కింద ఏర్పాటయ్యాయి. ఇతర ప్రభుత్వ బ్యాంకులు బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం- 1970, బ్యాంకింగ్‌ జాతీయకరణ చట్టం- 1980 కింద ప్రభుత్వ అజమాయిషీ కిందకు వచ్చాయి. 

కనుక ఎస్‌బీఐతో సహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కూడా అధికారం చెలాయించే అవకాశం లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షించవచ్చు. కానీ బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం దీని అధికారాలు పరిమితం.

ఏదైనా  తప్పులు, మోసాలు జరిగినప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల డైరెక్టర్లను, సీఎండీలను తొలగించాలనుకున్నా ఆ పని ఆర్‌బీఐ చేయలేదు! ప్రభుత్వ బ్యాంకుల విలీనాల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా ప్రభుత్వ బ్యాంకు దివాలా తీసే పరిస్థితి వస్తే, దాని లిక్విడేషన్‌కు ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి రావలసిందే. అదే పెద్ద సమస్యగా బ్యాంకింగ్‌ నిపుణులు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ బ్యాంకులపై ద్వంద్వ పెత్తనం మంచిది కాదని, ఇది ఎప్పటికైనా చేటు చేస్తుందనే అభిప్రాయం ఏళ్ల తరబడి ఉన్నదే. ప్రభుత్వ బ్యాంకులపై ఇటు ఆర్‌బీఐ, అటు కేంద్రం అజమాయిషీ చేయటం సరికాదని నరసింహం కమిటీ చెప్పింది.

ఈ విధానానికి స్వస్తి పలకాలని సిఫార్సు చేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో, దీనికి సంబంధించిన అంశాలను అథ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం 1991 ఆగస్టులో రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ఎం.నరసింహం సారధ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 

ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం కమిటీ ఇచ్చిన నివేదికను అదే ఏడాది డిసెంబర్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ద్వంద్వ అజమాయిషీకి స్వస్తి చెప్పాలని, ఈ విషయంలో పూర్తి అధికారాలు ఆర్బీఐకే ఉండాలని సిఫారసు చేయటం ఇందులో ఒక ముఖ్యాంశం. దీంతో పాటు బ్యాంకులపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక పాక్షిక- స్వయం నియంత్రిత సంస్థను ఆర్బీఐ ఏర్పాటు చేయాలని సూచించింది. 

గతంలో ఆర్బీఐ గవర్నర్లుగా ఉన్నవారు పలు సందర్భాల్లో బ్యాంకులపై నియంత్రణ విషయంలో తమకు తగినంత స్వేచ్ఛ లేదని చెబుతూ వచ్చారు. ఆర్‌బీఐకి పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని పలువురు బ్యాంకింగ్‌ నిపుణులు వివిధ సందర్భాల్లో స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత దశాబ్దకాలంలో ఆర్‌బీఐ గవర్నర్లకు, కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవటానికి ఇదే ప్రధానాంశంగా ఉంది. ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ విషయంలో ఇది మరోసారి రుజువు అవుతోంది.