Asianet News TeluguAsianet News Telugu

కొత్త కొలువుల సృష్టి మార్గమేలా? విత్తమంత్రి నిర్మలమ్మ ఫోకస్ ఇదే

నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల స్థాయికి పడిపోయిందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) నిర్ధారించిన నేపథ్యంలో కొత్త విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగాల కల్పనపై కేంద్రీకరించారు. నూతనంగా ఉద్యోగాలు కల్పించి, దాంతో వృద్ధి సాధించడం ఎలా?  అన్న విషయమై ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు.  

Proposals link growth to jobs
Author
New Delhi, First Published Jun 15, 2019, 1:35 PM IST

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్రీకరించారు. ముందస్తు బడ్జెట్‌ చర్చల్లో భాగంగా తాజాగా ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. 2019-20 సాధారణ బడ్జెట్‌లో ఏ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలనే దానిపై ఆమె వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే నెల 5న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

ఉద్యోగాలతో కూడిన వృద్ధిపై సమాలోచనలు 
తాజాగా శుక్రవారం ఆర్థికవేత్తలతో జరిగిన సమావేశంలో ఉద్యోగాలతో కూడిన వృద్ధి సాధించడం ఎలా? స్థూల ఆర్థిక స్థిరత్వం దిశగా ఎలాంటి అడుగులు వేయాలి? ఆర్థిక నిర్వహణలో భాగంగా ప్రభుత్వ రంగ రుణాలు ఏ మేరకు ఉండాలి? పెట్టుబడులు ఎలా పెంచాలి? తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. 

జీఎస్టీని సరళతరం చేయాలని అభ్యర్థన
వస్తు, సేవల పన్నును (జీఎస్టీ) మరింత సరళీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక వేత్తలు ప్రధానంగా సూచించారు. ఇక  ప్రత్యక్ష పన్ను కోడ్‌ అమలులోకి తేవాలని తెలిపారు. అలాగే ఉద్యోగాల కల్పనతో కూడిన వృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని,  టెక్స్‌టైల్స్‌పై నిర్దిష్ట సుంకాల్ని ఎత్తివేయాలని ప్రతిపాదించారు. దేశీయ వృద్ధి కోసం అంతర్రాష్ట్ర సమాఖ్యలను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

యువతలో నైపుణ్యం పెంపొందించాలి
ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు యువతరంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని, దీర్ఘకాలిక వృద్ధి కోసం నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలని అభిలషించారు. ఇక  స్వతంత్ర ఆర్థిక విధాన కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

ఐటీ యూనిట్లకు పన్ను రాయితీలు కొనసాగించాలి: నాస్కామ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌)లోని ఐటీ యూనిట్లకు పన్ను ప్రోత్సాహకాలను 2020 మార్చి తర్వాత కూడా కొనసాగించాలని ఆర్థిక శాఖను నాస్కామ్‌ కోరింది. తద్వారా ఐటీ పరిశ్రమ దీర్ఘకాలిక వ్యూహంతో నిశ్చయంగా పెట్టుబడులు పెట్టగలుగుతుందని ఈ అసోసియేషన్‌ అంటోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఐటీ-బీపీఎం రంగ వాటా 6.6 శాతంగా ఉందని, ఈ పరిశ్రమ 41 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోందని, కేంద్రానికి ఏటా 13,000 కోట్ల డాలర్ల విదేశీ మారక ఆదాయం సమకూరుస్తోందని నాస్కామ్ తెలిపింది. 

సెజ్ అనుకూల పాలసీ రాయితీలు అలాగే..
కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను అనుకూల సెజ్‌ పాలసీలో కల్పించిన రాయితీల కొనసాగింపుతోపాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)ను 9 శాతంగా ఉంచాలని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ (డీడీటీ) నుంచి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు నాస్కామ్‌ సీనియర్‌ డైరెక్టర్‌, పబ్లిక్‌ పాలసీ హెడ్‌ ఆశిష్‌ అగర్వాల్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios