Asianet News TeluguAsianet News Telugu

ముక్కు పిండి మరీ: సంప్రదాయ వాహనాలపై భారీ పన్ను.. విద్యుత్ వాహనాలకు రాయితీలు

పెట్రోల్, డీజిల్‌తో కార్లపై సంప్రదాయ పన్ను భారం పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది. తద్వారా పర్యావరణానికి మేలు చేసే విద్యుత్ వినియోగ వాహనాలను కొనుగోలు చేసే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. 

Petrol, diesel cars may be taxed more to push electric vehicle sales

న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల కొనుగోలుదారులను ఇన్‌సెంటివ్‌లు, సబ్సిడీల ద్వారా ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ద్రుష్టి సారించింది. అందులో భాగంగా సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లపై అత్యధిక పన్ను విధించాలని యోచిస్తున్నది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఇచ్చే రాయితీల భారాన్ని తగ్గించుకోవాలని తలపోస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)’ స్కీమ్ అమలు చేస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం కారణాలేం చెప్పినా వాస్తవం మాత్రం విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి ఇది ఉత్ప్రేరకంగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ కమిటీకి ‘ఫేమ్’ స్కీమ్ మలి దశ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై మెమొరాండం రూపంలో అందజేశామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 

ప్రభుత్వ ఆలోచనల ప్రభావం డీజిల్, పెట్రోల్ కార్ల కొనుగోళ్లపై తప్పక పడుతుందని ఆర్థిక, పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోలుపై భారీగా పన్ను విధించడంతో ధరల పట్ల సున్నితంగా ఉండే భారతదేశంలో కొనుగోలుదారులు ఆ కార్లను కొనుగోలు చేయకుండా నిరుత్సాహ పరుస్తుందని అంటున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గానీ, ఆటోమొబైల్ సంస్థల సంఘం ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కూడా నోరు మెదపడం లేదు.  

కానీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల గ్రూప్ మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ చర్యను స్వాగతించింది. ఆఫర్లు ఇవ్వడంతో ప్రభుత్వం నిధుల కొరతను ఎదుర్కొంటున్నదని పేర్కొంది. సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ సొహిందర్ గిల్ మాట్లాడుతూ ఇంటర్నల్ కంబూష్టన్ ఇంజిన్ (ఐసీఈ)తో కూడిన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సమానమైనప్పుడు వినియోగదారులు విద్యుత్ ఆధారిత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. సంప్రదాయ వాహనాల కొనుగోళ్లపైన 100 బేసిక్ పాయింట్లతో కూడిన పన్నులు పెంచడం వల్ల కొనుగోలుదారులపై భారీస్థాయిలో భారం పడుతుందని చెబుతున్నారు. వీటిపై వసూలు చేసే పన్నుతో 10 లక్షల విద్యుత్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. 

2022 - 23 వరకు ‘ఫేమ్’ స్కీమ్‌ను అమలు చేయాల్సి రావడంతో భారీ పరిశ్రమల శాఖ బడ్జెటరీ మద్దతు కోసం కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఈ డిమాండ్ తీసుకొచ్చింది. రూ.9,381 కోట్ల మద్దతు కావాలని కోరింది. ఫేమ్ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. క్యాబినెట్ ద్వారా గానీ, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ద్వారా గానీ ఈ నిధుల విడుదలకు ఆమోదం పొందింది. 

ఎక్స్ పరేల్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు అవిక్ చటోపాధ్యాయ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ చర్య తిరోగమన చర్య అని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందేనని పేర్కొన్నారు. సంప్రదాయ వాహనాల కొనుగోలుదారులపై ప్రభుత్వం తమ భారాన్ని మోపడం సరి కాదని అవిక్ చటోపాధ్యాయ స్పష్టం చేశారు. 

ఇప్పటికే ‘ఫేమ్’ స్కీమ్ రెండో దశ అమలు ప్రక్రియ మూడుసార్లు వాయిదా పడింది. నూతన స్కీమ్ వచ్చే సెప్టెంబర్ నెలకు ముందు బయటకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ‘ఫేమ్’ స్కీమ్‌ను దేశీయ మార్కెట్‌లో విద్యుత్ వాహనాల తయారీ, అభివ్రుద్ధి, విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో అమలులోకి తెచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios