ప్రముఖ రవాణా సేవల సంస్థ ఉబర్‌కు ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తున్న ప్రభజిత్ సింగ్  వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రయాణీకుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గాను ఆయన క్యాబ్ డ్రైవర్ అవతారమెత్తారు. 

ఒకప్పుడు మనం వూళ్లో ఏదైనా పని మీద బయటకు వెళ్లాలి అనుకోండి.. రిక్షానో, ఆటోనో, బస్సులోనో వెళ్లేవాళ్లం. అయితే మారుతున్న కాలంలో ఉబెర్, ఓలా వంటి సంస్థల రంగ ప్రవేశంతో ప్రజా రవాణాలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ సాయంతో మనం వున్న చోటికే కారు లేదా ఆటోను రప్పించి సౌకర్యవంతంగా వెళ్లొచ్చు. మెట్రోపాలిటన్ సిటీలతో పాటు దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఈ ప్రైవేట్ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. 

అయితే మీరు ఉబర్‌ను బుక్ చేసుకుని కారు కోసం నిరీక్షిస్తుండగా.. డ్రైవర్ వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుంటాడు. ఎప్పుడూ జరిగేది ఇదే. కానీ ఆ డ్రైవర్ సీట్లో వున్న వ్యక్తి ఉబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ అని పరిచయం చేసుకుంటే.. ఇలాంటివి కలలోనే జరుగుతుంది చాలా మంది భావిస్తారు. కానీ ఈ సంఘటన నిజంగా జరిగితే. అనన్న ద్వివేది (Ananya Dwivedi) అనే మహిళకు ఈ పరిస్థితే ఎదురైంది. 

దీనికి సంబంధించి ఆమె తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘‘ఇంటర్నెట్‌లో నేను చదివిన మంచి సలహాలలో సాహిల్ బ్లూమ్ చెప్పింది ఒకటి. దీని ప్రకారం.. మీ అదృష్టాన్ని పెంచుకోండి.. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే లక్ వచ్చి మిమ్మల్ని కలవదు. బయటకు అడుగుపెట్టండి, వ్యక్తులను కలవండి, మిమ్మల్ని గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయండి’’ ఈ మాట నా విషయంలోనే నిజమైందన్నారు అనన్య. తాను ప్రయాణించాల్సిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ సీట్‌లో ప్రభజీత్ సింగ్‌ను చూసి ఆశ్చర్యపోతూ ఆమె ఈ మేరకు తన సంతోషాన్ని పోస్ట్ చేశారు.

చాలారోజుల తర్వాత తాను ఆఫీస్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నానని .. తీరా కారు వచ్చిన తర్వాత అందులో చూస్తే ఉబర్ సీఈవో ప్రభజిత్ సింగ్ వున్నారని ఆమె చెప్పారు. ప్రయాణీకులకు అందుతున్న సేవల గురించి ఆరా తీయడానికి ఆయన ఇలా చేస్తూ వుంటారు. కారులో వుంది ఆయనే అని తనకు తెలుసునని అయితే ఎందుకైనా మంచిదని గూగుల్‌ సెర్చ్ చేసి నిర్ధారించుకున్నానని అనన్య తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రయాణీకుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రభజిత్ ప్రయత్నంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. 

అయితే కేవలం అనన్య మాత్రమే కాదు.. చాలా మంది ఉబర్ సీఈవోతో తమ ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. మరో ఇద్దరు లింక్డ్ ఇన్ వినియోగదారులు ప్రభజీత్ సింగ్‌ను కలుసుకున్నట్లు తమ అనుభవాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పోస్ట్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.