Asianet News TeluguAsianet News Telugu

దివాళాతో వావ్ ఎయిర్ లైన్స్ మూత.. ఆందోళనలో ప్రయాణికులు

వావ్ ఎయిర్ లైన్స్ సంస్థ యాజమాన్యం దివాళా ప్రకటించడం ఆ వెంటనే దాన్ని మూసేస్తున్నట్లు గురువారం చేసిన ప్రకటన పర్యాటకులకు ఇక్కట్లు తెచ్చి పెట్టింది. ల

Panic at airports as budget airline Wow Air suddenly ceases operations
Author
Boston, First Published Mar 29, 2019, 11:58 AM IST

బడ్జెట్ ఎయిర్ లైన్స్ ‘వావ్’ సడన్‌గా మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఉత్తర అమెరికా అంతటా వేల మంది ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. వివిధ విమాన యాన సంస్థల వెబ్ సైట్లు, ట్రావెలర్ ఏజంట్ల వెబ్ సైట్లు బిజీబిజీగా ఉన్నాయి.

ఉత్తర అమెరికాలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు హాలీడేస్ గడిపేందుకు వెళ్లిన పర్యాటకులంతా వావ్ ఎయిర్ లైన్స్ ప్రకటనతో షాకయ్యారు. తమ పర్యటనలను రద్దు చేసుకుని తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లేందుకు ఇతర విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో బిజీబిజీగా ఉన్నారు.

వావ్ ఎయిర్ లైన్స్‌కు సపోర్ట్‌గా నడుస్తున్న విమానం నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోందని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కెనడాలోని టోరంటో, వాషింగ్టన్, న్యూయార్క్, పారిస్, లండన్ నగరంతోపాటు యూరప్ యూనియన్ దేశాల్లోని పలు నగరాల పరిధిలోని పలు విమానాశ్రయాల్లో జనం రద్దీతో ఇబ్బందిగా మారాయి.

దీంతో హోటళ్లలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సరిదిద్దాల్సిన దుస్థితి నెలకొంది. ఐస్‌లాండ్ చౌక ధరల విమానయాన సంస్థ వావ్ ఎయిర్‌లైన్స్ మూతబడింది.

ఐస్‌లాండ్‌కు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా దేశాలకు మధ్య విమానాలను నడుపుతున్న ఈ సంస్థ.. గురువారం తమ కార్యకలాపాలను, అన్ని విమాన సేవల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అందుబాటులో ఉన్న ఇతర ఎయిర్‌లైన్స్ సేవలను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో సంస్థ ప్రయాణీకులందరికీ సూచించింది. ఈ అనూహ్య పరిణామంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో పడ్డారు.

వీరంతా ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులుగాస్తున్నారిప్పుడు. ప్యారిస్, న్యూ యార్క్, మాంట్రిల్‌కు వెళ్లే 30 వావ్ విమానాలు రద్దయ్యాయి. మరోవైపు బాధితులు దాదాపు 4 వేల మంది ఉంటారని ఐస్‌లాండ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

వావ్ విమానాల రద్దు సమాచారాన్ని అందుకున్న పర్యాటకులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టులకు చేరుకుంటున్నారని, ఇతర విమాన సర్వీసుల కోసం పోటీ పడుతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రయాణీకులకు ఐస్‌లాండ్‌ఎయిర్, ఈజీజెట్, నార్వేయిన్, విజ్ ఎయిర్ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. 2011 నవంబర్‌లో స్థాపించబడిన వావ్ ఎయిర్‌లైన్స్ సేవలు 2012 మే 31న మొదలయ్యాయి.

ఉత్తర అట్లాంటిక్‌లోని ఐస్‌లాండ్ దేశానికి వచ్చే పర్యాటకుల్లో మూడో వంతుకుపైగా పర్యాటకులు వావ్ విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు.  అయితే గతేడాది వావ్ ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. అధిక ఇంధన ధరలు, పెరిగిన పోటీతో కష్టాలు వచ్చిపడ్డాయి. 

గతేడాది జనవరి-సెప్టెంబర్‌లో దాదాపు 42 మిలియన్ డాలర్ల నష్టాలకు లోనైంది. ఈ క్రమంలోనే వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన సంస్థ.. విమానాల సంఖ్యను 20 నుంచి 11కు తగ్గించింది. పలు దేశాలకు సేవలనూ నిలిపివేసింది. వందకుపైగా ఉద్యోగులనూ తొలగించింది.

పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న వావ్ ఎయిర్‌లైన్స్.. ప్రత్యర్థి విమానయాన సంస్థ ఐస్‌లాండ్‌ఎయిర్‌తో జరిపిన కొనుగోలు చర్చలు విఫలం కావడం తాజా దుస్థితికి దారితీసింది. నిరుడు నవంబర్ 5న వావ్ ఎయిర్‌లైన్స్‌ను హస్తగతం చేసుకుంటున్నట్లు ఐస్‌లాండ్‌ఎయిర్ గ్రూప్ ప్రకటించింది. 

వాటాదారుల షరతులు నచ్చక నవంబర్ 29న కొనుగోలు ఆలోచనను ఐస్‌లాండ్‌ఎయిర్ ఉపసంహరించుకున్నది. ఆ తర్వాత ఇండిగో పార్ట్‌నర్స్ ముందుకువచ్చినట్లే వచ్చి.. ఈ నెలలో ఆ సంస్థ కూడా వెనుకడుగేసింది.

తాజాగా మరోమారు ఐస్‌లాండ్‌ఎయిర్‌తో జరిగిన చర్చలూ విఫలం కావడంతో సంస్థ మూతబడింది. సంస్థ రుణదాతలతో రుణ పునర్‌వ్యవస్థీకరణకు ప్రయత్నించామని, అయినా ఫలితం లేకపోయిందని ఇటీవలే వావ్ ఎయిర్ ప్రకటించినది తెలిసిందే.

వావ్ ఎయిర్‌లైన్స్ దివాలా ప్రకటన అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది. దేశ జీడీపీని ఇది ప్రభావితం చేయవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. స్థానిక కరెన్సీ క్రోనా విలువ పతనం, ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చన్న భయాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి.

పర్యాటక రంగ ఆదాయాన్ని దెబ్బతీసే వీలుందని  అంచనాలు వినిపిస్తున్నాయి. నిరుడు వావ్ ఎయిర్‌లైన్స్ 35 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసింది. వావ్ ఎయిర్ లైన్స్ మూతబడటంతో వెయ్యి మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios