ఎయిరిండియా ముంగిట కొత్త గండం వచ్చి నిలిచింది. ఇప్పటికే అప్పుల పాలైన ఈ సంస్థ.. ప్రభుత్వ రంగ సంస్థ. దీంతో అడపాదడపా ప్రభుత్వమే డబ్బులు సర్దుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వాయిదాలకు కూడా ఆ సంస్థ వద్ద డబ్బులు లేకపోవడంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఎయిరిండియా రూ.9,000 కోట్ల రుణంతో ప్రారంభించింది. అయితే వాటిని తీర్చడానికి ఎటువంటి డబ్బులూ దాని దగ్గర లేవని తెలుస్తోంది. ప్రభుత్వం మరోసారి బెయిలౌట్ ప్రకటించి అమలు చేస్తే తప్ప అది సంక్షోభం బారిన పడకుండా ఉండదు. 

ఈ నెల 23 తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు ఎయిరిండియా పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికే ఆర్థిక శాఖ వద్దకు వెళ్లి ఎయిరిండియా, పౌరవిమానయాన శాఖ పరిస్థితి వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొన్ని రుణాలకు వాయిదాలను చెల్లించడానికి కూడా సంస్థ వద్ద డబ్బులు లేవని తెలుస్తోంది. ఎయిరిండియా ఎగవేత వేయకుండా ఉండాలంటే ఆ డబ్బుల కోసం కార్యకలాపాలను నిలపడం తప్ప మరో అవకాశం కనిపించడం లేదని ఆ వర్గాలు అంటున్నాయి. 

ఎయిరిండియాకు గల 127 విమానాల్లో 20 విమానాల ఇంజిన్లలో సమస్యల వల్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. వీటి ఇంజిన్లను మార్చడానికి సంస్థ వద్ద నిధులు లేవని ఒక సీనియర్‌ అధికారి చెబుతున్నారు. ఇందుకు కనీసం రూ.1500 కోట్ల వరకు కావాలని.. నిధులు వచ్చే సూచనలు లేనందున ఇప్పుడప్పుడే ఇవి ఎగరవని ఆయన అంచనా వేస్తున్నారు.

గత ఏడాది చివరి నుంచీ వీటికి కొత్త ఇంజిన్లను బిగించాలని ఎయిరిండియా విఫల యత్నాలు చేస్తూనే ఉంది. నిలిచిన విమానాల్లో 14 విమానాలు ఎ320, నాలుగు విమానాలు బి787-800, మిగతా రెండు బి777 విమానాలు ఉన్నాయి. తత్ఫలితంగా రోజుకు రూ.6 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ తరహాలోనే ఈ కంపెనీ కూడా తన అంతర్జాతీయ విమానాల నిర్వహణ విషయంలో భారీ నష్టాలను పొందుతోంది. పాకిస్థాన్‌ తన ఆకాశమార్గాన్ని మూసివేయడంతో ఐరోపా, అమెరికాలకు వెళ్లే ఎయిరిండియా విమానాలకు రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. దీంతో కొన్ని విదేశీ విమానాలను రద్దు కూడా చేసింది. 

దీనికి తోడు ప్రభుత్వం కూడా కొత్తగా ఎటువంటి బెయిలౌట్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పినట్లు విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు అంటున్నారు. అయితే ఇది ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థే కాబట్టి ప్రభుత్వమే సహాయం చేయాల్సి ఉందని ఆ అధికారి అభిప్రాయపడుతున్నారు. 

కొత్త ప్రభుత్వం ఏ పార్టీని ఏర్పాటు చేస్తుందన్నదానిపై ఆధారపడి ఎయిరిండియా భవితవ్యం ఉండొచ్చని ఒక అధికారి అంటున్నారు. ప్రస్తుతమున్న అధికార పార్టీనే తిరిగి పీఠమెక్కితే మాత్రం ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. 

అటువంటప్పుడు ఎయిరిండియా చెల్లించాల్సిన రుణాలపై ఎటువంటి దృష్టీ అవసరం ఉండదు. ఒక వేళ కాంగ్రెస్‌ పార్టీ వస్తే వారి అభిమతం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. 

విచిత్రం ఏమిటంటే జెట్‌ఎయిర్‌వేస్‌కున్న అప్పులతో పోలిస్తే ఎయిరిండియా రుణాలే చాలా ఎక్కువ. కాకపోతే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి విమానాలు ఇంకా ఆకాశంలో తిరగగలుగుతున్నాయి. తన ఖాతాల్లో రూ.54 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. 

గతేడాది 76 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించాలని ప్రయత్నించినా.. అది సఫలం కాలేదు. రూ.29,000 కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాన్ని ఒక ప్రత్యేకావసరాల సంస్థ అయిన ఎయిరిండియా అసెట్‌ హోల్డింగ్‌(ఏఐఏహెచ్‌ఎల్‌)గా మార్చింది. 

దీంతో ప్రతీ ఏటా ఎయిరిండియా కంపెనీ చెల్లించే రూ.4,400 కోట్ల వడ్డీలో ప్రభుత్వం రూ.2,700 కోట్లు చెల్లించే బాధ్యత నెత్తికెత్తుకుంది. ఆ తర్వాత అయినా ఆ కంపెనీ పుంజుకుంటుందనుకుంటే అలా జరగలేదు. 

ఆర్థిక పనితీరు ఎంత మాత్రం మారలేదు. పైగా రుణాలపై వడ్డీల భారాన్ని ప్రభుత్వం మోయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని అందుకోలేకపోయింది.  యూపీఏ హయాంలో ఎయిరిండియా, ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేయాలన్న నిర్ణయం(ఫిబ్రవరి 2007) వల్లే ఎయిరిండియా ప్రస్తుత స్థితికి కారణమన్న వారు లేకపోలేదు.

విలీన ఆలోచన మంచిదే అయినా.. రూట్ల విషయంలో అప్పటి ప్రభుత్వ ప్రదర్శించిన ఉదారత చేటు తెచ్చిందంటారు. గల్ఫ్‌ దేశాలకు చెందిన ఎమిరేట్స్‌, ఖతర్‌ ఎయిర్‌వేస్‌లకు కొన్ని మార్గాలకు చెందిన హక్కులను ఇవ్వడంతో అప్పటి దాకా ఆ మార్గాల్లో లాభాలు కొల్లగొట్టిన ఎయిరిండియాకు ఇబ్బందులు వచ్చాయి. 

భారతీయ ఎయిర్ లైన్స్, ఎయిరిండియా విలీనంపైనా.. ఆ తర్వాత జరిగిన రూట్ల హేతుబద్ధీకరణపైనా గట్టి విమర్శలే వచ్చాయి. దీనికి తోడు 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మరింత ఇబ్బందులకు గురిచేసింది.ఇక ప్రభుత్వాధికారులు తమ కుటుంబాలతో సహా చేసే ఉచిత ప్రయాణాలు కూడా దెబ్బతీశాయి. దీంతో ఎయిరిండియా రుణాల కుప్పలు పెరిగాయి. 

గల్ఫ్‌ విమానయాన సంస్థలకు ఆకాశ మార్గాల హక్కులకు విక్రయించడం కోసమే ఎయిరిండియా-ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విలీనం జరిగిందని విమర్శలకు ఎప్పటి నుంచో అంటున్నారు. 

ఎయిరిండియా-ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లు విలీనం అయిన తర్వాత ఏనాడూ నికర లాభాలను పొందనే లేదు. గత పదేళ్లలో నష్టాలు పెరుగూనే వచ్చాయి. 2017-18లో నష్టం రూ.5348.7 కోట్లకు చేరింది. అంటే రోజువారీ నష్టం రూ.15 కోట్లు అన్నమాట. 

ఎయిరిండియా అనుబంధ సంస్థలదీ నష్టాల బాటే. అందుకే గతేడాది ప్రభుత్వం అందులో వాటాను విక్రయించాలని గట్టిగా ప్రయత్నించినా.. ఈ తెల్ల ఏనుగును కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కనుక కొత్తగా కొలువు దీరనున్న ప్రభుత్వం.. ఎయిరిండియాను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో సుమా!!