వాషింగ్టన్‌/ న్యూఢిల్లీ: ఇరాన్‌ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌తో సహా కొన్ని దేశాలకు ఇస్తున్న మినహాయింపును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భగ్గుమంది. సోమవారం ఒక్క రోజే బ్రెంట్‌ రకం పీపా ముడి చమురు ధర 3.3 శాతం పెరిగి 74.15 డాలర్ల ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. 

వచ్చేనెల రెండో తేదీ నుంచి అమెరికా విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఈ దేశాలు.. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలి. లేకపోతే ఈ దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత కంపెనీలు ఏప్రిల్‌ నుంచే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు తగ్గించినట్టు సమాచారం.
 
తాజా ఆంక్షలతో భారత చమురు దిగుమతులకు ఎలాంటి ఢోకా లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు. మెక్సికో, సౌదీ అరేబియా, కువైట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి అదనపు చమురు దిగుమతి చేసుకుంటామన్నారు. 

ఇందుకోసం ఇప్పటికే ఆ దేశాలతో ఒప్పందాలు చేసుకున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. కాకపోతే తాజా పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పీపా చమురు ధర 70 డాలర్లపైన కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థకూ ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇరాన్‌ నుంచి చమురు ఎగుమతులు నిలిచి పోయినా.. అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆ లోటును భర్తీ చేస్తాయని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ శారా సాండర్స్‌ ప్రకటించారు. అణు కార్యక్రమంపై ఇరాన్‌పై గరిష్ఠ స్థాయిలో ఆర్థిక ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫాలిహ్‌ కూడా చమురు సరఫరా మార్కెట్లో స్థిరత్వం సాధించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ఉత్పత్తిని పెంచి ఇరాన్‌ నుంచి ఆగిపోయే చమురు సరఫరా లోటు పూడుస్తామని చెప్పారు.
 
అమెరికా తాజా నిర్ణయంపై ఇరాన్‌ మండిపడింది. ఈ విషయంలో తెగేదాకా లాగితే కీలకమైన హార్మోజ్‌ జల సంధిని మూసేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇదే జరిగితే పశ్చిమాసియా దేశాల నుంచి జరిగే చమురు ఎగుమతుల్లో సగానికి ఆటంకం ఏర్పడి ముడి చమురు ధర మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇదిలా ఉంటే చైనా మాత్రం అమెరికా ఆదేశాలను తోసి రాజనే అవకాశాలు కనిపిస్తున్నాయి.