పెద్ద నోట్ల రద్దుపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ఇంతవరకూ మౌనంగా ఉన్న ఆయన‌ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. ‘పాత పెద్ద నోట్ల రద్దు ఓ భారీ తప్పిదం. క్రూరమైన చర్యే. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. వృద్ధిరేటును మింగేసింది’ అని పేర్కొన్నారు. నిన్నమొన్నటిదాకా నరేంద్ర మోదీ సర్కారుకు తలలో నాలుకలా ఉన్న ఈయన ఇప్పుడు కేంద్రానికి పెద్ద షాకే ఇచ్చారు మరి. త్వరలో ప్రచురణకు రానున్న తన ‘ఆఫ్ కౌన్సెల్: ది చాలెంజెస్ ఆఫ్ ది మోదీ-జైట్లీ ఎకానమీ’ బుక్‌లో పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వైఫల్యాలను ఎండగట్టారు.

‘నోట్ల రద్దుకు ముందు ఆరు త్రైమాసికాల్లో సగటు జీడీపీ వృద్ధి 8శాతంగా నమోదైంది. కానీ నోట్ల రద్దు తర్వాత ఏడు త్రైమాసికాల్లో సగటు జీడీపీ 6.8శాతానికి తగ్గింది’ అని అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత వడ్డీరేట్లు, జీఎస్టీ, చమురు ధరల జీఎస్‌టీ వృద్ధిని ప్రభావితం చేశాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాజకీయ పరిభాషలో నోట్ల రద్దు అనూహ్య పరిణామం అని, ఇటీవలి కాలంలో సాధారణ పరిస్థితుల్లో ఏ దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇక నోట్ల రద్దు అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ ‘నోట్ల రద్దు గందరగోళానికి ఒక సమాధానం మాత్రం ఉంది. పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో పేదలకు ఇబ్బదులు సర్వసాధారణం. సంపన్నుల, అక్రమార్కులను కష్టపెట్టే క్రమంలో పేదలు తమ ఇబ్బందులను పట్టించుకోరు. నాది ఒక మేక పోయింది.. వాళ్లవి ఆవులు పోయాయి అని భావిస్తారు’’ అని పేర్కొన్నారు.

రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ 2016, నవంబర్ 8న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రద్దు నిర్ణయంపై అప్పటి ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ను సంప్రదించలేదని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. కానీ ఈ విమర్శలపై అరవింద్‌ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఆయన నోట్లరద్దుపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నాలుగేళ్ల పాటు ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్‌ గతేడాది పదవి నుంచి తప్పుకున్నారు. రద్దయిన పాత పెద్ద నోట్ల స్థానంలో కొత్త రూ.500, 2,000 నోట్లను పరిచయం చేయగా, రైద్దెన నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసి.. వాటికి సమానమైన విలువ కలిగిన కొత్త నోట్లను ఇతర చిన్న నోట్ల (రూ.100, 50, 20, 10..)ను తీసుకోవాలని సూచించిన సంగతి విదితమే. 

ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ ప్రకంపనల్నే సృష్టించగా, ప్రజలకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. నోట్ల మార్పిడి పెద్ద ప్రహససంగా మారిపోయింది. చిల్లర సమస్య కారణంగా మార్కెట్ కుదేలైపోయింది. ముఖ్యంగా బ్యాంకుల రోజువారి కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైద్దెన నోట్లను తీసుకుని కొత్త నోట్లను ఇవ్వడానికే ఉద్యోగులు పరిమితం కావాల్సి రాగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు రుణ లభ్యత కరువైంది. దీంతో ఇలా అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. గడిచిన రెండేళ్లు జీడీపీపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని సుబ్రమణియన్ అన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో ధనవంతుల కంటే సామాన్యులే ఎక్కు వ బాధపడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరికొన్నాళ్లూ దేశ ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు వెంటాడవచ్చని వ్యాఖ్యానించారు.

పాత పెద్ద నోట్ల రద్దుతో కుంగిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), చమురు ధరలు, అధిక వడ్డీరేట్లు వంటి వరుస గాయాలు తగిలాయని సుబ్రమణియన్ పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాలు దిగాలు పడ్డాయన్నారు. ఉత్పాదక రంగం నీరసించడం వల్ల పారిశ్రామికోత్పత్తి కూడా పడిపోయిందని, ద్రవ్యోల్బణానికీ రెక్కలు వచ్చాయన్నారు. ఇక వినియోగదారులు బలవంతంగా నగదు లావాదేవీల నుంచి డిజిటల్ లావాదేవీలకు మారాల్సి వచ్చిందన్న ఆయన ఈ రకమైన పరిస్థితి ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నారు. ఆందోళనలకు, అధిక ద్రవ్యోల్బణానికి, నగదు కొరతకు దారితీసి చివరకు రాజకీయ సంక్షోభం ఏర్పడవచ్చన్నారు.

ఆర్బీఐ చేతకానితనం వల్లే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం పుట్టుకొచ్చిందని సుబ్రమణియన్ తీవ్రంగా స్పందించారు. తమ నియంత్రణలో ఉన్న ఓ భారీ సంస్థ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటే, ఆ బాధ్యత ఆర్బీఐది కాదా? అని ప్రశ్నించారు. రుణాల చెల్లింపుల సమస్యలను ఆర్బీఐ తేలిగ్గా తీసుకున్నదన్నారు. నీరవ్ మోదీ తదితర మోసగాళ్ల బారి నుంచి బ్యాంకింగ్ రంగాన్నీ కాపాడలేకపోయిందని విమర్శించారు. ఏళ్ల తరబడి మోసాలు సాగుతున్నా గుర్తుపట్టలేకపోయిందన్నారు. ఇక ప్రభుత్వ బ్యాంకులను ఆర్థికంగా పరిపుష్ఠి చేయాల్సిన బాధ్యత ఆర్బీఐదేనన్న ఆయన అందుకు ఆర్బీఐ వద్దనున్న మిగులు నిల్వలను వినియోగించుకోవచ్చన్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, యెస్ బ్యాంక్‌లపై ఆర్బీఐ నిర్ణయాలు మెచ్చుకోదగినవిగా ఉన్నాయన్నారు. ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, సుప్రీం కోర్టు తరహాలో ఆర్బీఐ కీలక వ్యవస్థన్న సుబ్రమణియన్.. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభావవంతమైన వ్యవస్థను తీసుకురాలేకపోతున్నదన్నారు.