Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 1న విలీన బ్యాంక్ ఆవిర్భావం: చైర్‌పర్సన్‌గా అంజలీ బన్సాల్?

ప్రభుత్వం అనుకున్న మేరకు మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డెనా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ అంజలీ బన్సాల్.. విలీన బ్యాంక్ చైర్ పర్సన్‍గా నియమితులు కానున్నారు. కానీ మూడు బ్యాంకుల మొండి బకాయిల వసూళ్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

New entity post banks' merger to be operational from April 1
Author
Mumbai, First Published Sep 19, 2018, 8:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రభుత్వ రంగంలోని దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విలీనానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో కొత్తగా ఏర్పడే బ్యాంక్‌కు సారథి ఎవరనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం దేనా బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అంజలి బన్సాల్‌.. విలీనం తర్వాత ఏర్పాటయ్యే కొత్త బ్యాంక్‌ సారథిగా నియమితులవుతాయని మార్కెట్ వర్గాల కథనం. ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ రంగంలో అంజలి బన్సాల్‌కు ఉన్న అపార అనుభవమే ఇందుకు కారణమని భావిస్తున్నాయి.

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), దేనా బ్యాంక్‌, విజయ బ్యాంకుల విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే 10 రోజుల్లో ఈ మూడు బ్యాంకుల బోర్డులు సమావేశమై విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే వీలుంది.

ఈ సమావేశంలోనే షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రధాన ప్రమోటర్‌గా ప్రభుత్వం సమకూర్చాల్సిన అదనపు మూలధనంపైనా నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా వాటాదారుల ఆమోదంతో పాటు నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తి చేసుకుని 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్త పేరుతో పూర్తి స్థాయిలో కొత్త బ్యాంకు బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించవచ్చు.
 
విలీన ప్రతిపాదనపై స్టాక్‌ మార్కెట్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది మంగళవారం బిఎస్ఈలో దేనా బ్యాంక్‌ షేరు 19.75 శాతం లాభంతో రూ.19.10 దగ్గర క్లోజైంది. బీఓబీ, విజయ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి. బీఓబీ షేర్ 16.03 శాతంతో రూ.113.45 దగ్గర, విజయా బ్యాంక్‌ షేర్ 5.69 శాతం నష్టంతో రూ.56.40 దగ్గర ముగిసింది. దీంతో ఈ రెండు బ్యాంకుల షేర్ల మార్కెట్‌ విలువ మంగళవారం ఒక్క రోజే రూ.6,169.23 కోట్లు హరించుకు పోయింది.
 
విలీన ప్రకియ అనుకున్నట్టు పూర్తయినా కొన్ని సమస్యలు తప్పవని మార్కెట్‌ వర్గాల అంచనా. ముఖ్యంగా కొన్ని విషయాల్లో సమస్యలు ఏర్పడవచ్చని భావిస్తున్నారు. మూడు బ్యాంకులకు కలిపి ఉన్న రూ.80,000 కోట్ల మొండి బాకీల వసూళ్లు సమస్యాత్మకంగా మారుతుందన్న విమర్శ ఉంది.

దేనా బ్యాంక్ అంతంత మాత్రంగానే ఉంది. తీసివేతల భయంతో విలీనాన్ని ఆయా బ్యాంకుల ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మూడు బ్యాంకులకు కొన్ని ప్రాంతాల్లోనే పట్టు ఉండడం సమస్యగా పరిణమిస్తోంది. సిబ్బంది పనితీరుకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. 

కొత్త బ్యాంకుకు వినియోగదారుల సంఖ్య పెరుగడంతో పాటు, మార్కెట్ విస్తరణ, నిర్వహణ సామర్థ్యం, విస్తృతస్థాయిలో సేవలు, ఉత్పత్తులను వినియోగదారులకు అందించవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది. ఈ 3 బ్యాంకులకు ఉన్న నెట్‌వర్క్ ద్వారా వ్యయం తగ్గించుకోవచ్చునని ప్రభుత్వం ఆశిస్తున్నది. కానీ ఈ విలీనానికి అసలు కారణాలు, మూలాలు మరోచోట ఉన్నాయి. 

21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రానికి మెజారిటీ వాటా ఉంది. మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో ఈ వాటా విలువ రెండింట మూడోంతులుంటుంది. అలాగే 90 శాతం మొండి బకాయిలు దాదాపుగా రూ.8.9 లక్షల కోట్ల మొండి బకాయిలు ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయి.

ఈ 21 బ్యాంకుల్లో 11 బ్యాంకుల పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలో నేరుగా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. ఆ బ్యాంకులకు తాజా రుణాలిచ్చే యోగ్యత లేదు. విలీనం తర్వాత కూడా ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగానే పనిచేస్తాయని ప్రభుత్వం చెబుతున్నది. 

మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ఈ విలీనం పనిచేయదని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంటున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం, ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాల వంటి సమస్యలతో ఇప్పటికే కొత్త డిపాజిట్లలో 70 శాతం, రుణాల్లో 80 శాతం ప్రైవేట్ రంగ బ్యాంకులకు తరలి వెళ్తున్నాయి.

పటిష్టంగా ఉన్న బ్యాంకుల్లో బలహీన బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రభుత్వ యోచన ఏ మాత్రం సరైనది కాదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి దాదాపు 18 నెలల కాలం పట్టింది. ఈ మూడు బ్యాంకుల విలీనానికి ఎంత సమయం పడుతుందో అధికారికంగా వెల్లడించలేదు. 

గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అనేక సందర్భాల్లో వ్యతిరేకించారు. పటిష్ట బ్యాంకుల విలీనంతో ఉండే ప్రయోజనాలు.. బలహీన బ్యాంకులను బలమైన బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల ఉండదని వాదించారు. అయినా రాజన్ ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మూడు బ్యాంకుల విలీనం సంగతీ ఆయా బ్యాంకుల అధిపతులకు చివరి నిమిషం దాకా కూడా తెలియదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం కేవలం బ్యాంకులను విలీనం చేయడం ద్వారా మరో తప్పు చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ విమర్శించింది.

ప్రభుత్వ రంగంలోని దేనా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ప్రజలకు ఈ బ్యాంకులను దూరం చేయటమేనని వ్యాఖ్యానించారు. లాభాల్లో ఉన్న బ్యాంకుల విలీనంతో కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చటమేనని రవీంద్రనాథ్‌ ఆరోపించారు.
 
గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో పట్టాను అందుకున్న అంజలీ బన్సాల్‌.. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)తో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇస్రోలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌, బిజినెస్‌లో కొలంబియా యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన అనంతరం ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.
 
ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీ ప్రైవేట్‌ ఈక్విటీ గ్లోబల్‌ పార్ట్‌నర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 2015 జూలై నుంచి అంజలీ బన్సాల్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఆసియా, ఆఫ్రికాల్లో టీపీజీల పోర్టుఫోలియోలను పటిష్ఠం చేయటంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

మెకిన్సే అండ్‌ కంపెనీకి న్యూయార్క్‌, ముంబైల్లో వ్యూహాత్మక కన్సల్టెంట్‌గా పనిచేశారు. అంతకు ముందు ఆమె భారత్‌లో రిక్రూట్‌మెంట్‌ సంస్థ స్పెన్సర్‌ స్టువర్ట్‌ కార్యకలాపాలను ప్రారంభించారు. అనతికాలంలో సంస్థ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించారు. ఆసియా పసిఫిక్‌ లీడర్‌షిప్‌ టీమ్‌లో భాగంగా ఆసియా పసిఫిక్‌ బోర్డ్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిచారు.
 
ఫార్చ్యూన్‌ ఇండియా-2017లో అత్యంత ప్రభావశీల మహిళగా అంజలీ బన్సాల్‌ను ఎంపికచేసింది. బాంబే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలో కీలకంగా ఉన్న బన్సాల్‌.. హైదరాబాద్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, గవర్నెన్స్‌ అండ్‌ ఎఫెక్టివ్‌నెస్‌ కార్యక్రమంలో భాగస్వామిగా వ్యవహరించారు.

ఫైన్సాన్షియల్‌ సర్వీసెస్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, పారిశ్రామిక, టెక్నాలజీ, కన్స్యూమర్‌ రంగాల సంస్థలకు కన్సల్టెంగ్‌గా సేవలందించారు. జిఎ్‌సకె ఫార్మాసుటికల్స్‌, బాటా ఇండియా లిమిటెడ్‌, టాటా పవర్‌, వోల్టాస్‌, అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల బోర్డుల్లో ఇండిపెండెంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అంజలీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది మే 23 నుంచి దేనా బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios