Asianet News TeluguAsianet News Telugu

ఎతిహాద్ ప్లస్ టీపీజీ వార్నింగ్స్: బిడ్‌ నుంచి గోయల్ బ్యాక్

ఒఖ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది జెట్ ఎయిర్వేస్ పరిస్థితి. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న బ్యాంకర్లు దాని నిర్వహణకు నిధుల కేటాయింపుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

Naresh Goyal withdraws from race for Jet Airways after Etihad, TPG threaten to walk out
Author
New Delhi, First Published Apr 17, 2019, 10:01 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో దాదాపు షట్‌డౌన్ అంచుల్లో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్.. బ్యాంకర్లు నిర్వహించిన బిడ్గింగ్‌లో పాల్గొనలేదని తెలుస్తున్నది. ఏప్రిల్ 12న బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిడ్డింగ్‌లో గోయల్ కూడా పాల్గొన్నారన్న వార్తలు వచ్చాయి. విదేశీ సంస్థలతో కలిసి బిడ్ వేసినట్లు ప్రచారం జరిగింది. 

జెట్ ఎయిర్వేస్ సంస్థకు పూర్వం నరేశ్ గోయల్ జనరల్ సేల్స్ సంస్థ జెట్ ఎయిర్.. డెలావేర్ కేంద్రంగా పని చేస్తున్న ఫ్యూచర్ ట్రెండ్ క్యాపిటల్, లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఆది పార్టనర్స్ మద్దతుతో చివరి క్షణంలో బిడ్ దాఖలు చేశాయి. కానీ  అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), టీపీజీ క్యాపిటల్ సంస్థలు మళ్లీ నరేశ్ గోయల్ బిడ్డింగ్ దాఖలు చేస్తే వైదొలుగుతామని హెచ్చరించాయి.

దీంతో జెట్ ఎయిర్వేస్ సంస్థ భవిష్యత్ కోసం నరేశ్ గోయల్ వెనుకడుగు వేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చే వరకు పూర్తిగా కార్యకలాపాలు నిలిపేయడమే జెట్ ఎయిర్వేస్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

సంస్థ రుణదాతల కూటమి.. వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ఎవరికి వారు తమ పంతం వీడకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థకు తక్షణ సాయం అందడం మృగ్యంగా మారిపోయింది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరింతగా రుణం అందించేందుకు సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మెన్‌ నరేశ్‌ గోయెల్‌ తన వాటాను తనఖా పెట్టడంతోపాటు సంస్థకు ఉన్న దాదాపు 10 వరకు సొంత విమానాలను కూడా పూచీకత్తుగా ఉంచితే మధ్యంతర సాయం అందిస్తామంటూ కొందరు బ్యాంకర్లు ప్రతిపాదించారు. దీనికి గోయల్‌, యాజమాన్యం అంగీకరించకపోవడంతో జెట్‌కు మధ్యంతర సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. 

ఈ నేపథ్యంలో సంస్థ భవితవ్యంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు మధ్యంతర సాయం అందించేందుకు ఇటు రుణదాతలు గానీ.. ప్రభుత్వం గానీ.. ఇతర ప్రయివేటు సంస్థలుగానీ మందుకు రాలేదు కాబట్టి.. విధిలేని పరిస్థితుల్లో అవసరమైతే సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. ఈ విషయమై తుది నిర్ణయాన్ని సంస్థ సీఈవో అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు రుణదాతలు కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహెతా చెప్పారు. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని మంగళవారం జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశం తర్వాత మీడియాతో అన్నారు. 

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నేతృత్వంలోని జెట్ ఎయిర్‌వేస్‌కు అప్పులిచ్చిన 26 మంది రుణదాతల్లో పీఎన్‌బీ కూడా ఒకటి. జెట్ ఎయిర్‌వేస్ రుణ భారం రూ.8,000 కోట్లకుపైగా ఉన్న విషయం తెలిసిందే. జెట్ పునరుద్ధరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ పునరుద్ధరణ ప్యాకేజీని పరిశీలిస్తున్నదని మెహెతా చెప్పారు. 

బ్యాంకర్ల కన్సార్టియం సూచన మేరకు జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి గోయల్ దంపతులు గత నెల తప్పుకున్న సంగతి తెలిసిందే. గోయల్‌తోపాటు, సంస్థలో వాటా ఉన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్ షేర్లను అప్పులిచ్చిన బ్యాంకర్లు మెజారిటీ భాగస్వాములుగా అవతరించారు. ఈ క్రమంలోనే రుణాల వసూళ్లలో భాగంగా తమ వాటాలను విక్రయించేందుకు బ్యాంకులు బిడ్డింగ్ నిర్వహించాయి. 

ఎస్‌బీఐ క్యాపిటల్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా, త్వరలోనే బిడ్డర్ల వివరాలను విడుదల చేస్తామని సోమవారం ఎస్‌బీఐ ప్రకటించినది తెలిసిందే. సంస్థలో 75 శాతం వరకు వాటాను సొంతం చేసుకునేలా బిడ్డర్లు ఉండాలని బ్యాంకులు అంటున్నాయి. 

కానీ జెట్ ఎయిర్‌వేస్ మనుగడపై ఆ సంస్థ ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లింది. వరుస ప్రతికూల పరిణామాల మధ్య ఇప్పటికే ఇతర ఎయిర్‌లైన్స్ వైపు చూస్తున్న ఉద్యోగులు.. తమ వేతన బకాయిల వసూలు కోసం యాజమాన్యంపై న్యాయ పోరాటానికీ తెరతీస్తున్నారు. 

బ్యాంకుల చేతికి మెజారిటీ వాటా చేరడంతో అంతా సర్దుకున్నట్లే అనుకున్న జెట్ సిబ్బంది ఆనందం ఎంతోసేపు నిలువలేదు. తక్షణ అవసరాల నిమిత్తం రూ.1,500 కోట్ల సాయం చేస్తామన్న బ్యాంకర్లు వెనుకడుగు వేస్తుండటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 

‘మేము మా బకాయిల వసూలు కోసం లేబర్ కమిషనర్ వద్దకు వెళ్తున్నాం. ఇక ఓపిక పట్టే స్థితిలో మేము లేము అని రోజువారి ఖర్చుల కోసం తన ఎల్‌ఐసీ పాలసీపై రుణం తీసుకున్న ఓ ఇంజినీర్ మంగళవారం చెప్పారు. 

‘జెట్ ఎయిర్‌వేస్ షేర్ల విలువ ఉన్నట్టుండి భారీగా పడిపోయింది. ఇక సంస్థ పనైపోయిందన్న సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే అన్ని విమాన సర్వీసులు ఆగిపోనున్నాయి’ అని ఆయన ఒకింత నిరాశ, నిస్పృహలతో మాట్లాడారు.

సంస్థలోని అన్ని ర్యాంకుల్లోని ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ పైలెట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్) ఉపాధ్యక్షుడు కెప్టెన్ అసిం వలియాని అన్నారు. దాదాపు నాలుగు నెలలుగా జీతాలు రాక పిల్లల చదువు, ఈఎంఐ, మెడిక్లయిములకు ఆటంకం ఏర్పడుతున్నదని తెలిపారు. 

‘మాకు రావాల్సిన బకాయిలు వస్తాయన్న నమ్మకం లేదు. భవిష్యత్ అంధకారంగా ఉన్నది. దివాలా చట్టంలోకి సంస్థను తీసుకళ్లైనా మా వేతన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని మరో పైలట్ తెలియజేశారు.

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం నేపథ్యంలో పెరుగుతున్న విమాన చార్జీలపై విమానయాన రంగ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టి సారించింది. టిక్కెట్ ధరలు, ఇతరత్రా సేవల విలువల్లో రోజువారీ మార్పులను గమనిస్తున్న డీజీసీఏ.. రద్దీ ఎక్కువగా ఉన్న పది మార్గాల్లో చార్జీలను ఆమోదయోగ్య స్థాయిలోనే ఉంచాలని ఎయిర్‌లైన్స్‌ను కోరినట్లు ఖరోలా చెప్పారు. 

ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా, వారిపై భారం పెరుగకుండా ఎయిర్‌లైన్స్ సంస్థలతో డీజీసీఏ చర్చలు కూడా జరుపుతుందని మంగళవారం మీడియాకు చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు గణనీయంగా పడిపోగా, పెరిగిన ప్యాసింజర్ల రద్దీతో ఇతర విమానయాన సంస్థలు ఒక్కసారిగా టిక్కెట్ ధరలను పెంచేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం నడుస్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు ఐదేనని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి రూ.400 కోట్ల అత్యవసర నిధుల కోసం జెట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 

జెట్ ఎయిర్‌వేస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ఈ సంక్షోభం నేపథ్యంలో దేశీయ విమానయాన రంగంలో ఏర్పడిన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నదనీ ఆయన  తెలిపారు. కాగా, నడుస్తున్న ఈ విమానాలు కూడా ఏటీఆర్ (చిన్న శ్రేణి విమానాలు)లు కావడం గమనార్హం. బకాయిలు చెల్లించకపోవడంతో చమురు సంస్థలు అప్పుపై ఇంధన సరఫరాను నిలిపివేయగా, డబ్బులిచ్చి కొనలేక భారీ విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి.

మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ కష్టాలను అమెరికా ఎగ్జిమ్ బ్యాంక్ మరింత పెంచేసింది. బోయింగ్ 777 విమానాలను కొనేందుకు గతంలో పొడిగిస్తామన్న అన్ని రుణాలను నిలిపివేసిన బ్యాంకు.. ఇప్పటికే ఇచ్చిన అప్పుల వసూలుకు ఉన్న బోయింగ్ విమానాలనూ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ దాదాపు రూ.2,000 కోట్ల రుణాలను తీసుకున్నది. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్‌వేస్‌కున్న 10 బోయింగ్ 777 విమానాలను ఎగ్జిమ్ బ్యాంక్ స్వాధీనం చేసుకునే వీలుందని తెలుస్తున్నది. దీనిపై అటు ఎగ్జిమ్ బ్యాంక్‌ను, ఇటు జెట్ ఎయిర్‌వేస్‌ను సంప్రదించినా సమాధానం లేదు. 

25 ఏండ్లకుపైగా నడిచిన జెట్ ఎయిర్‌వేస్.. ఒకప్పుడు గరిష్ఠంగా 124 విమానాలతో సేవలందించింది. ప్రస్తుతం 5 విమానాలను నడుపుతున్నది. ఇవి కూడా రేపోమాపో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కాగా, మంగళవారం జెట్ షేర్ల విలువ 8 శాతం వరకు నష్ట పోయింది. ఒకానొక దశలో దాదాపు 19 శాతం పడిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios