‘అమెరికాకు వెళ్లడానికి విమాన టిక్కెట్‌ కొనేందుకు నా తండ్రి ఏడాది జీతాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది’ అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని యువతకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల కోసం యూ ట్యూబ్‌ నిర్వహిస్తున్న ‘డియర్‌ క్లాస్‌ ఆఫ్‌ 2020’ కార్యక్రమంలో పిచాయ్‌ మాట్లాడుతూ 27 ఏళ్ల క్రితం భారత్‌ నుంచి అమెరికాకు వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.

స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివేందుకు అమెరికాకు వెళ్తున్న తాను విమాన టిక్కెట్‌ కొనేందుకు తన తండ్రి ఏడాది వేతనాన్ని వెచ్చించాల్సి వచ్చిందని సుందర్ పిచాయ్ తెలిపారు. తన తొలి విమాన ప్రయాణం కూడా అదేనన్నారు. 

అమెరికాలో జీవనం చాలా ఖరీదైనదని, ఇంటికి ఫోన్‌ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లకుపైగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. భుజాలకు వేసుకునే బ్యాగ్‌ విలువ భారత్‌లో నాన్న నెల జీతమని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. 

తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డానన్న సందర్ పిచాయ్ దఅది అదృష్టమే కాకుండా టెక్నాలజీపై తనకున్న అమితమైన ఇష్టం, దేన్నైనా పాజిటివ్‌గా ఆలోచించే స్వభావాలే భారత్‌ నుంచి అమెరికాకు రప్పించాయని చెప్పారు. కాబట్టి ఈ కష్టకాలంలో ఆశాజనకంగా ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. ఈ క్రమంలోనే 1920, 70, 2001లలో అంటురోగాలు, యుద్ధాలు, ఉగ్రవాద దాడుల మధ్య విద్యార్థులు ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. 

also read బ్యాడ్ బ్యాంక్ ఆలోచన చాలా ‘బ్యాడ్‌’ ఐడియా..!

దేన్నైనా మార్చగల శక్తి యువతకు ఉందన్నారు. చెన్నైకి చెందిన పిచాయ్‌.. ఐఐటీ ఇంజినీర్‌. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీ, వార్టన్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ అభ్యసించారు. ఇక 48 ఏళ్ల పిచాయ్‌.. 2004లో గూగుల్‌లోకి అడుగుపెట్టి, సంస్థ సారథి స్థాయికి ఎదిగారు.

గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌గా అనిల్‌ వల్లూరి నియమితులు అయ్యారు. ఇంతకుముందు ఈయన నెట్‌యాప్‌ ఇండియా-సార్క్‌ దేశాల కార్యకలాపాల అధ్యక్షుడిగా పనిచేశారు.

‘భారత్‌లోని ప్రముఖ బహుళజాతి టెక్నాలజీ సంస్థలు అనిల్‌ నాయకత్వంలో పని చేశాయి. ఆయనకు ఉన్న అనుభవం మాకు ఎంతో విలువైనది. వ్యాపారాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలు, సాంకేతిక సవాళ్లను పరిష్కరించడంలో మాకు దోహదపడగలదు’ అని గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఎండీ కరణ్‌ బజ్వా ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరిశ్రమలో క్లౌడ్‌ సేవలు కీలకమని, ఇందులో గూగుల్‌ పాత్ర ప్రధానమని వల్లూరి అన్నారు. ఈ అవకాశం తనకు రావడంపట్ల ఆనందం వెలిబుచ్చారు.