Asianet News TeluguAsianet News Telugu

ఇల్లు కొనేవారికి ఇదే బెస్ట్ టైం.. లాక్‌‌డౌన్ కారణంగా భారీగా ఆఫర్లు..

కరోనా మహమ్మారి ముప్పుతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. డెవలపర్లు ఇళ్ల విక్రయా కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  
 

Mumbai luxury real estate rates on their way down
Author
Hyderabad, First Published Jul 8, 2020, 10:50 AM IST

ముంబై: సొంతిల్లు కొనుక్కోవాలని భావించే వారికి గుడ్ న్యూస్. భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు దిగొస్తున్నాయి. లాక్‌‌డౌన్ కారణంగా డెవలపర్లకు డబ్బు సమస్యలు ఎక్కువ కావడంతో ధరలను తగ్గించి వేస్తున్నారు. 

ముంబై నగరంలో ఇల్లు కొనాలనుకునే వారికి ఇదే అనువైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. డబ్బులు లేట్‌‌గా చెల్లిస్తామన్నా కూడా డెవలపర్లు ఒప్పుకుంటున్నారు. సమాన వాయిదాలకూ ఓకే చెబుతున్నారు. ఇంట్లో దిగే వరకు చెల్లింపులపై వడ్డీ మాఫీ చేస్తామని హామీ  ఇస్తున్నారు.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌‌బీఎఫ్‌‌సీ) ఐఎల్ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌లో క్రైసిస్ మొదలైన తరువాత రియల్టీ కంపెనీలకు లోన్లు దొరకడం కష్టంగా మారింది. అంతేగాక అమ్ముడుపోని ప్రాజెక్టులు పేరుకుపోయాయి. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దెబ్బతిన్నది.

అయినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగానికి సాయం అందించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో డెవలపర్లకు ధరలు తగ్గించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. 


కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారికి డిస్కౌంట్లు ఇవ్వడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలపర్లు, సెల్లర్లు రెడీగా ఉన్నారని సేవిల్స్ ఇండియా ఎండీ భవిన్ ఠక్కర్ చెప్పారు. మిడ్‌‌ రేంజ్ సెగ్మెంట్‌‌లోని ఇండ్లపై 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, కొందరు మాడ్యులర్ కిచెన్స్ లేదా కార్ లేదా ఫర్నిచర్ వంటి వాటిని ఉచితంగా ఇస్తున్నారని వివరించారు. 

also read చైనాయాప్ టిక్ టాక్ పై మళ్ళీ బ్యాన్.. ఇప్పుడు అమెరికాలో..? ...

లగ్జరీ అపార్ట్‌‌మెంట్లపై అయితే డిస్కౌంట్లు 35 శాతం వరకు ఉన్నాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ముంబైలోని దాదాపు 70 శాతం ప్రాజెక్టుల ధరలు తగ్గాయని ప్రాప్‌‌స్టక్ స్టడీ తెలిపింది. సెకండరీ మార్కెట్లోనూ తక్కువ ధరలకే ఆస్తులు అందుబాటులో ఉన్నాయని మరో అధ్యయనం వెల్లడించింది. 

ముంబైతోపాటు ఢిల్లీలోనూ రేట్లు తగ్గాయని పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని డెవలపర్లు అంటున్నారు.

ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ వంటి ఒకటి రెండు కంపెనీలు మాత్రం ధరలు తగ్గించడం లేదు. ఈ విషయమై కంపెనీ సీఎండీ వికాస్ ఒబెరాయ్ మాట్లాడుతూ ముంబైలో కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయని, లేబర్ కొరత వల్ల ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని వివరించారు. 


 చెల్లింపుల విషయంలో మాత్రం కస్టమర్లతో కఠినంగా వ్యవహరించడం లేదని, ఈఎంఐ వంటి ఆఫర్లు ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 25 శాతం మొత్తం తీసుకుని, గృహప్రవేశ సమయంలో మిగతా మొత్తం కట్టాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. 

ఒబెరాయ్ మాదిరిగా అన్ని రియల్టీ కంపెనీల దగ్గర డబ్బు లేదని, అవి ధరలు తగ్గించకతప్పదని రియాల్టీ విశ్లేషకులు అంటున్నారు. చిన్న డెవలపర్లు కచ్చితంగా డిస్కౌంట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios