ఎలక్ట్రిక్ వాహన రంగానికి భవిష్యత్తు బాగుందని తేలడంతో, ఈ రంగంలోని ఆటోమొబైల్ సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా నేటి ట్రేడింగ్ లో Olectra Greentech Limited షేర్లు ఏకంగా 18 శాతం పెరిగాయి. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సును అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడంతో కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి.
ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ నేపథ్యంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీ అయిన నిఫ్టీ ఈ వారం ఏకంగా 500 పాయింట్లకు పైగా జారిపోయి 17,500 స్థాయికి దిగువన ముగిసింది. నిఫ్టీకి ఇది చాలా అస్థిరమైన వారం. శుక్రవారం BSE సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ కూడా నెగిటివ్ గానే ముగిసింది. మార్కెట్ బోలెటైల్ గా ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ లో మాత్రం విపరీతమైన బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది ముఖ్యంగా నేడు Olectra Greentech Limited షేర్లు ఏకంగా 18 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ బస్సులను తయారుచేసే ఈ కంపెనీ తాజాగా రిలయన్స్ తో చేతులు కలిపింది. అయితే నేడు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సును త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్లు ఆకాశం మార్గం పట్టాయి. రయ్యిమంటూ ఎగిసి ఏకంగా 18% పెరిగాయి.
ఫిబ్రవరి 23, 2023న, Olectra Greentech Limited ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తమ భాగస్వామి రిలయన్స్‌తో కలిసి Olectra హైడ్రోజన్ బస్సును అభివృద్ధి చేసినట్లు తెలియజేసింది. తమ బస్సు సాంప్రదాయ ప్రజా రవాణాకు కార్బన్ రహిత ప్రత్యామ్నాయమని ప్రకటించింది. ప్రపంచంలోనే ఈ తరహా ఈ ధనంతో నడిచే బస్సులో ఇది తొలి తరం వాహనమని కంపెనీ తెలిపింది.
క్రూడాయిల్ వంటి సహజ వనరుల క్షీణత, వాయు కాలుష్యం, కర్బన ఉద్గారాల ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో, Olectra హైడ్రోజన్-ఆధారిత బస్సుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి చొరవ తీసుకుంది. కార్బన్ రహిత హైడ్రోజన్ ఆశయాలను సాధించడానికి ఈ చొరవకు భారత ప్రభుత్వానికి సహాయం చేస్తుందని తెలిపింది. దీంతో కంపెనీ షేర్లు ఒక్క సారిగా భారీగా పెరిగాయి.
Olectra Greentech Ltd గత రెండేళ్లలో తన వాటాదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్‌లను అందించిందని గుర్తుంచుకోవాలి. కంపెనీ షేరు ధర 24 ఫిబ్రవరి 2021న రూ. 185.25 నుండి 23 ఫిబ్రవరి 2023న రూ. 476.5కి పెరిగింది. అంటే ఇది రెండేళ్ల హోల్డింగ్ పీరియడ్‌లో 157 శాతం పెరిగింది.
Olectra Greentech Limited 2000లో స్థాపించారు. కంపెనీ 2003 నుంచి పాలిమర్ ఇన్సులేటర్ల తయారీలో నిమగ్నమై ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి BYD (చైనీస్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ)తో జతకట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు Olectra BYD ఉమ్మడి బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. నేడు కంపెనీ షేరు రూ. 430 వద్ద ప్రారంభమైంది, గరిష్టంగా రూ. 480 వరకూ పెరిగింది. ప్రస్తుతం ఈ షేరు 18.53 శాతం పెరిగి రూ.476.55 వద్ద ట్రేడవుతోంది.
Disclaimer - పై పేర్కొన్నటువంటి సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే, ఏషియా నెట్ తెలుగు, ఎలాంటి స్టాక్ రికమండేషన్స్ ఇవ్వదు. పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్స్ నిపుణుల సలహా తీసుకోండి.
