రిసెషన్ నిజమే.. కానీ తాత్కాలికం: ముకేశ్ అంబానీ
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నిజమేనని అంగీకరించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. కానీ ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలతో త్వరలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు.
రియాద్: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న మాట నిజమేనని అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ అంగీకరించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్షియేటివ్ (ఎఫ్ఐఐ)లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ''దేశంలో ఆర్థిక మందగమనం వాస్తవమే. కానీ, నా అభిప్రాయం ప్రకారం అది తాత్కాలికం. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల త్వరలోనే పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నా. అప్పుడు భారత్ తప్పక వృద్ధిలో దూసుకుపోగలదు'' అని అన్నారు.
also read డిజిటల్ సేవల్లో రిలయన్స్ సంచలనం....
దేశంలో వృద్ధి రేటు ఇటీవల భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎప్పుడూ లేని విధంగా ఐదు శాతానికి పరిమితమైంది. 2013 తర్వాత ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధికి పలు చర్యలు చేపట్టింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, బ్యాంకులు నిధులు సమకూర్చడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు దేశాలు వృద్ధిలో సాంకేతిక, యువ జనాభా, నాయకత్వం కీలక పాత్ర పోషిస్తున్నాయని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో రెండు దేశాలు కలిసి పని చేయడం ద్వారా వృద్ధి పథంలో ముందుకు సాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అన్నింటికి మించి రెండు దేశాల్లోనూ అత్యుత్తమ నాయకత్వం ఉందని, గత రెండు, మూడేళ్లలో సౌదీ అరేబియా అద్భుతమైన మార్పులకు గురైందని చెప్పారు.
also read అమేజింగ్ మిస్టేక్.. కుర్రాళ్లు కుమ్మేశారు!!
గత ఐదు త్రైమాసికాలుగా భారత వ్రుద్దిరేటు తగ్గుతూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వ్రుద్దిరేటు ఐదు శాతానికే పరిమితం. 2013 తర్వాత ఇదే అత్యంత తక్కువ వ్రుద్ధిరేటు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు అదనపు మూలధనం, కార్పొరేట్ పన్నురేటులో కోత, ఎన్బీఎఫ్సీలకు ద్రవ్య లభ్యత వంటి చర్యలను కేంద్రం తీసుకున్నది.
సౌదీ అరేబియా చమురు దిగ్గజం ఆరామ్ కోకు తన చమురు రసాయనాల వ్యాపారంలో ఐదో వంతు వాటా 15 బిలియన్ డాలర్లకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విక్రయించేందుకు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.