Asianet News TeluguAsianet News Telugu

దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు. 

Mukesh Ambani's help saves day for Anil as RCom makes Rs 550 cr payment to Ericsson
Author
Mumbai, First Published Mar 19, 2019, 10:52 AM IST

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌-కామ్‌) అధినేత అనిల్‌ అంబానీ చివరి క్షణంలో స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్‌ కంపెనీకి బకాయి చెల్లించి, జైలు కెళ్లకుండా పరువు దక్కించుకున్నారు.

సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒక్కరోజు ముందు స్వీడన్‌ టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రూ.550 కోట్లను అనిల్‌ చెల్లించడం గమనార్హం. ఆర్‌కామ్‌ నుంచి రావాల్సిన మొత్తం అందినట్లు ఎరిక్సన్‌ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. వడ్డీతోసహా రావాల్సిందంతా అందినట్లు ప్రతినిధి పేర్కొన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అన్న ముకేశ్‌ అంబానీ ఆర్థిక సాయం అందించడం వల్లే ఇది సాధ్యమైంది. ‘ఈ క్లిష్ట సమయంలో నా వెంట నిలిచిన గౌరవనీయులైన నా అన్న, వదిన ముకేశ్, నీతాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

సకాలంలో సహకారంతో మా కుటుంబ విలువలకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. నేను, నా కుటుంబం గతాన్ని దాటి వచ్చినందుకు కృతజ్ఞులం’ అని ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ  ప్రకటించారు.

దీంతో ఎరిక్‌సన్‌కు బకాయిల చెల్లింపునకు కావాల్సిన మొత్తాన్ని సోదరుడు ముకేశ్‌ అంబానీ సమకూర్చి ఆదుకున్నట్టు అనిల్‌ ప్రకటనతో తెలుస్తోంది. ఎరిక్సన్‌కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.550 కోట్లు చెల్లించేందుకు ఈనెల 19 వరకు సుప్రీంకోర్టు అనిల్‌ అంబానీకి గడువు ఇచ్చిన సంగతి విదితమే. 

నిధులు ఉన్నా, తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో, ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్‌ను గత ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది కూడా.

మార్చి 19 లోపు కనుక బకాయి తీర్చకపోతే, ఆర్‌కామ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీతో పాటు ఆర్‌కామ్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఛైర్మన్‌ చాయా విరానీ, రిలయన్స్‌ టెలికాం ఛైర్మన్‌ సతీశ్‌ సేథ్‌లనూ జైలుకు పంపుతామని కోర్టు స్పష్టం చేసింది.

సోమవారం సాయంత్రం ఆర్‌కామ్‌ నుంచి రూ.550 కోట్లు ఎరిక్సన్‌కు చేరాయి. ఇంతకుముందు రూ.118 కోట్లు చెల్లించింది. ఏడేళ్లు ఆర్‌-కామ్‌ నెట్‌వర్క్‌ నిర్వహణకు 2013లో చేసుకున్న ఒప్పందం మేరకు నిధులు చెల్లించడం లేదని, తమకు రూ.1600 కోట్ల వరకు రావాలని ఎరిక్సన్‌ దివాళా కోర్టును ఆశ్రయించింది. 

ఈ కేసు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ), అక్కడనుంచి సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 30, డిసెంబర్ 15తేదీలను గడువుగా పేర్కొన్నా, ఆర్‌-కామ్‌ చెల్లించలేదు. ఫలితంగా ఎరిక్సన్‌ 3 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేసింది. 

సుప్రీంకోర్టు కఠిన ఆదేశాల తర్వాత ఐటీ  రిఫండ్‌ ద్వారా తమ బ్యాంక్‌ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను ఎరిక్సన్‌కు చెల్లించేందుకు  అనుమతివ్వాలంటూ ఆర్‌కామ్‌ రుణ దాతలను అభ్యర్థించింది. అయితే ఇందుకు అవి  ససేమిరా అన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం బీఎస్‌ఈలో ఆర్‌-కామ్‌ షేర్  9.30 శాతం నష్టపోయి, రూ.4 వద్ద ముగిసింది.

మరోవైపు ఆస్తుల విక్రయం కోసం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియోతో, అనిల్‌ అంబానీ ఆధీనంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌-కామ్‌) 15 నెలల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి.

ప్రభుత్వంతోపాటు రుణదాతల నుంచి అనుమతుల్లో తీవ్ర జాప్యం జరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ఆర్‌-కామ్‌కు 40 దేశ, విదేశాల సంస్థలు రుణాలిచ్చాయి. 45 సార్లు సమావేశమైన తరవాత కూడా ఆస్తుల విక్రయానికి రుణ దాతల నుంచి, టెలికం శాఖ నుంచి అనుమతులు పొందలేకపోయామని ఆర్‌-కామ్‌ పేర్కొంది.

తమ పూర్తి రుణభారం విషయమై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ద్వారా వేగవంత పరిష్కారం కనుగొనాలని ఆర్‌-కామ్‌ బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఆర్‌-కామ్‌, రిలయన్స్‌ టెలికం, ఆర్‌ఐటీఎల్‌ కంపెనీల ఆస్తులు విక్రయించకుండా జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఫిబ్రవరి 4న ఆదేశాలిచ్చింది. 

రుణదాతల వాంగ్మూలాలు నమోదు చేసి, ఎన్‌సీఎల్‌ఏటీ ఈనెల 15న జారీచేసిన ఆదేశాల ప్రకారం.. ఆస్తుల విక్రయం కుదరదని ఆర్‌-కామ్‌ తెలిపింది. పారదర్శకంగా తమ రుణభార పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios