ప్రస్తుతం వేసవి కాలమే అయినా సడన్ గా వర్షాలు కూడా పడుతున్నాయి. అవి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ టిప్స్ పాటిస్తే సురక్షితంగా మీ ప్రయాణం సాగుతుంది.  

ప్రస్తుతం వేసవి కాలమే అయినప్పటికీ గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సడన్‌గా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా వర్షాల వల్ల రోడ్లు జారిపోతాయి. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షం పడుతున్నప్పుడు ఈ టిప్స్ పాటించండి

వర్షంలో వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదాలు జరగొచ్చు. వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. 

రెండు చేతులతో వాహనాన్ని నడపండి. వాహన వేగాన్ని తగ్గించండి. ఇతర వాహనాలతో తగినంత దూరం పాటించండి. మలుపుల్లో నెమ్మదిగా బ్రేక్ వేయండి.

కారు నడిపే వారు ఇవి పాటించాలి

వర్షంలో తడిసిన రోడ్లపై ముందుగానే బ్రేక్ వేయండి. మలుపుల్లో హఠాత్తుగా స్టీరింగ్ తిప్పకండి. టైర్లు, బ్రేకులు, ఆయిల్ వంటివి నెలకోసారి చెక్ చేసుకోండి. టైర్లలో గాలి సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. హఠాత్తుగా బ్రేకులు వేయకండి. 

రోడ్లపై ఈ జాగ్రత్తలు తీసుకోండి

రోడ్డుకి, టైర్లకి మధ్య నీరు చేరితే వాహనం మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. నీటిలోకి వెళ్లే ముందు మీ కారు ఫస్ట్ లేదా సెకండ్ గేర్‌లో ఉందని నిర్ధారించుకోండి. లోతైన గుంతలు లేదా నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనం నడుపుతున్నప్పుడు క్లచ్, యాక్సిలరేటర్‌ను బ్యాలెన్స్ చేస్తూ నడపండి. మీ ముందున్న ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించండి.

ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలా చేయండి

వర్షం ఆగే వరకు లేదా తగ్గే వరకు వాహనాన్ని ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో ఆపడం మంచిది. వర్షంలో మీకు రోడ్డు సరిగ్గా కనిపించకపోతే వెంటనే హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు వేయండి. రోడ్డుపై ఉన్న ఇతర డ్రైవర్లకు మీ కారు కనిపిస్తుంది. దీంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.