Asianet News TeluguAsianet News Telugu

ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం: రూ.2 లక్షల కోట్ల విత్ డ్రా...

జాతీయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థ ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో నెలకొన్న సంక్షోభం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాల్‌గా పరిణమించింది. మదుపర్లంతా రెండేళ్లుగా డెట్ ఫండ్లలో పెడుతున్న పెట్టుబడులను ఉపసంహరించుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు బారులు తీరుతున్నారు. ఫలితంగా బ్యాంకుల్లోకి రూ.2 లక్షల కోట్ల నిధులు రావచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిపుణులు రూపొందించిన అధ్యయన నివేదిక తేటతెల్లం చేసింది. 

MF redemptions up to Rs 2 lakh crore can support NBFCs
Author
Mumbai, First Published Oct 27, 2018, 11:58 AM IST

ముంబై: ఆకర్షణీయంగా సాగిన స్టాక్‌మార్కెట్‌‌తోపాటు, డెట్‌ ఫండ్లపై పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని అందించటంతో రెండేళ్లుగా మదుపర్లు మూచ్యువల్‌ ఫండ్లలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఏళ్ల తరబడి బ్యాంకు డిపాజిట్లను ఇష్టపడిన వారు కూడా మూచ్యువల్‌ ఫండ్ల వైపేమొగ్గు చూపడం ఇటీవల వరకూ కనిపించింది. కానీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు చిక్కుల్లో పడటం, అది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభంగా మారడంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మూచ్యువల్‌ ఫండ్లలోని తమ పెట్టుబడులను మదుపరులు వెనక్కి తీసుకుని, మళ్లీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోని ఆర్థిక నిపుణులు రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది.

బాండ్ల మార్కెట్లోనే మొదలైన ఎన్బీఎఫ్సీ క్రైసిస్
బాండ్ల మార్కెట్లోనే ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం ప్రారంభమైంది. వాణిజ్య పత్రాల (సీపీ)ను గడువు ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలు తీర్చలేకపోవచ్చనే ఆందోళనతో మార్కెట్లో వీటిని తెగనమ్మడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇదే కోవలో మదుపర్లూ కూడా ముందు జాగ్రత్తతో మూచ్యువల్‌ ఫండ్లలోని తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకూ రూ.2 లక్షల కోట్ల సొమ్ము లిక్విడ్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్ల నుంచి మదుపరుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లినట్లు హెచ్‌డీఎఫ్‌సీ నిపుణుల నివేదిక పేర్కొంది. దీంతో బ్యాంకులు ఈ సొమ్మును ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే అవకాశం ఏర్పడిందని విశ్లేషించింది. 

లిక్విడిటీ సమస్యకు పరిష్కారం ఇలా 
‘ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి ఈ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకున్నారు.ఈ స్థాయిలో భారీగా వచ్చిన డిపాజిట్లను బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నాణ్యమైన ఆస్తుల కొనుగోలుకు వినియోగించే అవకాశముంది. ఎక్కువ శాతం ఇదే జరగొచ్చు కూడా. దీంతో లిక్విడిటీ ఆందోళనలు సమసిపోతాయి’’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిపుణుల నివేదిక పేర్కొంది. 

ఇలా ఎన్బీఎఫ్సీల నిధుల లభ్యతకు తాత్కాలిక పరిష్కారం
‘బ్యాంకులకు అనూహ్యంగా లభించిన ఈ సొమ్ముతో, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద ఉన్న నాణ్యమైన రుణ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిపుణుల నివేదిక వివరించింది. తత్ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల లభ్యత సమస్య కొంత తాత్కాలికంగా పరిష్కారం కావచ్చని అభిప్రాయపడింది. కానీ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వద్ద ఉన్న రుణ ఆస్తుల నాణ్యత ఏమిటనేది ప్రశ్నార్థకం కావచ్చు. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఇప్పటికే రూ.45వేల కోట్ల మేరకు రుణ ఆస్తులు కొనుగోలు చేయటానికి సిద్ధపడింది. 

నిధుల లభ్యత సమస్యాత్మకమైతే అప్పు పుట్టదన్న నివేదిక
ఒకవేళ నిధుల లభ్యత ఇప్పటి మాదిరిగానే సమస్యాత్మకంగా ఉంటే, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి వినియోగదార్లకు అప్పు పుట్టదని, దానివల్ల గృహోపకరణాలు, వాహనాలు, ఇళ్ల కొనుగోళ్లు మందగిస్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిపుణుల నివేదిక పేర్కొంది. చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా రుణాలు లభించవు. దానివల్ల వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంక్షోభంలో చిక్కుకోవడం ఆ సంస్థ సమస్య అని పేర్కొంటూ, దీనివల్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలే పరిస్థితి లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నివేదిక వివరించింది. కాకపోతే స్వల్పకాలంలో సంబంధిత అన్ని వర్గాల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని విశ్లేషించింది.

నిధుల లభ్యతతో విస్తరించిన ఎన్బీఎఫ్సీల బిజినెస్
ఐదేళ్లలో గృహోపకరణాలకు ఇచ్చిన రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 19 శాతం నుంచి 32 శాతానికి పెరిగింది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ వాటా 2015 డిసెంబర్‌లో ఉన్న 5.5 శాతం నుంచి 2018 మార్చి నాటికి 35 శాతానికి పెరిగింది. రుణాల మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉండటం, సులువుగా నిధులు లభించటంతో ఎన్‌బీఎఫ్‌సీలు పెద్దఎత్తున తమ వ్యాపారాన్ని విస్తరించాయి. 

పరిస్థితులను ఇప్పుడే అంచనా వేయలేం
కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ముందు వచ్చే మూడేళ్లలో ఈ సంస్థలు రూ.1 లక్ష  కోట్లకు పైగా వాణిజ్య పత్రాలు, ఇతర స్వల్పకాలిక రుణ సాధనాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత సంక్లిష్టమైన పరిస్థితులు మరీ దిగజారిపోయి పెద్ద సంక్షోభంగా మారకపోవచ్చు కానీ, పరిస్థితులెలా రూపుదిద్దుకుంటాయనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిపుణుల నివేదిక పేర్కొంది. మరీ కష్టకాలం వస్తే ఆఖరి ఆయుధంగా ప్రభుత్వం 2008లో మాదిరిగా ‘ప్రత్యేక నిధుల లభ్యత వసతి’ అందించాల్సి వస్తుందని వివరించింది.

14.35 శాతం పెరిగిన బ్యాంకింగ్‌ రుణ వృద్ధి: ఆర్బీఐ
గతేడాదితో పోలిస్తే ఈ నెల 12వ తేదీతో ముగిసిన పక్షం రోజుల కాలానికి బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  14.35 శాతం పెరిగి రూ.89.93 లక్షల కోట్లకు చేరుకున్నది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణాలు రూ.78.65 లక్షల కోట్లని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. తాజా సమీక్షా కాలంలో డిపాజిట్ల వృద్ధి రేటు 8.86 శాతం పెరిగి.. డిపాజిట్లు 108.25 లక్షల కోట్ల నుంచి రూ.117.85 లక్షల కోట్లకు చేరాయి. గత నెల 28వ తేదీతో ముగిసిన పక్షం రోజుల ప్రకారం చూసిన గతేడాది ఇదే కాలానికంటే రుణ వృద్ధి 12.51 శాతం పెరిగి, రూ.89.82 లక్షల కోట్లకు చేరింది. కాగా డిపాజిట్లలో రేటు 8.07 శాతం పెరుగుదలతో రూ.117.99 లక్షల కోట్లుగా నమోదయ్యింది. మరోవైపు 2018 ఆగస్టులో ఆహార విభాగానికి రుణంలో 12.4% వృద్ధి నమోదైంది.  ఇదే నెలలో పారిశ్రామిక రంగ రుణాల్లో వృద్ధి 0.3% నుంచి 1.9 శాతానికి చేరింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios