ముంబై: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న పోరాటంలో తమ వంతుగా మరింత భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వస్తున్నాయి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్థానిక అధికారుల సహకారంతో తన పుణె- చకన్ ప్లాంట్‌లో 1500 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించింది. ఈ బెడ్లన్నీ ఐసోలేషన్ వార్డుల్లోనే ఉపయోగిస్తామని వెల్లడించింది. 

ఈ తాత్కాలిక ఆస్పత్రిలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని మెర్సిడెస్ - బెంజ్ తెలిపింది. ఇప్పటికే తమ సంస్థ ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తారని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. చకన్ ఖేడ్ వద్ద గల మాలంగ్-ఇంగాలే గ్రామంలో ఈ తాత్కాలిక ఆస్పత్రి కొలువు దీరనున్నదని తెలిపింది. 

మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) ఆధ్వర్యంలోని హౌసింగ్ స్థలంలో 374 గదులతో దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపింది. తాత్కాలిక ఔట్ పేషంట్ విభాగం, స్టే, స్ట్రేచర్లు, వీల్ చైర్లు, పీపీఈ కిట్స్, శానిటైజర్లు అందుబాటులోకి తెస్తామన్నది. 

కొవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత ఔషధ పరికరాలన్నీ ఖేడ్ లోని సివిల్ హాస్పిటల్‌కు. ఐసోలేషన్ వార్డుల్లోని పరికరాలు, సామగ్రిని గిరిజన యువకుల హాస్టళల నిర్వహణకు అప్పగిస్తామని తెలిపింది. ఖేడ్, విమన్ నగర్ ప్రాంతంలోని 1600 కుటుంబాలకు రేషన్, క్లీనింగ్ కిట్లు సరఫరా చేయడంతోపాటు వారికి మద్దతుగా నిలుస్తామని వెల్లడించింది. అంతటితో ఆగక గ్రాండ్ మెడికల్ ఫౌండేషన్ (రూబీ హాల్ క్లినిక్)కు నేరుగా వెంటిలేటర్లు విరాళంగా అందచేస్తుంది. 

వోక్స్ వ్యాగన్ గ్రూప్ అనుబంధ స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా స్పందిస్తూ పుణెలోని సస్సూన్ జనరల్ ఆస్పత్రిలో కొవిడ్-19 వార్డు ఏర్పాటు చేసేందుకు రూ. కోటి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపింది. వోక్స్ వ్యాగన్ ఏజీ ద్వారా వివిధ దేశాల నుంచి మెడికల్ పరికరాలను దిగుమతి చేస్తామని, శానిటైజర్లను సరఫరాచేస్తామని పేర్కొంది. 

బజాజ్ ఆటోమొబైల్స్ రూ.100 కోట్లతో పలు సహాయ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. పుణెలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య పరిరక్షణ వసతులను మెరుగు పరిచేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తామని, పుణె గ్రామీణ ప్రాంత ప్రజల జీవనానికి అవసరమైన ఆహార, నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. టీవీఎస్ గ్రూప్ రూ.30 కోట్లతో పది లక్షల మాస్కులు తెప్పించడంతోపాటు ఇతర వసతులు కల్పిస్తామని తెలిపింది. 

మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రొటో టైప్ వెంటిలేటర్, ఫేష్ షీల్డ్, ఇతర ప్రొటెక్టివ్ పరికరాలను తయారు చేసేందుకు సిద్దమని ప్రకటించాయి. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా సదరు వెంటిలేటర్, ఫేష్ షీల్డ్ విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా వెంటిలేటర్లు, మాస్కులు, ఇతర వైద్య రక్షణ పరికరాల తయారీలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ తమ దేశం నుంచ 25 వేల టెస్టింగ్ కిట్స్ దిగుమతి చేస్తామని ప్రకటించింది.