Meolaa సీఈఓ ఇషితా సావంత్, టాలెంట్ అక్విజిషన్‌పై వ్యక్తిగతంగా దృష్టి పెట్టడానికి రెండు వారాల పాటు తన బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నారు. 15 కీలక పదవులను భర్తీ చేసే  చర్యలను ఆమె స్వయంగా పర్యవేక్షించనున్నారు. 

Meolaa : ఏఐ ఆధారిత FMGC (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) స్టార్టప్ మియోలా సరికొత్త ప్రయాగం చేస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ ఇషితా సావంత్ స్వయంగా హెచ్ఆర్ (Human Resources) అవతారం ఎత్తారు. పూర్తిగా నియామకాలపై దృష్టి పెట్టడానికి రెండు వారాల పాటు సీఈఓ పదవిని పక్కనబెట్టారు. ఇప్పుడు మియోలాలో ఉన్న 15 కీలకమైన ఖాళీలను భర్తీ చేసి, తన విజన్‌ను నిజం చేసే బృందాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇలా ఓ అసాధారణమైన, స్ఫూర్తిదాయకమైన అడుగు వేశారు ఇషితా సావంత్.

“కంపెనీలు కేవలం టెక్నాలజీ లేదా ఐడియాలతో కాదు అందులో పనిచేసేవారివల్ల స్ట్రాంగ్ అవుతాయి. మీయోలాలో అసలైన సూపర్ పవర్ కేవలం ఏఐ కాదు. మేం చేసే ప్రతి పనిని నడిపించేది మనుషులు+టెక్నాలజీ కలయిక. ఇదే మా కంపెనీకి బలం. అందుకే మేం చురుగ్గా, వేగంగా ఆలోచించి తెలివిగా స్పందించేవారిని నియమించుకునేందకు వెతుకుతున్నాం. మాతో కలిసి పనిచేసేందుకు మీకు ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగాల కోసం అప్లై చేసుకొండి. మీకు స్వయంగా నానుండే కాల్ వచ్చినా ఆశ్చర్యపోకండి'' అని ఇషితా సావంత్ లింక్డిన్ లో పోస్ట్ చేశారు.

మియోలాకు భారీ నిధులు

జనరల్ క్యాటలిస్ట్ (GC) నేతృత్వంలో ప్రీ-సిరీస్ A ఫండింగ్‌లో $6 మిలియన్లు సేకరించిన మీయోలాలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలో క్లేపాండ్ క్యాపిటల్ (రంజన్ పాయ్ ఫ్యామిలీ ఆఫీస్), కొలోసా వెంచర్స్, కునాల్ షా, టర్బోస్టార్ట్ గ్లోబల్, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో ఈ నిధులు సమకూరాయి. ఈ ఫండింగ్ మీయోలా తన ఏఐ సామర్థ్యాలను విస్తరించడానికి, బ్రాండ్‌లను పెంచుకోవడానికి, కార్యకలాపాలను విస్తరించడానికి సహాయపడుతుంది.

FMCG ఆవిష్కరణలకు కేంద్రంగా ఏఐ

మీయోలా కేవలం మరో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ కాదు... ఈ స్టార్టప్ తన వ్యాపారంలోని ప్రతి అంశంలో వినియోగదారుల అభిప్రాయాలు, ఉత్పత్తి ఆవిష్కరణల నుంచి బ్రాండింగ్, ప్యాకేజింగ్, సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ వరకు ఏఐ, అధునాతన అనలిటిక్స్‌ను ఉపయోగిస్తోంది. “జనరల్ క్యాటలిస్ట్ మద్దతుతో మేం మొత్తం విలువ గొలుసును మార్చగల ఆధునిక, ఏఐ-ఆధారిత ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా మారడానికి చర్యలను వేగవంతం చేస్తున్నాం” అని సావంత్ చెప్పారు.

జనరల్ క్యాటలిస్ట్‌లోని మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అరోరా మాట్లాడుతూ.. “మీయోలా గురించి మమ్మల్ని ఉత్తేజపరిచేది ఏఐ-నేటివ్ ఎఫ్‌ఎంసీజీ పవర్‌హౌస్‌ను నిర్మించాలనే ఇషితా విజన్. ఏళ్ల తరబడి సాగే ఆర్&డి సైకిల్స్‌ను కొన్ని నెలల్లోకి కుదించే ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌తో ఆమె దీన్ని భర్తీ చేస్తున్నారు” అని అన్నారు. రాబోయే రెండు వారాల పాటు ఇషితా సావంత్ మీయోలా టాలెంట్ అక్విజిషన్ పార్ట్‌నర్‌గా పనిచేస్తారు.