పంజాబ్‌ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన వేల కోట్లు దండుకుని పరారైన మెహుల్‌ చోక్సీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారతదేశంలోని గీతాంజలి జెమ్స్ అనుబంధంగా అమెరికాలో వీరు నెలకొల్పిన ‘శ్యామ్యుల్స్ జ్యూవెలర్స్’లో వీరు అమ్మినవి నకిలీ వజ్రాలుగా అక్కడి ఫోరెన్సిక్‌ నివేదికలు తేల్చాయి.

వజ్రాల నాణ్యతపై అభియోగాలు రావడంతో మెహుల్ చోక్సీ, ఆయన శ్యామ్యూల్ జ్యువెల్లర్స్’లోని వజ్రాల నాణ్యతపై విచారణ జరపాలని అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ వజ్రాలను ప్రయోగశాలలో తయారు చేశారని, వాటిని నాణ్యమైనవిగా, సహజమైనవిగా వినియోగదారులను నమ్మించేందుకు నకిలీ ధ్రువపత్రాలను సైతం సృష్టించినట్లు తేల్చారు. 

మెహుల్ చోక్సీ తన ప్రయోగశాలను ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఉంచినట్లు సమాచారం. భారతదేశంలో పీఎన్బీని మోసగించి తీసుకున్న ఎల్‌ఓయూలను అడ్డుపెట్టుకుని శామ్యుల్‌ జ్యూవెలర్స్‌కి సంబంధించిందని  చూపి ‘శామ్‌ రాయల్టీ అగ్రిమెంట్‌’ పేరిట దాదాపు రూ. 139 కోట్లను పక్కదారి పట్టించినట్లు సమాచారం.

అక్కడ నకిలీ వజ్రాల వ్యాపారం జరుగుతున్నట్లు శామ్యుల్ జ్యువెల్లర్స్ సంస్థలో పనిచేసిన ఒక సీనియర్‌ ఉద్యోగి ఒకరు గతంలో బయటపెట్టారు. ‘బ్రాండ్‌పేరుతో నకిలీ వజ్రాలను వినియోగదారులకు అంటగడుతున్నారు. వాటికి సంబంధించి ఇస్తున్న ధ్రువపత్రాలు కూడా నకిలీవే అని సంస్థ మాజీ ఎండీ సంతోష్ శ్రీవాత్సవ చెప్పారు.

అక్కడ గ్రేడ్‌-ఏ గా అమ్ముతున్న వజ్రాలన్నీ నిజానికి గ్రేడ్‌-సీ కిందకు వస్తాయి. వాటి అమ్మకం ధరలో కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ప్రయోగశాలలో వాటిని తయారుచేయడానికి ఖర్చవుతోంది’అని ఆ సంస్థ మాజీ ఎండీ సంతోష్‌ శ్రీవాత్సవ బయటపెట్టారు.

మెహుల్‌ చోక్సీ సహా తన అల్లుడు నీరవ్‌ మోదీ కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13 వేలకోట్లకు మోసం చేసి విదేశాలకు పారిపోయారు. అక్కడ పౌరసత్వం పొంది వ్యాపారాలు చేసుకోవడం, ఏ తప్పూ చేయని వ్యక్తుల్లా స్వేచ్ఛగా తిరుగుతుండటం గమనార్హం.

నకిలీ వజ్రాల సంగతిని ఫర్హాద్ వాడీ అనే వజ్రాల వ్యాపారి 2017లోనే హెచ్చరించారు. మెహుల్ చోక్సీ మోసాలకు అసలు లెక్కే లేదు. నకిలీ కంపెనీల పేరిట అమెరికా ఆర్థిక సంస్థలను బురిడీ కొట్టింది రుణాలు కొట్టేసిన ఘనత మెహుల్ చోక్సీది. పీఎన్బీలో మోసం బయట పడకముందే లండన్ నగరానికి నీరవ్ మోదీ.. ఆఫ్రికా ఖండ దేశం అంటిగ్వాకు మెహుల్ చోక్సీ పారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.