ఎన్నికల ఫలితాలు మార్కెట్లలో జోష్ నింపాయి. మార్చి నెలలో ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతో వరుసగా పతనం అవుతున్న బెంచ్ మార్క్ సూచీలు, ఎగ్జిట్ పోల్స్ నుంచి పుంజుకోగా, నేటి ఎన్నికల ఫలితాలతో మెటల్ మినహా అన్ని రంగాల స్టాక్స్ పుంజుకున్నాయి.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ (BJP) బలం కనబరుస్తోంది. దీంతో అందుతున్న పాజిటివ్ ధోరణులతో స్టాక్ మార్కెట్ కొనుగోళ్ల ఉత్సాహాన్ని చూస్తోంది. భారీ కొనుగోళ్ల మధ్య సెన్సెక్స్ దాదాపు 1,600 పాయింట్ల లాభాన్ని పొందింది.
ఉదయం 10.10 గంటలకు సెన్సెక్స్ 1,317 పాయింట్లు, 2.41 శాతం లాభంతో 55965 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు, 2.27 శాతం లాభంతో 16716 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్నికల్లో ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది.
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి, బీజేపీ మెరుగైన పనితీరు కనబరుస్తుండటం మార్కెట్లు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. అటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉదయం 10 గంటల నుంచే బిజెపి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సూచిస్తున్నాయి. అదే సమయంలో పంజాబ్‌లో ఆప్ మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
మెటల్ మినహా అన్నిసెక్టార్లలో ర్యాలీ
వరుస పాజిటివ్ వార్తల దృష్ట్యా బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా రియల్ ఎస్టేట్, ఇంధనం వంటి రంగాలు స్టాక్ మార్కెట్‌లో మంచి రికవరీ సాధిస్తున్నాయి. మరోవైపు, మార్కెట్ సానుకూల సెంటిమెంట్‌తో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్‌లు చాలా ప్రయోజనం పొందుతున్నాయి. కానీ కేవలం మెటల్ సెక్టార్ మాత్రం అమ్మకాలను చూస్తోంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. మరోవైపు, నిఫ్టీలోని 50 షేర్లలో 45 స్టాక్‌లు బలంగా ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్ల బలం
ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా భారత మార్కెట్లకు బలమైన మద్దతు లభిస్తోంది. తైవాన్ స్టాక్ మార్కెట్ దాదాపు 2.50 శాతం, స్ట్రెయిట్ టైమ్స్ 1.75 శాతం, కోస్పి 2.10 శాతం, హ్యాంగ్ సెంగ్ 1.70 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. షాంఘై సూచీ కూడా 1.50 శాతం లాభంతో ట్రేడవుతోంది. అంతకుముందు, బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ 460 పాయింట్ల లాభంతో 3.59 శాతం లాభంతో ముగిసింది.
