న్యూ ఢీల్లీ: దేశంలో కీలకమైన సైబర్-మౌలిక సదుపాయాలను భద్రపరచడానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి)  కంప్యూటర్లపై మాల్వేర్ దాడి జరిగింది. ఎన్‌ఐసికి సంబంధించిన 100కి పైగా కంప్యూటర్లపై  హ్యాక్ గురైనట్లు సమాచారం.

భారతీయ రాజకీయ నాయకులు, సాయుధ దళాల అధికారులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులపై చైనా నిఘా పెట్టినట్లు ఇటీవల వచ్చిన  నివేదికల దృష్ట్యా ఈ సంఘటన ఆందోళనలను రేకెత్తిస్తుంది. మాల్వేర్  దాడి  పై వెంటనే ఢీల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది.

ప్రాధమిక దర్యాప్తు ప్రకారం బెంగళూరులోని ఒక సంస్థ నుండి వచ్చిన ఇమెయిల్ ద్వారా మాల్వేర్ దాడి  జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగి పోలీసు ఫిర్యాదులో తన ఇమెయిల్‌ను యాక్సెస్ చేయలేకపోయానని, ఏదో హాని ఉందని చెప్పాడు. తరువాత, అతని కంప్యూటర్ మాత్రమే కాకుండా, చాలా కంప్యూటర్లు కూడా మాల్వేర్ బారిన పడ్డాయని కనుగొన్నరు.

ప్రాథమిక దర్యాప్తులో మాల్వేర్ కలిగిన  ఇమెయిల్ అన్నీ కంప్యూటర్లకు వచ్చినట్లు కనుగొన్నారు. వినియోగదారులు ఇమెయిల్‌పై క్లిక్ చేసినప్పుడు, వారి కంప్యూటర్లు మాల్వేర్ దాడికి  ప్రభావితమయ్యాయి.

ఈ మాల్వేర్ బగ్  బెంగళూరులోని ఒక ఐటి కంపెనీ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు, అయినప్పటికీ, బగ్ ఉన్న ఇమెయిల్ యునైటెడ్ స్టేట్స్ నుండి ప్రాక్సీ సర్వర్ ద్వారా బెంగళూరు ఆధారిత సంస్థకు పంపించినట్లు  కూడా అనుమానిస్తున్నారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఎన్ఐసి సైబర్ హబ్‌లోని కంప్యూటర్లలో భారతదేశ భద్రత, పౌరులు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యకర్తలు, ప్రధాన మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, హోంమంత్రి సంబంధిత ముఖ్యమైన సమాచారం, డేటా ఉన్నాయని తెలిపారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజి పరిధిలోకి వచ్చే ఎన్‌ఐసి జాతీయ, రాష్ట్ర స్థాయి ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టుల అమలులో సహాయపడుతుంది, ప్రభుత్వ విభాగాలకు కన్సల్టెన్సీని అందిస్తుంది.