న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ముందుకు వెళ్లేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ చురుగ్గా సిద్ధం అవుతోంది. ఇప్పటికే అత్యంత చౌకగా వెంటిలేటర్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఈ సంస్థ తాజాగా ఫేస్‌ షీల్డ్‌ల తయారీని ప్రారంభిస్తోంది. సోమవారం నుంచి మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌ల తయారీ ప్రారంభమవుతుందని సంస్థ ఎండీ పవన్‌ గోయంకా వెల్లడించారు.

తొలుత వీటిని రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత  మరింత వేగవంతం చేస్తామని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మా భాగస్వామి ఫోర్డ్‌ మోటార్‌ నుంచి డిజైన్‌ తీసుకొన్నాం. మేము ఫేస్‌షీల్డ్‌ తయారీకి సిద్ధంగా ఉన్నాము. సోమవారం నుంచి 500 యూనిట్ల తయారీతో ఉత్పత్తిని ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు. 

భారత్‌లో వెంటిలేటర్ల కొరతను దృష్టిలోపెట్టుకొని మహీంద్రా సంస్థ వాటిపై కూడా దృష్టి పెట్టింది. రూ.7,500కే అధునాతన వెంటిలేటర్‌ అందించేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపింది. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్‌ వెర్షన్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ నమూనాను రూపొందించామని, త్వరలో దీనికి  అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Also read:గూగుల్ 800 మిలియన్ డాలర్ల డొనేషన్.. ఇంకా...
 
వాస్తవానికి ఈ వెంటిలేటర్ల ఖరీదు మార్కెట్లో రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. మహీంద్రా రూపొందించిన ఈ వెంటిలేటర్‌ సుమారు రూ.7,500 మాత్రమే అవుతుందని అంచనా వేస్తున్నామని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఇటీవల ట్వీట్‌ చేశారు. 

ఇదిలా ఉంటే, మరోవైపు మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల ఆరోగ్యంపై ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు దృష్టిసారించారు. ఎల్లవేళలా కొవిడ్‌-19 రోగులను అంటిపెట్టుకొని సేవలందిస్తున్నవారికి కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ఫేస్‌ షీల్డ్‌ను రూపొందించారు. 

ప్రొఫెసర్‌ సంతను ధారా, ప్రొఫెసర్‌ సంగీతాదాస్‌ భట్టాచార్యతో కలిసి ఇంటిలోనే ఫేస్‌ షీల్డ్‌ నమూనాకు రూపకల్పన చేశారు. ట్రాన్స్‌పరెన్సీ షీట్‌, స్పాంజ్‌, మడతల కాగితం, కార్డ్‌బోర్డు, రబ్బర్‌బ్యాండ్‌, డబుల్‌సైడ్‌ టేప్‌.. ఇలా ఇంట్లో దొరికే వస్తువులతో విజయవంతంగా ఫేస్‌ షీల్డ్‌ను రూపొందించారు.