ఆధార్ కార్డు అప్పుడప్పుడు పోగొట్టుకున్న సందర్భాలు ఎంతో మందికి ఎదురై ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని నిమిషాల్లోనే డూప్లికేట్ ఆధార్ కార్డును పొందవచ్చు. UIDAI వెబ్సైట్ నుండి నిమిషాల్లోనే ఈ ఆధార్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.
ఆధార్ కార్డు ఇప్పుడు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. భారతదేశంలో ఏ మూలకెళ్ళిన ఆధార్ కార్డు తప్పనిసరి. అలాంటి ముఖ్యమైన పత్రం ఒక్కోసారి అనుకోకుండా పొరపాటు వల్ల కనిపించకుండా పోతుంది. లేదా ఎక్కడైనా పోగొట్టుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు కంగారు పడకుండా అప్పటికప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డును తీసుకోవచ్చు. ఇది సాధారణ ఆధార్ కార్డులాగే ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్న, మొబైల్ సిమ్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. కాబట్టి ఆధార్ కార్డు పోయినప్పుడు ఆందోళన పడకుండా అప్పటికప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డును పొందండి. దీనికోసం మీరు UIDAI వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది.
ఇలా ఇ- ఆధార్ కార్డు పొందండి
మీరు ఇంట్లో కూర్చునే ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ముందుగా UIDAI అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళండి. ‘డౌన్లోడ్ ఆధార్’ అనే విభాగం పై క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ నెంబర్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి లేదా వర్చువల్ ఐడిని నమోదు చేయండి. క్యాప్చా కనిపిస్తుంది. దాన్ని నింపి ‘సెండ్ ఓటిపి’ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటిపి ని అక్కడ నమోదు చేసి ‘డౌన్లోడ్ ఆధార్’ పై క్లిక్ చేయండి. వెంటనే ఆధార్ పిడిఎఫ్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఇదే ఇ-ఆధార్. దీన్ని అరగంటలో పొందచ్చు. అవసరానికి వాడుకోవచ్చు
డూప్లికేట్ ఆధార్ కార్డు కోసం..
అలాగే UIDAI వెబ్సైట్ కి వెళ్లి ‘ఆర్డర్ ఆధార్ పివిసి కార్డు’ అని ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్యాప్చా నింపాలి. ఓటిపి పై క్లిక్ చేస్తే మీకు ఓటిపి మొబైల్ నెంబర్ కు వస్తుంది. దాన్ని సబ్మిట్ చేశాక ప్రివ్యూ కనిపిస్తుంది. అప్పుడు మీరు 50 రూపాయలు చెల్లిస్తే స్పీడ్ పోస్ట్ ద్వారా ఆధార్ కార్డు ఇంటికి చేరుతుంది. ఇదే డూప్లికేట్ ఆధార్ కార్డు.
డూప్లికేట్ ఆధార్ కార్డుకు పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు కూడా ఉపయోగపడతాయి. చిరునామా కోసం విద్యుత్తు నీరు లేదా గ్యాస్ బిల్లు బ్యాంకు, రేషన్ కార్డు వంటివి కూడా చూపించవచ్చు. ఆధార్ కార్డులో మీ పుట్టిన రోజు తేదీని మార్చాల్సి వస్తే బర్త్ సర్టిఫికెట్లు లేదా పదవ తరగతి మార్క్ షీట్ కచ్చితంగా ఉంచుకోవాలి.
ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనది. అందుకే UIDAI డూప్లికేట్ ఆధార్ కార్డు అందించే సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. అదే పివిసి కార్డు రూపంలో ఆధార్ కావాలనుకుంటే మాత్రం 50 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మీరు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని కాపీ తీసి వాడుకోవలసి వస్తుంది.
ఆధార్ కార్డు పోయినప్పుడు, కార్డు చిరిగిపోయినప్పుడు లేదా కార్డు దెబ్బతిన్నప్పుడు ఇలాంటి అదనపు కాపీలు అవసరం పడతాయి. అందుకే UIDAI ప్రజల సౌకర్యార్థం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
