మీ ఆధార్ కార్డుపై ఫోటో నచ్చలేదా? పాతదై పోయిందా? సింపుల్ గా ఇలా మార్చేయండి
ఆధార్ కార్డులో మీ ఫోటో మీకే నచ్చడం లేదా? దాన్ని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? చిటికెలో దాన్ని మార్చేసుకోవచ్చు. వంద రూపాయలు చెల్లిస్తే చాలు కొత్త ఫోటోను మార్చుకోవచ్చు.

ఆధార్ ఫోటో మార్చడం ఎలా?
ఆధార్ కార్డు మన దేశంలో ఎంతో ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారిపోయింది. మీ ఫోటోతో పాటు చిరునామా దీనిపై ఉంటుంది. అనేక ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు అత్యవసరం. దీన్ని ఫోటో గుర్తింపు కార్డుగా కూడా ప్రతి రాష్ట్రంలో గుర్తిస్తారు. కొంతమందికి ఆధార్ కార్డులో ఉన్న తమ ఫోటో నచ్చదు. మరికొంతమందికి ఆ ఫొటో స్పష్టంగా ఉండదు. దీనివల్ల వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు మీ ఫోటోలు నచ్చకపోతే సులువుగానే దాన్ని మార్చుకోవచ్చు. UIDIA ఆ ఫోటోలు మార్చే ప్రక్రియను చాలా సులభతరం చేసేసింది. అది కూడా కేవలం 100 రూపాయలుతోనే మార్చేయొచ్చు.
ఆన్ లైన్‌లో చేయలేరు
ఆధార్ కార్డు పై ఫోటో మార్చుకోవాలంటే ఆన్లైన్లో మాత్రం కుదరదు. మీరు ఆఫ్ లైన్ లోనే చేసుకోవాలి. ఇందుకోసం దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీకు కొత్త ఫోటోను తీస్తారు. తర్వాత అది సైట్లో అప్ లోడ్ చేస్తారు. అప్పుడే మీరు కొత్త ఆధార్ కార్డు పై కొత్త ఫోటోను పొందగలరు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుంది?ఎలా చేయాలి? ఏం పత్రాలు ఉండాలో తెలుసుకోండి.
వందరూపాయల ఖర్చు
ఆధార్ కార్డులో ఫోటో మార్చడానికి 100 రూపాయల ఫీజు వసూలు చేస్తారు. ఫోటో మార్చడానికి అదనపు పత్రాలు ఏవీ అవసరం లేదు.మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.మీకు దగ్గరలోని ప్రభుత్వ ఆధార్ కేంద్రానికి వెళ్లి వారిని ఫోటో మార్చమని కోరండి.ఇందుకోసం మీరు ఒక ఫారంను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న ఎగ్జిక్యూటివ్ మీ కొత్త ఫోటోను తీసుకుంటారు. ఇలా తీసినందుకు 100 రూపాయలు చెల్లించాలి.
పాస్ వర్డ్ ఇదే
UIDAI అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లే ‘మై ఆధార్’ విభాగంలో ‘డౌన్లోడ్ ఆధార్’ పై క్లిక్ చేయాలి. అందులో మీరు మీ ఆధార్ నెంబర్ ను కొట్టాక కొన్ని వివరాలు అడుగుతుంది. అవన్నీ మీరు నింపాలి. తర్వాత ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీని కూడా అక్కడ మీరు నింపిన తర్వాత పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అదే మీ కొత్త ఆధార్ కార్డు ఆ పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ కావాలి. అంటే ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీ ఆధార్ కార్డు పై ఉన్న మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, ఆ తర్వాత మీరు పుట్టిన సంవత్సరం వరుసగా కొడితే అదే మీ పాస్వర్డ్ అవుతుంది. అయితే అక్షరాలను క్యాపిటల్ లెటర్స్ లోనే కొట్టాలి. సాధారణంగా ఈ ఫోటో అప్డేట్ అవ్వడానికి నెల రోజులు సమయం పడుతుంది. కొన్నిసార్లు మూడు నెలలు కూడా పట్టవచ్చు.
ఫోటో ఎప్పుడు మార్చాలి?
ఆధార్ కార్డు లోని ఫోటో స్పష్టంగా లేకపోయినా లేదా అది పాతదిగా కనిపిస్తున్నా, గుర్తించలేని విధంగా ఉంటే వెంటనే ఆధార్ కార్డు పై ఫోటోలు మార్చుకోవడం ఉత్తమం. బ్యాంకులు, విమానాశ్రయాలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అలాంటి ఆధార్ కార్డు వల్ల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి స్పష్టమైన ఫోటో కోసం మీరు వంద రూపాయలు ఖర్చుపెట్టి ఫోటోలు మార్చడం చాలా ముఖ్యం. ప్రధానంగా చిన్నపిల్లల విషయంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఐదేళ్ల వయసులో లేదా మూడేళ్ల వయసులో ఆధార్ కార్డును తీసుకుంటారు. వారికి పదేళ్లు దాటినా కూడా అదే ఆధార్ కార్డును వాడుతారు. కాబట్టి మీ పిల్లలు పెద్దయిన తర్వాత కచ్చితంగా ఆధార్ కార్డుపై ఫోటోలు మార్చుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. లేకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ అందే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆధార్ కార్డు పై ఉన్న ఫోటోను ధ్రువీకరించలేకపోవచ్చు.