భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) రుణం ఇప్పుడు చాలా సులభంగా పొందవచ్చు. ఇంతకుముందు రుణం పొందాలంటే చాలా పెద్ద ప్రయాసతో కూడున్నదిగా ఉండేది. పాలసీదారుడు రుణం కావాలంటే గతంలో బాండ్లు పట్టుకుని కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది.

కానీ, ఇప్పుడు పాలసీ బాండ్లపై ఆన్‌లైన్ ద్వారా రుణ సౌకార్యాన్ని అందిస్తోందీ సంస్థ. ఇంటర్నెంట్ ఉంటే ఇంట్లో నుంచి రుణం పొందేందుకు ఎల్ఐసీ అవకాశం కల్పిస్తోంది. 

ఆన్‌లైన్ రుణం పొందడం ఎలా?

- ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ అయిన https://www.licindia.inలోకి లాగిన్ కావాలి.
- ఆన్‌లైన్ సర్వీసెస్ కాలమ్‌లో ‘Online Loan’ ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కస్టమర్ పోర్టల్‌పై క్లిక్ చేయాలి.
- అంతుకుముందే ఎల్ఐసీలో ఆన్‌లైన్ సేవలు పొందుంటే వివరాలు ఇచ్చి ముందుకు సాగాలి.
- కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీతో లాగిన్ కావొచ్చు. 
- ఒక వేళ కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ వద్ద సైన్‌అప్ క్లిక్ చేసి అక్కడున్న వివరాలు పూర్తి చేయాలి.

- రుణం కోసం దాఖలు చేసుకుంటే పాలసీదారుడి బ్యాంకు ఖాతాలో రుణం జమ అవుతుంది. ఎల్ఐసీ బాండ్ స్వాధీనపరిస్తే ఎంతైతే వస్తుందో అందులో 90శాతం రుణం లభిస్తుంది. పెయిడ్‌అప్ పాలసీలైతే 85శాతం రుణం మంజూరు చేస్తారు.

ఎల్ఐసీ ఆన్‌లైన్ లోన్ వల్ల ప్రయోజనాలు: 

- ఆన్‌లైన్ ద్వారా ఎల్ఐసీ లోన్ పాలసీని అప్లై చేసుకోవచ్చు.
- ఇతర రుణాల కంటే ఈ లోన్ పాలసీ వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి.

- ఈ తరహా రుణాలపై ఎల్ఐసీ 10శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తూ పాలసీ గడువు ముగిసే వరకు అసలు చెల్లించకుండా రుణాలు సాగించుకోవచ్చు. 

- మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నుంచి ఎల్ఐసీ అసలును మినహాయించుకుంటుంది లేదా పాలసీదారుడు మరణిస్తే పరిహారం నుంచి తగ్గించుకుంటుంది. ఒక వేళ వడ్డీ కూడా చెల్లించకుంటే మాత్రం పాలసీని ముందే టెర్మినేట్ చేసే హక్కు సంస్థకు ఉంది. 

రుణం తీసుకున్న తర్వాత ఆరు నెలలోపే పాలసీదారుడు మరణిస్తే లేదా కాల వ్యవధి తీరితే అప్పటి వరకే వడ్డీని ఎల్ఐసీ లెక్కకడుతుంది. రుణం తీసుకోవాలంటే పాలసీ తీసుకుని కనీసం మూడేళ్లు పూర్తై సరెండర్ వాల్యూ కలిగి ఉండాలి. పాలసీ బాండును ఎల్ఐసీ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పాలసీదారుడి అర్హతను బట్టి అదే పాలసీపై రెండో రుణం తీసునే అవకాశం ఉంటుంది.

చదవండి: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పాలసీ: తెలుసుకోవాల్సిన విషయాలు